Chandrababu 23 Number: 2014 అధికారం నుంచి తాజాగా జైలు వరకూ చంద్రబాబును వీడని 23 నంబర్..

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అడుగడుగునా 23 నంబర్ వెంటాడుతోంది. దీనిని సెంటిమెంట్ అనాలో.. లక్కీ నంబర్ గా భావించాలో తెలియని పరిస్థితి. తాజాగా మరోసారి ఈ నంబర్ చంద్రబాబును వరించింది

  • Written By:
  • Updated On - September 11, 2023 / 09:25 AM IST

మన నిత్య జీవితంలో అనుకోకుండా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి. వీటిని యాదృశ్చికంగా భావిస్తూ ఉంటాము. మనం ఎవరినైనా తలుచుకున్న వెంటనే ఆ వ్యక్తి మనకు నేరుగా ఫోన్ చేయడం లేదా ఎదురుపడటం లాంటివి జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఇద్దరు మాట్లాడుకున్న సందర్బంలో ఒకే పదాన్ని, భావనను బయటకు వ్యక్తం చేయడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అయితే మాజీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విషయంలో కూడా ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఒకటి, రెండు సార్లు కాదు ఏకంగా ఇది నాల్గవసారి. లక్కీ నంబర్ 23.

వైసీపీ నుంచి లాక్కున్న ఎమ్మెల్యేల సంఖ్య 23..

చంద్రబాబు నాయుడు 2014లో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను తన పార్టీలోకి లాక్కున్నారు. ఇది ఫిరాయింపుల చట్టానికి విరుద్దమైనప్పటికీ ఆయనకు కాలం అలా కలిసి వచ్చింది. దీంతో ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలోకి చేర్చుకున్నారు. కొందరికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. ఇక్కడి నుంచి ఈయనకు ఈ నంబర్ వెంటాడుతూనే ఉంది.

2019 ఎన్నికల ఫలితాల తేదీ 23..

ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత తొట్టతొలి ముఖ్యమంత్రిగా పరిపాలన సాగించారు చంద్రబాబు నాయుడు. ఈయన ఐదేళ్ల పాలన తరువాత 2019లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ కి.. అధికార పార్టీ నాయకుడు చంద్రబాబుకు మధ్య హోరా హోరీ పోరు సాగింది.  ఏప్రిల్ 2019 ఏప్రిల్ 23 వ తేదీన ఎన్నికల ఫలితాలను విడుదల చేసింది ఎలక్షన్ కమిషన్. ఈ కౌంటింగ్ తేదీ కూడా 23 కావడమే విశేషం.

గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థులు 23..

అది జగన్ రాజకీయ భవిష్యత్తుకు అగ్నిపరీక్షాకాలం, సుమారు 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల్లోనే మమేకం అయ్యారు వైఎస్ జగన్. వైసీపీకి, టీడీపీకి మధ్య జరిగిన రాజకీయ రణరంగంలో ఏపీ వ్యాప్తంగా మొత్తం 175 స్థానాల్లో ఇరు పార్టీలు పోటీ చేశాయి. ఎన్నికల ఫలితాల్లో వైసీపీకి 151, తెలుగుదేశానికి 23, జనసేనకు 1 సీటు వచ్చింది. తృటిలో ప్రతిపక్ష హోదాను కోల్పోయే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు అన్న వాదనలు కూడా జోరుగా సాగాయి.  దీంతో ఎంత మంది ఎమ్మెల్యేలను జగన్ పార్టీ నుంచి లాక్కున్నారో అన్నే సీట్లు భగవంతుడు కట్టబెట్టాడని వైసీపీ నాయకులు విమర్శలు కూడా చేశారు. దీంతో 23 నంబర్ చంద్రబాబును మూడోసారి వరించింది.

రాజమండ్రి ఖైదీ నంబర్లోనూ 23..

చంద్రబాబు హయాంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో భారీ కుంభకోణం జరిగిందని సీఐడీ అతనిని అరెస్ట్ చేసింది. ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టగా సుదీర్ఘ వాదనల తరువాత చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని 14 రోజుల రిమాండ్ విధించింది. అక్కడ ఈయనకు ఖైదీ నంబర్ 7691 నంబర్ ను కేటాయించారు. ఈ నాలుగు అంకెలను (7+6+9+1 = 23) కూడితే మొత్తం 23 వస్తోంది. దీంతో జైలుకు వెళ్లినా బాబుగారిని ఈ నంబర్ వదలడం లేదని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

T.V.SRIKAR