ఇంట్రో తన నటన, స్క్రిప్ట్ సెలక్షన్ తో అంచెలంచెలుగా ఎదుగుతూ టాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో ఒకడిగా పేరు సంపాదించుకున్నాడు విశ్వక్ సేన్. యాటిట్యూడ్ సంగతి పక్కన పెట్టేస్తే… విశ్వక్ సేన్ స్క్రిప్ట్ సెలక్షన్ చాలా బాగుంటుంది. ప్రతీ సినిమాకు వేరియేషన్స్ చూపిస్తూ ప్రామిసింగ్ యాక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక రీసెంట్ గా ‘గామి’తో మంచి హిట్టు కొట్టిన విశ్వక్.. ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తో మరో హిట్టు కొట్టడానికి రెడీ అయ్యాడు. మరీ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం
స్టోరీ లైన్..
గోదావరి లంక గ్రామంలో యువకుడు రత్నాకర్. చిన్నతనంలో తల్లిదండ్రులు మరణిస్తారు. రత్నమాల అతనికి స్నేహితురాలు. గొప్పగా బతకాలని ఆశపడతాడు. చిన్న దొంగతనాలు నుంచి మొదలుపెట్టి ఎమ్మెల్యే దొరస్వామిరాజు దగ్గర చేరడం వరకు… ఆ తర్వాత నానాజీ అండతో దొరస్వామిరాజుకు వ్యతిరేకంగా పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించడం వరకు తన తెలివితేటలతో పైకి ఒక్కో మెట్టు పైకి ఎదుగుతాడు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ‘లంకల’ రత్నకు ఎటువంటి పరిస్థితులు ఎదురు అయ్యాయి.. ప్రేమించి మరీ తనను పెళ్లి చేసుకున్న నానాజీ కుమార్తె బుజ్జి ఎందుకు తుపాకీతో షూట్ చేసింది.. వేశ్య రత్నమాలతో రత్న సంబంధం ఏమిటి లంక గ్రామంలో సొంత మనుషులే రత్నపై కత్తి కట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు అతను ఎందుకు జైలుకు వెళ్ళాడు చివరకు రత్నను సొంత జనాలు చంపేశారా లేదంటే అతను వాళ్లను చంపేశాడా ఈ ప్రయాణంలో అతను పొందినది ఏమిటి కోల్పోయినది ఏమిటి అన్నదే మిగతా కథ
పర్పామెన్స్..
రత్న పాత్రకు విశ్వక్ సేన్ ప్రాణం పోశాడు. ‘ఫలక్‌నుమా దాస్’లో అతను మాస్ రోల్ చేశారు. కానీ, రత్న మాస్ వేరు. గోదారి లంక గ్రామంలో యువకుడిగా ఆ మీసకట్టు, లుంగీలో కొత్తగా కనిపించారు. యాక్షన్ సన్నివేశాల్లో రౌద్ర రసం పలికించిన తీరు మాస్ ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. బుజ్జిగా నటించిన నేహా శెట్టి పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఒదిగిపోయారు. ‘సుట్టం సూసిపోకలా…’ పాటలో అందంగా కనిపించారు. ఆ తర్వాత రత్న భార్యగా భావోద్వేగభరిత సన్నివేశాలు బాగా చేశారు. అంజలి పాత్రలో వేరియేషన్స్ ఉన్నాయి. సినిమా ప్రారంభంలో వేశ్యగా, తర్వాత హీరోకి సాయం చేసే మహిళగా భిన్నమైన నటనలో షేడ్స్ చూపించారు. గోదావరి అమ్మాయి కనుక ఆ యాస కూడా బాగా పలికించారు. ‘హైపర్’ ఆది, పమ్మి సాయి క్యారెక్టర్లకు స్క్రీన్ స్పేస్ ఉంది కానీ కామెడీ చేసే ఛాన్స్ లేదు. నెగెటివ్ షేడ్ యాదు పాత్రలో గగన్ విహారి బాగా చేశాడు. నాజర్, గోపరాజు రమణ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
టెక్నికల్ టీం..
థకుడిగా, దర్శకుడిగా పూర్తి స్థాయిలో కృష్ణచైతన్య ఆకట్టుకోలేదు. కానీ, సాంకేతిక నిపుణుల నుంచి మంచి అవుట్ పుట్ రాబట్టుకున్నారు. ముఖ్యంగా అనిత్ మదాడి సినిమాటోగ్రఫీ, యువన్ శంకర్ రాజా సంగీతం చాలా బావున్నాయి. గోదావరిని ఈ స్థాయి గ్రే షెడ్‌లో చూపించిన సినిమాటోగ్రాఫర్ మరొకరు లేరేమో యాక్షన్ సీన్లకు అవసరమైన ఫైర్ యువన్ నేపథ్య సంగీతం తీసుకొచ్చింది. సినిమా విడుదలకు ముందు పాటలు చార్ట్ బస్టర్ అయ్యాయి. స్క్రీన్ మీద కూడా బావున్నాయి. కత్తెరకు పని చెప్పాల్సిన సన్నివేశాలు సినిమాలో ఉన్నాయి. సంభాషణలు బావున్నాయి.కెమెరా వర్క్ మాత్రం ఎక్స్‌ట్రార్డినరీగా ఉందని.. మేయిన్ గా విలేజ్ సెటప్ ను బాగా చూపించాడని తెలుపుతున్నారు. నిర్మాణ విలువలు బాగున్నాయని తెలుపుతున్నారు.
ఓవరాల్ గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని ఒక సారి చూసోయోచ్చు. సమ్మర్ లో సినిమాలు లేక నిరాశపడ్డ ఆడియెన్స్ కు మంచి వినోదాన్నిగా నిలుస్తుందన్నడంలో సందేశం లేదు.