ఐపీఎల్ అంటేనే బ్యాటర్ల గేమ్… బౌలర్లకు చుక్కలే కనిపిస్తుంటాయి… బ్యాట్ హవానే ఎక్కువగా చూస్తుంటాం.. అందుకే ఈ మెగా లీగ్ లో పొదుపుగా బౌలింగ్ చేసే బౌలర్లకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. తాజాగా ఐపీఎల్ మెగావేలంలో ఫ్రాంచైజీలు ఈ సారి ఫాస్ట్ బౌలర్లపై ఫోకస్ పెట్టాయి. ఓపెనింగ్ ఓవర్లతో పాటు డెత్ ఓవర్లలో రాణించే పేసర్ల కోసం గట్టిగానే ప్రయత్నించాయి. అందుకే వేలంలో తొలిరోజు ఫాస్ట్ బౌలర్లకు జిమాండ్ కనిపించింది. అర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్, ఆర్చర్, రబాడ , హ్యాజిల్ వుడ్ వంటి స్వదేశీ , విదేశీ పేసర్లపై కోట్లాభిషేకం కురిసింది. వేలంలో మొదటి ప్లేయర్ గా వచ్చిన అర్షదీప్ సింగ్ కోసం ఫ్రాంచైజీల మధ్య గట్టిపోటీ నడిచింది. తొలుత చెన్నై సూపర్ కింగ్స్ బిడ్ వేయగా.. ఢిల్లీ క్యాపిటల్స్ పోటీకి వచ్చింది. మధ్యలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ పోటీలో నిలిచాయి. గుజరాత్, హైదరాబాద్ మధ్య పోటీతో.. అర్షదీప్ సింగ్ ధర రూ.15.75 కోట్ల వరకూ వెళ్లింది. ఈ దశలో అనూహ్యంగా అతని పాత జట్టు పంజాబ్ కింగ్స్ ఎంట్రీ ఇచ్చింది. ఆఖరికి పంజాబ్ ఫ్రాంఛైజీ రైట్ టు మ్యాచ్ కార్డు వాడింది. దాంతో రూ.18 కోట్లకి పంజాబ్‌కే అర్షదీప్ సింగ్ సొంతమయ్యాడు.
అలాగే సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడను గుజరాత్ టైటాన్స్ 10.75 కోట్లకు కొనుగోలు చేసింది. వేలంలోకి 2 కోట్ల బేస్ ప్రైస్ తో ఎంట్రీ ఇచ్చిన రబాడ కోసం గట్టిపోటీనే నడిచింది. ఇక ఆసీస్ స్టార్ పేసర్ మిఛెల్ స్టార్క్ ను ఢిల్లీ క్యాపిటల్స్ 11.75 కోట్లకే సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోష్ హజల్‌వుడ్ కోసం కోల్‌కత్తా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు పోటీపడ్డాయి. చివరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..12 కోట్ల 50 లక్షలకు జోష్ హజల్‌వుడ్‌ని కొనుగోలు చేసింది. అటు భారత్ కు చెందిన కొందరు పేస్ బౌలర్లు కూడా మంచి ధరకే అమ్ముడయ్యారు. భారత యంగ్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణని గుజరాత్ టైటాన్స్ జట్టు 9 కోట్ల 50 లక్షలకు కొనుగోలు చేసింది. ఆవేశ్ ఖాన్ కోసం లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ పోటీపడ్డాయి. లక్నో సూపర్ జెయింట్స్.. 9 కోట్ల 75 లక్షలకు ఆవేశ్ ఖాన్‌ని కొనుగోలు చేసింది. సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ ఆన్రీచ్ నోకియాని కోల్‌కత్తా నైట్ రైడర్స్ 6 కోట్ల 50 లక్షలకు కొనుగోలు చేసింది.
ఇక జోఫ్రా ఆర్చర్ కోసం ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ పోటీపడ్డాయి. 12 కోట్ల 50 లక్షల ధరకు జోఫ్రా ఆర్చర్‌ని కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్.. భారత ఫాస్ట్ బౌలర్ ఖలీల్ అహ్మద్‌ని చెన్నై సూపర్ కింగ్స్ 4 కోట్ల 80 లక్షలకు కొనుగోలు చేసింది. మరోవైపు T నటరాజన్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు పోటీపడ్డాయి. నటరాజన్‌ని 10 కోట్ల 75 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. ఇక న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ కోసం రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్లు పోటీపడడంతో రేటు పెరుగుతూ పోయింది. చివరికి 12 కోట్ల 50 లక్షలకు ట్రెంట్ బౌల్ట్‌ని ముంబై దక్కించుకుంది.