ప్రపంచ క్రికెట్ లో రికార్డుల రారాజు, రన్ మెషీన్ గా పేరున్న విరాట్ కోహ్లీ గత కొంతకాలంగా ఫామ్ కోల్పోయాడు. రెడ్ బాల్ క్రికెట్ లో తన స్థాయికి తగినట్టు ఆడలేకపోతున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే మిగిలిన స్టార్ ప్లేయర్స్ తో పోలిస్తే తొలిసారి విరాట్ కాస్త వెనుకబడ్డాడని చెప్పొచ్చు. గతేడాది డిసెంబర్‌లో దక్షిణాఫ్రికాలో 76 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడిన తర్వాత కోహ్లి మరోసారి కనీసం 50 మార్క్‌ను అందుకోలేకపోయాడు.గత ఆరు ఇన్నింగ్స్‌ల్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లోనూ 99 పరుగులే చేశాడు.దీంతో విరాట్ కోహ్లి ఫామ్ గురించి చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించాడు.
ప్రతి మ్యాచ్‌కు కోహ్లి ఫామ్‌ను జడ్జ్ చేయాల్సిన అవసరం లేదనన్నాడు. అతను వరల్డ్ క్లాస్ ప్లేయరని వ్యాఖ్యానించాడు
విరాట్ ఎంతో కాలంగా చక్కని ప్రదర్శన చేస్తున్నాడనీ, ఇప్పటికీ ఆట పట్ల ఎంతో ఆకలితో ఉన్నాడని గంభీర్ ప్రశంసించాడు. .న్యూజిలాండ్ సిరీస్‌లో అతను కచ్చితంగా సత్తాచాటుతాడని ధీమా వ్యక్తం చేశాడు. ఒకటిరెండు సిరీస్ లతోనే కోహ్లీ లాంటి టాప్ ప్లేయర్ ను తేలిగ్గా తీసిపారేయొద్దని చెప్పుకొచ్చాడు. కివీస్ తో సిరీస్ లో కోహ్లీ క్లిక్ అయితే ఆసీస్ పై అతన్ని ఎవ్వరూ అడ్డుకోలేరని తేల్చేాశాడు. మ్యాచ్ మ్యాచ్‌కు జడ్జ్ చేయడం సరైనది కాదన్న గంభీర్ ప్రతిరోజు గొప్ప రోజుగా ఎవరికీ ఉండదన్నాడు. జట్టుకు సరిపోయే 11 మందిని ఎంపిక చేయడం తన పనిగా చెప్పిన గంభీర్ ఆటగాళ్లను తొలగించడం కాదన్నాడు.
కాగా న్యూజిలాండ్ తో భారత్ తొలి టెస్ట్ అక్టోబర్ 16 నుంచి మొదలుకానుండగా… ఇప్పటికే అక్కడికి చేరుకున్న ఇరు జట్లు ప్రాక్టీస్ లో బిజీగా ఉన్నాయి. ఐపీఎల్ లో కోహ్లీ హోంగ్రౌండ్ గా ఉన్న బెంగళూరులో అతను ఖచ్చితంగా ఫామ్ లోకి వస్తాడని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరాలంటే ఈ సిరీస్ గెలవడం భారత్ కు కీలకమనే చెప్పాలి. అదే సమయంలో స్టార్ ప్లేయర్స్ అందరూ ఆసీస్ టూర్ కు ముందు ఫామ్ లోకి వస్తే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ముచ్చటగా మూడోసారి గెలిచే అవకాశముంటుంది.