మరో 5 రోజుల్లో వన్డే ప్రపంచకప్ 2023 ఆరంభం కానుంది. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ , రన్నరప్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే పోరుతో ప్రపంచకప్ మహా సంగ్రామానికి తెర లేవనుంది. వన్డే ప్రపంచకప్ భారత్ లో జరుగుతుండటంతో ఈసారి టీమిండియానే కప్పు కొడుతుందని అభిమానులు గంపెడు ఆశతో ఉన్నారు. అయితే భారత దిగ్గజం సునీల్ గావస్కర్ ప్రపంచకప్ గెలిచే జట్టు ఏదో ముందే చెప్పేశాడు. వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ షోలో పాల్గొన్న గవాస్కర్.. ప్రపంచకప్ గెలిచే జట్టును అంచనా వేసాడు. ‘వన్డే ప్రపంచకప్ 2023ను డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ సొంతం చేసుకుంటుంది. ఎందుకంటే టైటిల్ గెలిచే సత్తా ఆ జట్టుకు మాత్రమే ఉంది. బ్యాటింగ్ విభాగం.. బౌలింగ్ విభాగం అద్భుతంగా ఉంది’ అంటూ గావస్కర్ పేర్కొన్నాడు. మ్యాచ్ ను మలుపు తిప్పగల ఆల్ రౌండర్లు ఇంగ్లండ్ జట్టులో ఉన్నారని.. బలమైన బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ ఉన్న ఇంగ్లండ్ ను ప్రపంచకప్ లో ఆపడం ఎవరి వల్ల అయ్యే పని కాదని గావస్కర్ తన అభిప్రాయాన్ని తెలిపాడు.
గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్ లో ఇంగ్లండ్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇంగ్లండ్ బజ్ బాల్ క్రికెట్ తో ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తోంది. ఈసారి కూడా ఇంగ్లండే విజేతగా నిలిస్తే.. వరుసగా రెండు ఎడిషన్స్ లో ప్రపంచకప్ నెగ్గిన మూడో జట్టుగా ఇంగ్లండ్ నిలుస్తుంది. గతంలో వెస్టిండీస్ 1975, 1979, ఆస్ట్రేలియా 1999, 2003, 2007 సంవత్సరాలలో మాత్రమే ఈ ఘనతను సాధించాయి. అయితే భారత మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ మాత్రం ఈసారి ప్రపంచకప్ ను భారత్ గెలుస్తుందని పేర్కొన్నాడు. ప్రస్తుతం భారత్ సూపర్ ఫామ్ లో ఉందని అతడు పేర్కొన్నాడు. బుమ్రా రాకతో బౌలింగ్ బలంగా ఉందన్నాడు. భారత్ తన టైటిల్ వేటను అక్టోబర్ 8న ఆరంభించనుంది. చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే పోరుతో భారత్ ప్రపంచకప్ ప్రయాణాన్ని ఆరంభిస్తుంది. టీమిండియా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లను టైటిల్ ఫేవరెట్స్ గా క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.