Jagan Delhi : అచ్చొచ్చిన ఢిల్లీ నుంచే జగన్ పోరాటం

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వంపై వార్ మొదలు పెట్టేశారు మాజీ సీఎం జగన్. ఘోర ఓటమి తర్వాత నెల రోజులుగా ఆయనకు ఏం చేయాలో తెలియలేదు. అందుకే తాడేపల్లి టు పులివెందులు... అక్కడి నుంచి బెంగళూరు... మళ్ళా తాడేపల్లి... మళ్ళీ బెంగళూరు... ఇలా చక్కర్లు కొట్టారు. జులై 15 నుంచి ప్రజాదర్భార్ అన్నారు... అంతకుముందు ఓదార్పు ఉంటుందని టాక్ వచ్చింది.

 

 

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వంపై వార్ మొదలు పెట్టేశారు మాజీ సీఎం జగన్. ఘోర ఓటమి తర్వాత నెల రోజులుగా ఆయనకు ఏం చేయాలో తెలియలేదు. అందుకే తాడేపల్లి టు పులివెందులు… అక్కడి నుంచి బెంగళూరు… మళ్ళా తాడేపల్లి… మళ్ళీ బెంగళూరు… ఇలా చక్కర్లు కొట్టారు. జులై 15 నుంచి ప్రజాదర్భార్ అన్నారు… అంతకుముందు ఓదార్పు ఉంటుందని టాక్ వచ్చింది. చివరకు అవేవీ స్టార్ట్ చేయలేదు. ఏపీలో జరుగుతున్న హత్యల ఇష్యూని నేషనల్ లెవల్ కి తీసుకెళ్ళాలని డిసైడ్ అయ్యారు. ఢిల్లీ నుంచి చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై పోరాటం మొదలుపెట్టబోతున్నారు. కూటమి ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తున్న వైసీపీ అధినేత జగన్…. ఈనెల 24న ఢిల్లీలో ధర్నాకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పార్టీకి చెందిన లోక్ సభ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి ఈ ధర్నా చేయబోతున్నారు. ఇటీవల ఏపీలో జరిగిన దాడులు, హత్యలు, చిన్న పిల్లలపై అత్యాచారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోడీకి వివరిస్తానంటున్నారు జగన్.

గతంలో తనకు అచ్చొచ్చిన… తన రాజకీయ జీవితానికి పునాది వేసి ఢిల్లీ నుంచే ఏపీలో కూటమి ప్రభుత్వంపై పోరాటానికి దిగుతున్నారు జగన్. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టడానికి ముందు జగన్ తన రాజకీయాన్ని ఢిల్లీలోనే స్టార్ట్ చేశారు. వైఎస్సార్ చనిపోయిన తర్వాత కూడా కాంగ్రెస్ లోనే కొనసాగిన జగన్… ఆ తర్వాత కొంతకాలానికి సొంతంగా వైసీపీని పెట్టుకున్నారు. ఓదార్పు యాత్ర నిర్వహణకు అనుమతి ఇవ్వాలని అప్పట్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు జగన్. ఆమె అందుకు ఒప్పుకోకపోవడంతో… కాంగ్రెస్ కి రిజైన్ చేయాలని ఢిల్లీలోనే నిర్ణయం తీసుకున్నారు. 2014 లో ఏపీలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్… ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో కొందరు జాతీయ పార్టీ నేతలను కలిశారు. ఇదే డిమాండ్ తో 2015 ఆగస్టులో ఢిల్లీలో నిరాహార దీక్ష కూడా చేశారు. 67 మంది ఎమ్మెల్యేలతో అప్పట్లో జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేశారు జగన్.

ఇప్పుడు ఏపీలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై యుద్ధాన్ని కూడా ఢిల్లీలోనే మొదలుపెడుతున్నారు జగన్. ఢిల్లీ నుంచి వచ్చాక… ఏపీలో ఓదార్పు యాత్రలు, ధర్నాలు, ఆందోళనలు చేపట్టబోతున్నట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. హస్తిన వెళ్ళొచ్చాక… వైసీపీ ఫ్యూచర్ టర్న్ అవుతుందా లేదా అన్నది చూడాలి.