భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై మాజీ దిగ్గజం గౌతం గంభీర్ మండిపడ్డాడు. ఆసియా కప్ 2023లో భారత్ ఆడిన మొదటి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ తేలిపోయిన సంగతి తెలిసిందే. పాక్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో కోహ్లీ కేవలం 4 పరుగులే చేసి అవుటయ్యాడు. షహీన్ అఫ్రిదీ వేసిన బంతిని ఆఫ్‌సైడ్ పంపేందుకు కోహ్లీ ప్రయత్నించాడు. అయితే ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి వికెట్లను కూల్చింది. ఈ క్రమంలో కోహ్లీ ఎంచుకున్న షాట్‌ను గంభీర్ తప్పుబట్టాడు. అది అసలు ఏం షాట్ అని? ఎలాంటి ఉపయోగం లేని చెత్త షాట్ ఆడి అతను అవుటయ్యాడని మండిపడ్డాడు.
‘అది ఒక చెత్త షాట్. ఏదో క్యాజువల్‌గా ఆడేశాడు. షహీన్ అఫ్రిదీ వంటి వాళ్లను అలా ఆడితే ఇలాంటి ఫలితమే వస్తుంది. అసలు ముందుకు వెళ్లాలా? లేక వెనకడుగు వేయాలా? అని కూడా నీకు తెలీదు’ అంటూ కోహ్లీని విమర్శించాడు. అయితే ఇలా గంభీర్ విమర్శలు చేస్తే.. పాక్ లెజెండ్ వకార్ యూనిస్ మాత్రం కోహ్లీకి మద్దతిచ్చాడు. ఈ విషయంలో కోహ్లీ కొంత అన్‌లక్కీ అన్నాడు. ‘అక్కడ కోహ్లీ కొంచెం అన్‌లక్కీ అని చెప్పాలి. బంతి సరిగా బ్యాటు మీదకు రాలేదు. అనుకున్నంత ఎత్తుగా కూడా రాలేదు. అందుకే ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకుంది.
అయితే లెంగ్త్‌ను మార్చినందుకు షహీన్ అఫ్రిదీని మెచ్చుకోవాలి’ అని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో షహీన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కోహ్లీ ఒక్కడే కాదు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను కూడా అవుట్ చేశాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హేడెన్ కూడా కోహ్లీ అన్‌లక్కీగా అవుటయ్యాడని చెప్పాడు. ఈ క్రమంలో కోహ్లీని గంభీర్ కావాలనే విమర్శిస్తున్నాడని, ఎప్పుడూ కోహ్లీని తిట్టడానికే గంభీర్ ఎదురు చూస్తుంటాడని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.