Mahender Reddy: టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి..

టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్ పదవి కోసం ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించగా.. 370 వరకు దరఖాస్తులు వచ్చాయి. వాటిని స్క్రీనింగ్ కమిటీ పరిశీలించింది. చైర్మన్ పదవి కోసం ఈ కమిటీ మరో ఇద్దరి పేర్లను పరిశీలించింది. చివరకు మహేందర్ రెడ్డి వైపే మొగ్గుచూపింది.

  • Written By:
  • Publish Date - January 25, 2024 / 02:49 PM IST

Mahender Reddy: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) ఛైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియమితులయ్యారు. మహేందర్ రెడ్డిని చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు తెలంగాణ గవర్నర్ తమిళిసై ఆమోదముద్ర వేశారు. చైర్మన్‌తోపాటు టీఎస్‌పీఎస్‌సీ బోర్డు సభ్యుల్ని కూడా నియమించింది ప్రభుత్వం. బోర్డు సభ్యులుగా రిటైర్డ్ ఐఏఎస్ అనిత రాజేంద్ర, అమీర్ ఉల్లాఖాన్, యాదయ్య, పాల్వాయి రాజనీ కుమారి, వై రామ్మోహన్ రావును నియమించారు.

YS SHARMILA: వైఎస్ కుటుంబం చీలడానికి జగనే కారణం.. జగన్ ఒక నియంత: వైఎస్ షర్మిల

టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్ పదవి కోసం ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించగా.. 370 వరకు దరఖాస్తులు వచ్చాయి. వాటిని స్క్రీనింగ్ కమిటీ పరిశీలించింది. చైర్మన్ పదవి కోసం ఈ కమిటీ మరో ఇద్దరి పేర్లను పరిశీలించింది. చివరకు మహేందర్ రెడ్డి వైపే మొగ్గుచూపింది. దీంతో ఆయన టీఎస్ పీఎస్సీ ఛైర్మన్‌గా ఎంపికయ్యారు. స్క్రీనింగ్ కమిటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి నిర్మల ఉన్నారు. వీరి సూచన మేరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గవర్నర్‌కు మహేందర్ రెడ్డి పేరును సిఫారసు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి.. నేరుగా గవర్నర్‌ను కలిసి, ఈ అంశంపై చర్చించారు. దీంతో గవర్నర్ సులభంగానే చైర్మన్‌తోపాటు, బోర్డు సభ్యుల నియామకానికి ఆమోదం తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో గ్రూప్ పరీక్షలకు సంబంధించి ప్రశ్నాపత్రాలు లీక్ అయిన సంగతి తెలిసిందే. దీంతో బోర్డుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

దీంతో తాము అధికారంలోకి వస్తే.. యూపీఎస్సీ తరహాలో టీఎస్‌పీఎస్‌సీని ప్రక్షాళన చేస్తామని కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చింది. అందుకు అనుగుణంగానే తాజాగా నియామకాలు చేపడుతోంది. బోర్డు ఏర్పాటైతే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతం అవుతుంది. నిబంధనల ప్రకారం బోర్డులో ఛైర్మన్‌, 10 మంది సభ్యులు ఉండాలి. చైర్మన్‌తోపాటు ఐదుగురు సభ్యులు నియామకం కాగా.. మిగతా సభ్యుల్ని త్వరలోని నియమిస్తారు. కొత్త బోర్డు సభ్యులను నియమించిన తర్వాతే పోటీ పరీక్షలు నిర్వహించాలని సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.