వైసీపీ ప్రభుత్వంలో రాయలసీమను తన చెప్పు చేతల్లో పెట్టుకున్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆ ఏరియాను ఓ సామంత రాజులాగా పాలించారు. కానీ ఇప్పుడు సొంత నియోజకవర్గం పుంగనూరులోనే అడుగుపెట్టే పరిస్థితి ఏర్పడింది. పెద్దిరెడ్డితో పాటు ఆయన కొడుకు ఎంపీ మిథున్ రెడ్డిని కూడా టీడీపీ శ్రేణులు తరిమికొడుతున్నాయి.
పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పిందే శాసనం… వైసీపీ హయాంలో అక్కడ టీడీపీ నేతలు అడుగుపెట్టాలంటేనే భయంతో వణికిపోయారు. చంద్రబాబు అంగళ్ళు పర్యటనను కూడా అడ్డుకున్నారు పెద్దిరెడ్డి మనుషులు. రాయలసీమను గడ గడలాడించిన… రామచంద్రారెడ్డి, ఆయన కొడుకు మిథున్ రెడ్డికి ఇప్పుడు పుంగనూరులో అడుగుపెట్టాలంటే చెమటలు పడుతున్నాయి. పుంగనూరులోనే కాదు… చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించలన్నా… పెద్దిరెడ్డి మనుషులు చెలరేగిపోయేవారు. కుప్పంలో చంద్రబాబు, హిందూపురంలో బాలకృష్ణను ఓడిస్తానని శపథం చేశాడు పెద్దిరెడ్డి. చివరకు తన సీటు తప్ప అన్నీ టీడీపీ, మిత్రపక్షాలే గెలిచాయి. ఇక ఎంపీ మిథున్ రెడ్డి కూడా వైసీపీలో కీలకనేత. ఏపీలో అభ్యర్థులను మార్చడం దగ్గర నుంచి పార్టీకి అన్నీ తానై వ్యవహరించారు. ఎన్నికల నిర్వహణ అంతా పర్యవేక్షించారు. అంతేకాదు… పిఠాపురంలో పవన్ కల్యాణ్ ను ఓడించే బాధ్యత కూడా మిథున్ రెడ్డి తీసుకున్నారు. అందుకోసం రాయలసీమ నుంచి మనుషులను తెచ్చినట్టు పవన్ కల్యాణ్ కూడా ఆరోపించారు. వైసీపీ హయాంలో ఓ వెలుగు వెలిగిన తండ్రీ కొడుకుల ఆధిపత్యానికి ఇప్పుడు ఫుల్ స్టాప్ పడింది.
ఎన్నికలయ్యాక… పుంగనూరుకు వద్దామనుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టీడీపీ శ్రేణులు అడ్డగించాయి. దాంతో హైదరాబాద్ లోనే మకాం పెట్టారు. మిథున్ రెడ్డి పరిస్థితి కూడా అంతే. ఈ పరిస్థితుల్లో రాయలసీమ మాటేమో గానీ… కనీసం పుంగనూరులో కూడా పాలిటిక్స్ చేయలేని పరిస్థితి పెద్దిరెడ్డి కుటుంబానికి ఏర్పడింది. పైగా వందల కోట్ల విలువైన భూముల ఆక్రమణ, అక్రమ మైనింగ్స్… ఇలా చాలా కుంభకోణాలు పెద్దిరెడ్డిని చుట్టుముడుతున్నారు. ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు వాడుకోకుండా… నాలుగు కాదు… నలభై రాళ్ళు వెనకేసుకోవాలనీ… పెత్తనం చెలాయించాలని చూసిన పొలిటికల్ లీడర్లకు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో ఇప్పుడు అర్థమవుతోంది.