తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ జోరు కనిపిస్తోంది. తన ఆరోగ్యాన్ని వయసును లెక్క చేయకుండా బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అధికారమే లక్ష‌్యంగా నియోజకవర్గాల వారీగా ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటున్నారు. అయితే గతంలో ప్రకటించిన సభలకు సంబంధించిన తేదీల్లో స్వల్ప మార్పులు చేశారు. గతంలో అక్టోబర్ 26న ప్రకటించిన నాగర్ కర్నూలు సభకు బదులు వనపర్తిలో సభను నిర్వహించనున్నారు. ఈనెల 27న జరగాల్సిన స్టేషన్‌ఘన్‌పూర్ స్థానంలో మహబూబాబాద్, వర్థన్నపేటల్లో సభలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ రెండు తేదీలు మినహా మిగిలినవన్నీ ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతాయి.
ఇలా అక్టోబర్ 26 నుంచి నవంబర్ 9 వరకూ వరుసగా ప్రజా ఆశీర్వాద సభలు జరుగనున్నాయి. ఇందులో భాగంగా కేసీఆర్ కోదాడ, తుంగతుర్తి, ఆలేరు, జుక్కల్, బాన్సువాడ, నారాయణఖేడ్, హుజూర్ నగర్, మిర్యాలగూడ, దేవరకొండ, సత్తుపల్లి, ఇల్లెందు, నిర్మల్, బాల్కొండ, ధర్మపురి, భైంసా, ఆర్మూరు, కోరుట్ల, కొత్తగూడెం, ఖమ్మం, గద్వాల్, మక్తల్, నారాయణపేట, చెన్నూరు, మంథని, పెద్దపల్లి, సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లిలో పర్యటించనున్నారు. నవంబర్ 9న తన సొంత నియోజకవర్గం గజ్వేల్, కామారెడ్డిలో నిర్వహించే సభల్లో పాల్గొంటారని పార్టీ అధికారికంగా ప్రకటించింది.
ఈనెల 15న మ్యానిఫెస్టో ప్రకటించిన కేసీఆర్ హుస్నాబాద్ నుంచి ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించారు. ఆ తరువాత రోజుకు రెండేసి నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తూ పార్టీలో నాయకుల మొదలు కార్యక్తలకు నూతన ఉత్సాహాన్నిచ్చారు. ప్రస్తుతం ఈ వారం చివర్లో బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలకు స్వల్ప విరామం ఇచ్చారు. గురువారం నుంచి అలుపెరుగని కిరణంలా ప్రతి నియోజకవర్గంలో ప్రచార కాంతిని ప్రసరించనున్నారు.
T.V.SRIKAR