Frenchman Lucidi: వినోదం వికటిస్తే.. విషాదమే.!!

ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ వింత చేష్టలు, వికృత క్రియలు చేస్తూ తెగ పాపులర్ అవుతున్నారు. వీటి వెనుక ఉన్న విషాదాన్ని అంచనా వేయకుండా సాహసోపేతమైన పనులకు పాల్పడుతూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. కన్న వారికి కంట శోకాన్ని మిగిలిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన హంకాంగ్ లో చోటు చేసుకుంది.

  • Written By:
  • Publish Date - July 31, 2023 / 04:39 PM IST

ఇతని పేరు రెమీ లుసిడి. ఫ్రాన్స్ దేశానికి చెందినవారు. ఎత్తైన భవనాలు, కట్టడాలు ఎక్కడంలో సుప్రసిద్దుడు. ఇలా చేయడం ఇతనికి ఒక సరదా. కానీ తాజాగా చేసిన సాహసం అతని ప్రాణాలనే హరించింది. దీంతో కేవలం మూడు పదుల వయసులోనే ప్రమాదవశాత్తు మృత్యువు ఒడిలోకి చేరాడు.

హాంకాంగ్ లోని ది ట్రెగంటెర్ టవర్ కాంప్లెక్స్ పైకి ఎలాగైనా ఎక్కాలని నిర్ణయించుకున్నాడు. ఈ భవంతిలోని 68వ అంతస్తుకు చేరుకున్నాడు. సెల్ఫి తీసుకోబోయాడు. ఈలోపు పెంట్ హౌస్ లోని పనిమనిషి కంట పడ్డాడు. ఆమె ఇంత ఎత్తుకి ఎక్కిన ఇతనిని చూసి ఆశ్చర్యపోయింది. ఇంతలోనే తన కాలు కిటికిలో ఇరుక్కుపోవడంతో దానిని బలంగా తన్నాడు. అప్పుడు లుసిడికి పనిమనిషి కనిపించింది. వెంటనే కాలు బ్యాలెన్స్ తప్పి అంతపై నుంచి కిందపడి చనిపోయాడు. ఎంతటి ప్రజ్ఞాశాలి, ప్రతిభావంతులైనా కాలం కలిసి రాకుంటే కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం అని ఈ సంఘటన మరో సారి రుజువు చేసింది.

దీనిపై హాంకాంగ్ అధికారులు స్పందించారు. లుసిడి సోమవారం ఉదయం 6 గంటల సమయంలో తన స్నేహితుడిని కలిసేందుకు వచ్చానని ఈ బిల్డింగ్ సెక్యూరిటీకి చెప్పారు. దీంతో సెక్యూరిటీ అతనిని లోనికి అనుమతించారు. రికార్డ్స్ ప్రకారం అధికారులు దర్యాప్తు జరిపితే 40వ అంతస్తులోని వ్యక్తి తనకు లుసిడి ఎవరో తెలియదని చెప్పాడు. దీంతో లుసిడి అబద్దం చెప్పి పైకి వచ్చాడన్న విషయం అర్థమవుతుంది. ఆ భవనంలోని 49వ ఫ్లోర్ కి చెందిన వారు లుసిడి మెట్ల మార్గం గుండా పైకి వెళ్లాడని చెబుతున్నారు. ఉదయం 7.38 గంటల సమయంలో పెంట్ హౌస్ లో అతనిని చూసిన పని మనిషి పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు. తాము ఘటనా స్థలానికి చేరుకునే లోపే అతడు బ్యాలెన్స్ తప్పి పడిపోయాడని చెబుతున్నారు. విషాదం చోటు చేసుకున్న ప్రాంతంలో అతని కెమెరాను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

T.V.SRIKAR