Nalini : నళినికి ఆ పోస్ట్‌ ఇవ్వండి.. డీజీపీకి సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశం..

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన డీఎస్పీ నళిని ఉద్యోగం విషయంలో సీఎం రేవత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు, పోలీస్‌శాఖలో నియామకాల మీద అధికారులతో సీఎం రివ్యూ మీటింగ్‌ నిర్వహించారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన డీఎస్పీ నళిని ఉద్యోగం విషయంలో సీఎం రేవత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు, పోలీస్‌శాఖలో నియామకాల మీద అధికారులతో సీఎం రివ్యూ మీటింగ్‌ నిర్వహించారు. నళినికి పోలీస్ శాఖలో అదే ఉద్యోగాన్ని ఇవ్వడానికి ఇబ్బంది ఏంటని సీఎస్‌, డీజీపీని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ఒకవేళ నళినికి ఉద్యోగం చేయాలని ఆసక్తి వుంటే.. వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని సీఎస్, డీజీపీలను ఆదేశించారు.

పోలీస్ శాఖలో మార్గదర్శకాలకు సంబంధించి ఏవైనా ఇబ్బందులు వుంటే.. అదే హోదాలో వేరే శాఖలో ఉద్యోగాన్ని ఇవ్వాలని సూచించారు. ఉద్యోగాలకు రాజీనామా చేసి చాలా మంది ఎన్నికల్లో పోటీ చేస్తున్నారంటూ సీఎం చెప్పారు. ఒకవేళ ఎన్నికల్లో ఓడిపోతే తిరిగి మళ్లీ ఉద్యోగంలో జాయిన్‌ అవుతున్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. అదే కోవలో నళిని ఉద్యోగం ఇచ్చే అవకాశాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం రాజీనామా చేసిన నాయకులకు పదవులు వచ్చినప్పుడు, నళినికి ఎందుకు అన్యాయం జరగాలన్నారు సీఎం. తిరిగి ఉద్యోగంలో చేరడానికి నళిని సుముఖంగా ఉంటే, వెంటనే ఆమెకు ఉద్యోగం కల్పించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

తెలంగాణ ఉద్యమం సమయంలో డీఎస్పీగా ఉన్న నళిని.. ఉద్యమాన్ని అణచివేసే చర్యలు చేయలేనంటూ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ప్రత్యేక తెలంగాణ వచ్చిన తరువాతే తాను మళ్లీ ఉద్యోగంలో చేరుతానంటూ చెప్పారు. అప్పటి నుంచి తెలంగాణ ఉద్యమం కోసం పని చేశారు. 2012లో ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా దీక్ష చేపట్టారు. తెలంగాణ అంతటా పర్యటించారు. పరకాల ఉప ఎన్నికలో పోటీ కూడా చేశారు. కానీ ప్రత్యేక తెలంగాణ వచ్చిన తరువాత బీఆర్ఎస్‌ ప్రభుత్వం నళినిని పట్టించుకోలేదు. ఆమెకు పోస్టింగ్‌ ఇవ్వలేదు. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తరువాత నళిని ప్రస్తావన తీసుకువచ్చారు సీఎం రేవంత్‌ రెడ్డి. ఆయన ఆదేశాలతో త్వరలోనే నళినికి మళ్లీ డీఎస్పీ స్థాయి ఉద్యోగం రాబోతోంది.