మూడురోజుల్లో కేవలం 55 ఓవర్ల మాత్రమే జరిగిన ఆట… ఇలాంటి పరిస్థుతుల్లో మ్యాచ్ డ్రాగా ముగియడం లాంఛనమే… అసలు ఫలితం దిశగా వెళ్ళే అవకాశాలను కనీసం ఎవ్వరూ ఊహించరు.. కానీ గంభీర్, రోహిత్ మాస్టర్ మైండ్ తో ఇది సాధ్యమైంది…సొంతగడ్డపై అది కూడా స్పిన్ కు అనుకూలించే పిచ్ పై మ్యాచ్ ను డ్రాగా ఎందుకు ముగించాలన్న ఆలోచనతో బరిలోకి దిగిన భారత్ దానికి తగ్గట్టే ఆడింది. లంచ్ బ్రేక్ తర్వాత త్వరగానే బంగ్లాను ఆలౌట్ చేయడం… వెంటనే దూకుడుగా తొలి ఇన్నింగ్స్ ఆరంభించడం ఇక్కడ టర్నింగ్ పాయింట్ గా చెప్పొచ్చు. మూడో బంతి నుంచే ఓపెనర్లు జైశ్వాల్, రోహిత్ విరుచుకుపడ్డారు. ఫోర్లు, సిక్సర్లతో బంగ్లా బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. టెస్ట్ మ్యాచ్ లో ఓవర్ కు 8కి పైగా రన్ రేట్ అంటే అసలు ఊహకు కూడా అందని విషయం.. కానీ గంభీర్ మాస్టర్ స్కెట్ తో ఇది వర్కౌట్ అయింది.
బంగ్లాతో మ్యాచ్ ను డ్రాగా ముగిస్తే డబ్ల్యూటీసీ ఛాంపియన్ షిప్ లో 4 పాయింట్లే వస్తాయి.. అదే మ్యాచ్ గెలిస్తే 12 పాయింట్లు ఖాతాలో వేసుకోవచ్చు. పైగా తర్వాత వరుసగా కివీస్, ఆసీస్ జట్లతో భారత్ టెస్ట్ సిరీస్ లు ఆడబోతోంది. అగ్రెసివ్ మైండ్ సెట్ తో ఆడకుంటే ఈ రెండు జట్లను నిలవరించడం కాస్త కష్టమే. ముఖ్యంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని మూడోసారి గెలవాలంటే దూకుడే సరైన వ్యూహం. అది బంగ్లాతో సిరీస్ నుంచే అలవాటు చేసుకోవాలన్న గంభీర్ ప్లాన్ తో భారత్ బరిలోకి దిగింది. ఒకవిధంగా చెప్పాలంటే ఇంగ్లాండ్ బజ్ బాల్ కాన్సెప్ట్ ను ఫాలో అవుతూ కాన్పూర్ టెస్టులో డేరింగ్ నిర్ణయాలు తీసుకుంది. 52 పరుగుల లీడ్ తో ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడం, రెండో ఇన్నింగ్స్ ఆరంభంలోనే బంగ్లా జట్టులో 2 వికెట్లు తీయడం ద్వారా మ్యాచ్ ను శాసించే స్టేజ్ లో నిలిచింది. చివరిరోజు తొలి సెషన్ లో స్పిన్నర్లు తమ మ్యాజిక్ కొనసాగిస్తే బంగ్లాను వైట్ వాష్ చేసేయొచ్చు. మొత్తం మీద కోచ్ గా గంభీర్ అగ్రెసివ్ మార్క్ షురూ అయినట్టే కనిపిస్తోంది.