ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో స్వేచ్చ పేరుతో సినిమా వాళ్ళ జీవితాలను బజారులో పెట్టె విధంగా కొన్ని యూట్యూబ్ ఛానల్ ప్రచారం చేస్తున్న అంశాలు వివాదాస్పదం అవుతున్నాయి. తప్పుడు ప్రచారం చేస్తూ సినిమా వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి కూడా వెళ్ళిపోయి కథనాలు ప్రసారం చేస్తున్నారు. వీటికి జనాలు కూడా ఆసక్తి చూపిస్తున్న నేపధ్యంలో ఇలాంటి కథనాలు ఎక్కువయ్యాయి అనే చెప్పాలి. దీనిపై ఫిర్యాదులు చేస్తున్నా సరే ఏదోక రూపంలో కంటెంట్ వస్తూనే ఉంది. ఇటీవల మంచు విష్ణు కొన్ని యూట్యూబ్ చానల్స్ ను రద్దు చేయించారు.
దీనిపై నటి మీనా హర్షం వ్యక్తం చేసారు. తన రెండో వివాహం గురించి తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్న చానల్స్ ను బ్యాన్ చేయించినందుకు ఆమె మంచు విష్ణుకి ధన్యవాదాలు తెలిపారు. తాజాగా మాజీ హీరోయిన్ రాధిక కూడా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసారు. మంచు విష్ణు చర్యను అభినందిస్తూ తమ సినిమా పరిశ్రమ కూడా మేల్కొని త్వరగా చర్యలు తీసుకుంటే మంచిది అంటూ ఆమె కోరారు. నడిగర్ సంఘం కూడా ఈ విషయంలో మేల్కొని చర్యలు తీసుకోవడం మంచిది అన్నారు రాధిక.. జర్నలిస్టులుగా చెప్పుకునే కొందరు వ్యక్తులు చాలామంది తప్పుడు కథనాలు రాస్తున్నారని అన్నారు.
సెలెబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై అదేపనిగా అసత్య కథనాలను యూట్యూబ్ చానల్స్ వేదికగా ప్రసారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వారిపై తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి ఉదయనిధి స్టాలిన్, అలాగే కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి వాటిని పూర్తి స్థాయిలో కట్టడి చేసేందుకు నూతన చట్టాలు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని రాధిక అభిప్రాయపడ్డారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు తమిళ సినిమా పరిశ్రమ ఏకతాటి మీదకు రావాల్సిన అవసరం ఉందని ఆమె తన మనసులో మాట బయటపెట్టారు. ఈ అంశంపై స్పందించినందుకు గానూ మీనా… రాధికకు ధన్యవాదాలు తెలిపారు.