Global Tech Survey Report: భవిష్యత్తు మొత్తం టెక్నాలజీదే.. గ్లోబల్ టెక్ సర్వే రిపోర్ట్లో కీలక అంశాలు వెల్లడి..

మీరు వ్యాపారం చేయాలనుకుంటున్నారా.. అయితే రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్, షేర్స్, నిర్మాణ రంగాల్లో పెట్టుబడి పెట్టడం పాత కాలం పద్దతి. తాజాగా సాంకేతిక రంగాల్లో కూడా అతి తక్కువ పెట్టుబడులు పెట్టి అధిక లాభాలు సాధించవచ్చు. తాజాగా అమెరికా, ఆసియా ప్రాంతాలకు చెందిన 38శాతం మంది వ్యాపారవేత్తలు టెక్నాలజీలో పెట్టుబడులు పెట్టి 10శాతం వరకూ లాభాలు సాధించారు. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

  • Written By:
  • Updated On - September 28, 2023 / 08:19 AM IST

ప్రస్తుత యుగంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో పాటూ క్లౌడ్ పాత్ర చాలా కీలకం అయిపోయింది. సాఫ్ట్ వేర్ కంపెనీలు మొదలు ఎడ్యూకేషన్ ఇన్ స్టిట్యూట్స్ వరకూ అందరూ దీనిపై ఆధారపడి పనిచేస్తున్నారు. దీంతో పెట్టుబడులు పెట్టేందుకు కొన్ని వ్యాపార సంస్థలు ఎక్కువ మక్కువ చూపిస్తున్నాయి. ఈ విషయాన్ని తాజాగా టాప్ కన్సల్టింగ్ సంస్థ కేపీఎంజీ వెలువరించింది. అలాగే కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేయడం వల్ల అధిక లాభాలు ఉన్నట్లు కేపీఎంజీ గ్లోబల్ టెక్ రిపోర్ట్ 2023 నివేదికలో తెలిపింది.

ఈ ప్రాంతాలవారే అధికం

ప్రముఖ పారిశ్రామిక వేత్త, కేపీఎంజీ ఇండియా భాగస్వామి, లైట్ హౌస్ హెడ్ సచిన్ అరోరా ఈ నివేదికపై కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటా, అనలిటిక్స్, ఎనీథింగ్ యాస్ ఎ సర్వీస్ వంటి సరికొత్త సాంకేతికతపై అధికంగా పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికివేత్తలు ఉత్సాహం చూపుతున్నట్లు తెలిపారు. వినియోగదారులను సంతృప్తిపరిచే ఉద్దేశ్యంతో ఈఎస్జీ, సైబర్ సెక్యూరిటీ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని కొత్త టెక్నాలజీని అందించేందుకు వ్యాపార సంస్థలు క్యూలు కడుతున్నట్లు పేర్కొన్నారు. అందులో భాగంగానే 10శాతం పైగా లాభాలు పెరుగుతున్నట్లు వెల్లడించారు. దాదాపు 2100 మంది టెక్నాలజీ లీడర్ల అభిప్రాయాలను సేకరించినట్లు నివేదికలో వివరించారు. వీరులో 33 శాతం మంది అమెరికాకి చెందిన వారు కాగా.. 29శాతం మంది ఆసియా, ఫసిఫిక్ ఖండాల వారని తెలిపింది. విద్య, వైద్యం, ఆరోగ్యం, ప్రభుత్వం, పారిశ్రామిక ఉత్పత్తి, రిటైల్, ఇంధనం, టెక్నాలజీ, రిటైల్, ఆర్థిక సేవలకు చెందిన పరిశ్రమల్లో పనిచేసే సీనియర్ ఎగ్జిక్యూటివ్ లతో పాటూ వ్యాపార వేత్తలు ప్రాతినిధ్యం వహించారు.

కేపీఎంజీ గ్లోబల్ టెక్ రిపోర్ట్లోని కీలక అంశాలు..

  • ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను చాలా మంది అత్యంత ముఖ్యమైన సాంకేతికతగా పరిగణిస్తున్నారు.
  • ఈ టెక్నాలజీని అందిపుచ్చుకునేందుకు 10 శాతం మంది వ్యాపారా వేత్తలు ఆసక్తి చూపుతున్నారు.
  • గత ఏడాదిలో వీటిపై ఆసక్తిని ప్రదర్శిస్తున్న సంఖ్య 10 నుంచి 38 శాతానికి పెరిగింది.
  • భవిష్యత్తులో మరో 15శాతం వరకూ పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది.
  • అతి తక్కువ కాలంలో నిర్థేశించుకున్న లక్ష్యాలను అధిగమించడంలో ఏఐ చాలాబాగా దోహదపడుతుందని నమ్ముతున్నారు పెట్టుబడిదారులు.
  • ఎన్విరాన్మెంటల్, సోషల్ గవర్నెన్స్ వంటి లక్ష్యసాధనకు ఈ కొత్త టెక్నాలజీ కీలకమైన శక్తిగా పరిగణించబడుతోంది.
  • డిజిటల్ యుగంలో ఈ సాంకేతికతను అందిపుచ్చుకోవడం వల్ల ఉద్యోగుల సామర్థ్యం గతంలో కంటే బాగా పెరిగినట్లు తెలిసింది.
  • ఈ విషయాన్ని డిజిటల్ లీడర్స్ గా పనిచేస్తున్న 72శాతం మంది వెల్లడించడం గమనార్హం.
  • ఇలా దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల వినియోగదారులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు చాలా బాగా ఉపయోగపడుతున్నట్లు నివేదిక సారాంశం.
  • దీనిని ఉపయోగించడం వల్ల సత్ఫలితాలు రావాలంటే సమన్వయం కచ్చితంగా అవసరమని, ఉమ్మడి నిర్ణయాలు చాలా బాగా దోహదపడతాయని తెలిపింది.

T.V.SRIKAR