పెర్త్ టెస్టులో ఘనవిజయం సాధించి సిరీస్ లో శుభారంభం చేసిన భారత్ ఇప్పుడు రెండో మ్యాచ్ కు రెడీ అవుతోంది. తొలి టెస్టులో ఇద్దరు ప్రధాన బ్యాటర్లు జట్టులో లేకుండానే టీమిండియా అదరగొట్టింది. కొడుకు పుట్టడంతో రోహిత్ శర్మ తొలి మ్యాచ్ కు దూరంగా ఉండాల్సి వచ్చింది. శుభ్‌మన్ గిల్ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. అయితే రెండో టెస్టుకు వీళ్ళిద్దరూ అందుబాటులోకి వచ్చారు, రోహిత్ శర్మ ఇప్పటికే జట్టుతో జతకట్టగా గిల్ కూడా ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. నెట్స్‌లో గిల్ బ్యాటింగ్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
గిల్ రాకతో కెప్టెన్ రోహిత్, కోచ్ గంభీర్ లో టెన్షన్ మొదలైంది. ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్ తో భారత్ మ్యాచ్ లో గిల్‌కి అవకాశం దక్కవచ్చు. అయితే దీనిపై రోహిత్ శర్మ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. వర్షంతో ఈ ప్రాక్టీస్ మ్యాచ్ తొలిరోజు తుడిచిపెట్టుకుపోయింది. రెండోరోజు వన్డే ఫార్మాట్ లో ప్రాక్టీస్ కోసం మ్యాచ్ ఆడించే ఛాన్సుంది. అయితే రెండో టెస్టు మ్యాచ్‌కి ముందు గిల్ పూర్తిగా ఫిట్‌నెస్ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో వారం రోజులు టైమ్ ఉండడంతో ఈ గ్యాప్ లో గిల్ పూర్తిగా కోలుకుంటాడు. ఇప్పుడు గిల్ రాకతో తుది జట్టు క్లిష్టంగా మారింది. తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ నితీష్‌రెడ్డి ఆకట్టుకున్నాడు దేవదత్ పడిక్కల్ తొలి ఇన్నింగ్స్‌లో నిరాశపరిచినా, రెండో ఇన్నింగ్స్‌లో రాణించాడు. అటు కేఎల్ రాహుల్ సైతం రెండో ఇన్నింగ్స్‌లో 77 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
గిల్ చాలా కాలంగా మూడో నెంబర్‌లో బ్యాటింగ్ చేస్తున్నాడు. పైగా గిల్‌కి గతంలో ఆస్ట్రేలియాలో ఆడిన అనుభవం కూడా ఉంది. మరోవైపు గతంలో ఇదే మైదానంలో టీమిండియా దారుణంగా విఫలమైంది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా కేవలం 36 పరుగులకే ఆలౌటైంది. ఈసారి అలా జరగకుండా ఉండాలంటే జట్టు కూర్పుపై జాగ్రత్త వహించక తప్పదు. ఇప్పుడు గిల్ ఎంట్రీ ఇవ్వడంతో ఎవరిని పక్కన పెట్టాలో అని జట్టు మేనేజ్మెంట్ తల పట్టుకుంటుంది. అటు జైస్వాల్‌తో రోహిత్ ఓపెనింగ్ చేయడం ఖాయమే. ఇక వన్‌డౌన్‌లో గిల్ లేదా రాహుల్ లో ఒకరు బ్యాటింగ్ దిగుతారు. కోహ్లీ నాలుగో స్థానంలో ఆడనుండగా.. ఐదో స్థానంలో ఎవరిని ఆడిస్తారనేది చూడాలి. గిల్ ఫిట్ నెస్ సాధించకుంటే మాత్రం తుది జట్టు కూర్పుపై పెద్ద ఇబ్బందులు ఉండవు. అయితే గిల్ ఎంట్రీ ఇస్తే మాత్రం ఎవరిని తప్పిస్తారనేది వేచి చూడాలి.