తలనొప్పి అనేది ప్రతి ఒక్కరినీ వేధించే సమస్య. చిన్న పెద్ద వయసుతో సంబంధం లేకుండా అందరికీ ఇబ్బందికి గురిచేస్తుంది. ఒక్కోసారి చికాకుకు గురిచేసి మనకు దగ్గరైన వారిని కూడా దూరం చేస్తూ బంధాలను తెంచేస్తుంది. మరి కొందరికైతే పెద్ద పెద్ద శబ్ధాలు విన్నప్పుడు, వాసనలు చూసినప్పుడు, అధికంగా ఆలోచనలు చేస్తూ పనిచేసినప్పుడు కూడా తలనొప్పి రావడం మామూలే. ఇలాంటి సమయంలో ఉపశమనం కోసం కొందరు టీ, కాఫీ లాంటివి తాగుతూ ఉంటారు. మరి కొందరైతే డోసుకు మించి ట్యాబ్లెట్లు వేసుకుంటారు. ఇకపై మెడిసిన్స్ తో పనిలేకుండా తలనొప్పికి చెక్ పెట్టే అద్భుతమైన సాధనం మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. మెడ కింద మర్ధన చేస్తే చాలు తలనొప్పు హుష్ కాకి అని ఎగిరిపోయి స్వాంతన చేకూరుతుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
వేగస్ నరాన్ని ఉత్తేజపరిచే సాధనం..
అమెరికాకి చెందిన ‘గామాకోర్’ అనే కంపెనీ సరికొత్త పరికరాన్ని కనుగొంది. దీనిని ‘గామాకోర్ సఫైర్’ అనే పేరుతో తాజాగా మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఒకసారి చార్జ్ చేస్తే రెండు మూడు గంటలు నిర్విరామంగా పనిచేస్తుంది. దీనిని తల నొప్పి ఉన్న సమయంలో చెవి కింది భాగంలో ఉండే మెడ నరాల వద్ద పెట్టుకోవాలి. ఆ తరువాత దానికి ఉన్న పవర్ బటన్ నొక్కితే ఆన్ అయి మెల్లగా వైబ్రేట్ అవుతుంది. ఈ వైబ్రేషన్స్ ‘వేగస్’ అనే నరానికి తాకి అవి ఉత్తేజ పరిచేందుకు సహాయపడుతుంది. తద్వారా తలనొప్పి నుంచి అతి సులువుగా ఉపశమనం పొందవచ్చు అంటున్నారు ఈ కంపెనీ ప్రతినిధులు.
టాబ్లెట్స్ అవసరం లేదు.. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు..
ఎంతటి మొండి తలనొప్పినైనా ఇట్టే మాయం చేయగల సామర్థ్యం దీనికి ఉందంటున్నారు. సాధారణంగా ఇప్పటి కాలంలో మైగ్రేన్ తలనొప్పి పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా యువత దీని భారిన పడుతున్నారు. వీరికి ఈ పరికరం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. దీనిని వాడటం వల్ల మాత్రల జోలికి వెళ్లే అవసరం ఉండదు. టాబ్లెట్లు తరచూ వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దీని వల్ల ఎలాండి దుష్ప్రభావాలు ఉండవు అంటున్నారు నిపుణులు. దీని ధర అమెరికన్ డాలర్ల ప్రకారం 655 కాగా ఇండియన్ కరెన్సీ ప్రకారం అయితే రూ. 54వేలు ఉంటుంది.
T.V.SRIKAR