టీ ట్వంటీ వరల్డ్ కప్ విజయానికి నజరానాగా బీసీసీఐ ప్రకటించిన 125 కోట్ల రూపాయల షేరింగ్ ఫార్ములా చర్చనీయాంశంగా మారింది. ఆటగాళ్లకు, రిజర్వ్ ప్లేయర్స్ కు భారీ మొత్తాన్ని ఇచ్చిన బీసీసీఐ సపోర్ట్ స్టాఫ్, ఇతర సిబ్బందికి మాత్రం తక్కువగా నగదు బహమతి ఇవ్వడం కెప్టెన్ రోహిత్ శర్మకు సైతం నచ్చలేదు. ఇప్పటికే కోచ్ రాహుల్ ద్రావిడ్ తనకు ప్రకటించిన 5 కోట్ల మొత్తంలో సగమే తీసుకుంటానని బోర్డుకు చెప్పాడు. సపోర్ట్ స్టాఫ్ లో అందరితో సమానంగానే తనకు రెండున్నర కోట్లే ఇవ్వాలని కోరాడు. తాజాగా కెప్టెన్ రోహిత్ శర్మ సైతం ద్రావిడ్ నే ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది. సపోర్ట్ స్టాఫ్ కు తక్కువ మొత్తంలో నజరానా ఇచ్చారని తెలియడంతో తన 5 కోట్ల రూపాయల బోనస్ ను వదులుకునేందుకు రోహిత్ సిద్ధమయ్యాడు.
దీనిపై ఇప్పటికే బీసీసీఐ వర్గాలతో మాట్లాడినట్టు కూడా సమాచారం. కావాలంటే తన 5 కోట్ల రూపాయలను సపోర్ట్ స్టాఫ్ కు పంచాలని బీసీసీఐకి చెప్పినట్టు బోర్డు వర్గాలు తెలిపాయి. ప్రైజ్‌మనీలో సపోర్ట్ స్టాఫ్‌కు అంత తక్కువ డబ్బు రాకూడదని బీసీసీఐతో హిట్ మ్యాన్ చెప్పినట్టు వెల్లడించాయి. రోహిత్ శర్మ చేసిన ఈ పనిపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తోంది. రోహిత్ శర్మది గొప్ప మనసని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.