Germany weed: గంజాయిని జర్మనీ చట్టబద్ధం చేస్తుందా? కొత్త చట్టం తెచ్చే పనిలో జర్మనీ సర్కార్!

జర్మనీలో గంజాయిని పూర్తి స్థాయిలో చట్టబద్ధం చేయాలని జర్మనీ భావించింది. అంటే షాపులకు ప్రత్యేక లైసెన్సులు ఇచ్చి, గంజాయి అమ్మేందుకు అనుమతించాలనుకుంది. ఎవరికి విక్రయించాలి? ఎంత మోతాదులో విక్రయించాలి? అనే అంశాల్లో కొన్ని నిబంధనలు రూపొందించింది.

  • Written By:
  • Publish Date - April 13, 2023 / 06:40 PM IST

Germany weed: మత్తు పదార్థాల్లో చవకగా దొరికేదే అయినా గంజాయి అనారోగ్యానికి గురి చేస్తుంది. దీనికి అలవాటు పడితే తేరుకోవడం కష్టం. అందుకే ఇండియాతోపాటు అనేక దేశాలు గంజాయిపై నిషేధం విధించాయి. కొన్ని దేశాలు మాత్రం డ్రగ్స్‌లో గంజాయికి మినహాయింపు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా జర్మనీ ఇదే పని చేయబోతుంది. జర్మనీలో గంజాయి సాగును, సేవించడాన్ని చట్టబద్ధం చేయబోతుంది. ఒకవైపు యురోపియన్ యూనియన్ (ఈయూ) వ్యతిరేకిస్తున్నా జర్మనీ ఈ విషయంలో నిర్ణయం మార్చుకోవడం లేదు.
ఈయూ వ్యతిరేకత
జర్మనీలో గంజాయిని పూర్తి స్థాయిలో చట్టబద్ధం చేయాలని జర్మనీ భావించింది. అంటే షాపులకు ప్రత్యేక లైసెన్సులు ఇచ్చి, గంజాయి అమ్మేందుకు అనుమతించాలనుకుంది. ఎవరికి విక్రయించాలి? ఎంత మోతాదులో విక్రయించాలి? అనే అంశాల్లో కొన్ని నిబంధనలు రూపొందించింది. అయితే, ఈ ప్రతిపాదనను యురోపియన్ యూనియన్ తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో ముందుగా ప్రతిపాదించిన కొన్ని నిబంధనల్లో మార్పులు చేసింది. కొత్త పద్ధతుల్లో గంజాయిని అనుమతించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
కొత్త రూల్స్ ఇవే
జర్మనీ ప్రభుత్వ తాజా ప్రతిపాదన ప్రకారం గంజాయిని ఇకపై ఎవరైనా సాగు చేయవచ్చు. ఒక ఇంట్లో మూడు గంజాయి మొక్కలు పెంచుకోవచ్చు. వీటిని ప్రైవేటు క్లబ్బులు కూడా పెంచవచ్చు. నెలకు ఐదుసార్లు మాత్రమే వీటిని కట్ చేయాల్సి ఉంటుంది. ఇలా పెంచిన మొక్కల నుంచి వచ్చే గంజాయిని క్లబ్బు సభ్యులకు అందించవచ్చు. ఒక క్లబ్బులో గరిష్టంగా 500 మంది వరకే ఉండొచ్చు. ఈ క్లబ్బులు వీటితో వ్యాపారం చేయకూడదు. క్లబ్బులోని సభ్యులు లేదా వ్యక్తిగతంగా ఒక్కసారి 25 గ్రాముల గంజాయిని మాత్రమే కలిగి ఉండాలి. నెలకు గరిష్టంగా 50 గ్రాముల గంజాయిని మాత్రమే తీసుకోవాలి. 21 సంవత్సరాల లోపు వాళ్లైతే నెలకు 30 గ్రాముల గంజాయి మాత్రమే తీసుకోవాలి. మొక్కలు పెంచేందుకు లేదా ఈ గంజాయి విక్రయించేందుకు ముందుగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. 18 సంవత్సరాల పైబడిన జర్మన్లు మాత్రమే ఈ గంజాయి మొక్కలు పెంచేందుకు, గంజాయి సేవించేందుకు అర్హులు.


ఇప్పటికే లీగల్
జర్మనీ ప్రభుత్వం ఇప్పటికే గంజాయి సేవించడాన్ని చట్టబద్ధం చేసింది. బ్లాక్ మార్కెట్లో గంజాయి విపరీతంగా దొరుకుతోంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో బ్లాక్ మార్కెట్ దందాకు చెక్ పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిర్ణయం ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉంది. దీనికి ప్రభుత్వం అంగీకారం తెలిపి, చట్టబద్ధత వస్తేనే ఇది అమలవుతుంది. ఈ ఏడాదిలోపు దీనిపై చట్టం రూపొందిస్తామని జర్మన్ ప్రభుత్వం చెప్పింది. నిజానికి పూర్తి స్థాయిలో గంజాయిని అనుమతించాలనుకున్నప్పటికీ ఈయూ అభ్యంతరం చెప్పడంతో జర్మనీ వెనకడుగు వేసింది. మరోవైపు ప్రతిపక్షాలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి.
గంజాయితో దుష్ప్రభావాలు
ప్రపంచవ్యాప్తంగా కొన్ని చికిత్సల్లో గంజాయి వాడేందుకు వైద్య నిపుణులు అనుమతిస్తున్నారు. అయితే, అది పరిమితంగా మాత్రమే. అధిక మోతాదులో గంజాయి తీసుకుంటే అనారోగ్యంపాలయ్యే అవకాశం ఉంది. మత్తులో ముంచే గంజాయికి దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అనేక అనారోగ్య సమస్యలకు గంజాయి కారణమవుతుంది. గంజాయి తరచూ సేవిస్తుంటే క్రమంగా మాట్లాడే స్వభావాన్ని కోల్పోతారు. మాటలు తడబడుతాయి. షిజోఫ్రేనియాతోపాటు అనేక మానసిక జబ్బులు చుట్టుముడతాయి. గుండె జబ్బులు వచ్చే ముప్పు పెరుగుతుంది. శ్వాస సంబంధిత సమస్యలు, దీర్ఘకాలిక కడుపు నొప్పి, తలనొప్పి, అలసట వంటివి రావొచ్చు.