ఐపీఎల్ మెగావేలంలో ఈ సారి పలువురు సీనియర్ ప్లేయర్స్ కు షాక్ తగిలింది. ఊహించినట్టుగానే వెటరన్ ప్లేయర్స్ ను ఫ్రాంచైజీలు పెద్దగా పట్టించుకోలేదు. ఫ్రాంచైజీలు పట్టించుకోని ఆటగాళ్ళ జాబితాలో విదేశీ క్రికెటర్లతో పాటు భారత స్టార్ క్రికెటర్లు కూడా ఉన్నారు. విదేశీ పవర్ హిట్టర్లకి కూడా ఫ్రాంఛైజీలు మొండిచేయి చూపాయి. ఫిట్నెస్, ఫామ్, నిలకడని పరిగణలోకి తీసుకుంటున్న ఫ్రాంఛైజీలు.. చాలా మంది భారత క్రికెటర్లు తక్కువ ధరకే వస్తున్నా పట్టించుకోలేదు. టెస్ట్ బ్యాటర్లుగా ముద్రపడడం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడిన అజింక్య రహానె 1.50 కోట్ల కనీస ధరతో వేలానికిరాగా.. అతడ్ని ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయలేదు. అలాగే గతంలో సన్ రైజర్స్ కు ఆడిన ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కు సైతం నిరాశే మిగిలింది. కోటి బేస్ ప్రైస్ తో వేలానికి రాగా.. ఎవరూ కొనుగోలు చేయలేదు. ఇదిలా ఉంటే ఢిల్లీ క్యాపిటల్స్ విధ్వంసక ఓపెనర్ పృథ్వీ షా రూ.75 లక్షలతో వేలానికి వచ్చినా ఏ టీమ్ బిడ్ వేయలేదు.
ఆరు బంతుల్లో ఆరు బౌండరీలు కొట్టగల సామర్థ్యం ఉన్న పృథ్వీ షాని వేలంలో ఏ ఫ్రాంఛైజీ పట్టించుకోలేదు. భారత్ జట్టులో అగ్రశ్రేణి ఆల్‌రౌండర్‌గా ఓ వెలుగు వెలిగిన శార్ధూల్ ఠాకూర్ 2 కోట్లతో వేలానికి రాగా.. అతడ్ని కూడా ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. అటు తెలుగు క్రికెటర్ శ్రీకర్ భరత్ కు కూడా నిరాశే మిగిలింది. భరత్ 75 లక్షలతో వేలానికి రాగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పాటు అతను గతంలో ఆడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బిడ్ వేసేందుకు ట్రై చేయలేదు. ఇక సీనియర్ స్పిన్నర్ పీయూస్ చావ్లా సైతం అన్ సోల్డ్ గా మిగిలిపోయాడు. చావ్లా 50 లక్షల కనీస ధరతో వేలంలోకిరాగా.. ఏ ఫ్రాంఛైజీ పట్టించుకోలేదు.
మరోవైపు విదేశీ సీనియర్ క్రికెటర్లకు సైతం ఫ్రాంచైజీలు షాక్ ఇచ్చాయి. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 2 కోట్లతో వేలానికిరాగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ కనీసం పట్టించుకోలేదు. ఐపీఎల్లో సుదీర్ఘకాలంగా ఆడుతున్న విలియమ్సన్ 2015లో ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చాడు.ఓవరాల్ గా 79 మ్యాచ్‌లల్లో 2,128 పరుగులు చేశాడు. ఇందులో 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మంచి రికార్డ్ ఉన్నప్పటికీ కేన్ విలియమ్సన్‌పై బెట్ వేయడానికి ఏ ఫ్రాంఛైజీ ముందుకు రాలేదు. గత సీజన్ లో గుజరాత్ టైటాన్స్ తరఫున రెండు మ్యాచ్‌లే ఆడిన కేన్ గాయం వల్ల సీజన్ నుంచి అర్ధాంతరంగా తప్పుకోవాల్సి వచ్చింది. ఇక ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ కోటితో వేలానికి రాగా అమ్ముడుపోలేదు. వెస్టిండీస్ పవర్ హిట్టర్ షై హోప్ 1.25 కోట్లతో వేలానికి వచ్చినా అమ్ముడుపోలేదు. న్యూజిలాండ్ బ్యాటర్లు డార్లీ మిచెల్ , గ్లెన్ ఫిలిప్స్ 2 కోట్లతో వేలానికిరాగా ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించలేదు.