Narayana: నారాయణ నారా జపం వెనుక ఆంతర్యం ఇదేనా..

తెలుగుదేశం పార్టీకి 2014లో వెన్నుదండుగా నిలిచి పార్టీ అధికారంలోకి రావడానికి కృషిచేసిన నాయకులలో పొన్నూరు నారాయణ ఒకరు. తాజాగా నెల్లూరు టీడీపీ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రానున్న రోజుల్లో తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అంటూ జోస్యం చెప్పారు.

  • Written By:
  • Publish Date - July 27, 2023 / 09:05 AM IST

నారాయణ విద్యాసంస్థల అధినేత నెల్లూరు పార్టీ ఇంచార్జ్ గా ప్రస్తుతం కొనసాగుతున్నారు. గతంలో మంత్రిగా చేసిన ఈయన వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తాజాగా మహాశక్తి కార్యక్రమంలో భాగంగా ఫోకస్ లోకి వచ్చారు. వచ్చి రావడంతోనే అమరావతి భూములపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజధానికోసం 33 వేల ఎకరాలను 58 రోజుల్లో సేకరించామని అది అరుదైన రికార్డ్ అని తెలిపారు. అమరావతి నిర్మాణం కోసం వివిధ దేశాలు తిరిగామని ఎక్కడా లేని విధంగా అద్భుతంగా నిర్మించేందుకు నిధులు సేకరించామన్నారు.

నెల్లూరు జిల్లాను దేశంలోనే గొప్ప నగరంగా అగ్రస్థానంలోకి తీసుకొచ్చేందుకు కృషిచేస్తానని వివరించారు. నెల్లూరు ప్రస్తుత నగర ఎమ్మెల్యేలు నా గురించి తప్పుగా మాట్లాడారని, నన్ను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబుతో 1993 నుంచి కలిసి ఉన్నానని తెలిపారు. 2014లో హైదరాబాద్ కేంద్రంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అనేక రకాల వర్క్ షాపులు నిర్వహించినట్లు తెలిపారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు నెల్లూరు నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలని కోరితే దీనికి  పూర్తి సహకారాన్ని అందించారన్నారు.

ప్రస్తుతం ఉన్న జగన్ సర్కార్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడున్న సైకో సీఎం తనపై ఎన్నో అక్రమ కేసులు పెట్టారని విమర్శలు చేశారు. ఈ నాలుగేళ్లుగా హైదరాబాద్ లోని టీడీపీ కేంద్రకార్యాలయంలో వారానికి మూడు రోజులు అక్కడే ఉండి పనిచేశానని వివరించారు. ఇన్ని రోజులు మాట్లాడని నారాయణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇలా బయటికి వచ్చి మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. రానున్న రోజుల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా.. లేక తమ వారసులను రేసులోకి దింపుతారా అనేది వేచిచూడాలి.

T.V.SRIKAR