ఇద్దరూ ట్రిపుల్ కొట్టేశారు, గోవా కుర్రాళ్ళ మాస్ జాతర

రంజీ మ్యాచ్ లో సెంచరీ చేయడం అంత ఈజీ కాదు... ఓపిగ్గా ఆడుతూ భారీ ఇన్నింగ్స్ ఆడాలి.. ఇక డబుల్ సెంచరీ అయితే దానికి రెట్టింపు పట్టుదల కావాల్సిందే.. మరి ట్రిపుల్ సెంచరీ కొట్టాలంటే ఎంతో సత్తా ఉండాలి... తాజాగా రంజీ ట్రోఫీ 2024 సీజన్ లో రికార్డుల మోత మోగింది.

  • Written By:
  • Publish Date - November 15, 2024 / 03:04 PM IST

రంజీ మ్యాచ్ లో సెంచరీ చేయడం అంత ఈజీ కాదు… ఓపిగ్గా ఆడుతూ భారీ ఇన్నింగ్స్ ఆడాలి.. ఇక డబుల్ సెంచరీ అయితే దానికి రెట్టింపు పట్టుదల కావాల్సిందే.. మరి ట్రిపుల్ సెంచరీ కొట్టాలంటే ఎంతో సత్తా ఉండాలి… తాజాగా రంజీ ట్రోఫీ 2024 సీజన్ లో రికార్డుల మోత మోగింది. ఒకే జట్టులో ఇద్దరు ఆటగాళ్ళు ఏకంగా ట్రిపుల్ సెంచరీలతో దుమ్మురేపేశారు. గోవా కుర్రాళ్లు స్నేహల్ కౌతంకర్, కశ్యప్ బక్లే ట్రిపుల్ సెంచరీలతో చెలరేగి దేశవాళీ క్రికెట్‌లో కనీవిని ఎరుగని రికార్డు సృష్టించారు. వీరిద్దరి విధ్వంసానికి రికార్డులన్నీ చెల్లాచెదురయ్యాయి. స్నేహల్‌ కౌతంకర్‌ 215 బంతుల్లో 45 ఫోర్లు, 4 సిక్సర్లతో 314 పరుగులు చేయగా.. కశ్యప్‌ బాక్లే 269 బంతుల్లో 39 ఫోర్లు, 2 సిక్సర్ల తో 300 పరుగులు చేశారు. తద్వారా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో వేగంగా 300 పరుగుల మార్క్‌ను అందుకున్న ఆటగాళ్ల జాబితాలో రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.

స్నేహల్‌, కశ్యప్‌ మూడో వికెట్‌కు 606 పరుగులు జోడించి రంజీ ట్రోఫీ చరిత్రలోనే అత్యధిక భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. రంజీ ట్రోఫీ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో ఇద్దరు ట్రిపుల్‌ సెంచరీలు చేయడం ఇది రెండో సారి మాత్రమే. 1989లో గోవాతో జరిగిన మ్యాచ్‌లో తమిళనాడుకు చెందిన డబ్ల్యూవీ రామన్‌, అర్జున్‌ క్రిపాల్‌ సింగ్‌ ఒకే ఇన్నింగ్స్‌లో ట్రిపుల్‌ సెంచరీలు చేశారు. ఈ మ్యాచ్‌లో గోవా చేసిన స్కోర్‌ 727 పరుగులు రంజీ ట్రోఫీ ప్లేట్‌ డివిజన్‌ చరిత్రలో రెండో అత్యధిక స్కోర్‌గా నిలిచింది.

రంజీ ట్రోఫీ ప్లేట్‌ డివిజన్‌ చరిత్రలో అత్యధిక స్కోర్‌ మేఘాలయ చేసింది. 2018 సీజన్‌లో సిక్కింతో జరిగిన మ్యాచ్‌లో మేఘాలయ 826 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన అరుణాచల్ ప్రదేశ్.. సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ధాటికి కేవలం 84 పరుగులకే కుప్పకూలింది. అర్జున్ 5 వికెట్లతో కెరీర్ బెస్ట్ సాధించాడు. తర్వాత గోవా 92 ఓవర్లలో 727/2 స్కోరు వద్ద మొదటి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. 146 బంతుల్లో ద్విశతకం బాదిన స్నేహల్ కౌతంకర్ 205 బంతుల్లో 300 మార్క్ అందుకున్నాడు. కశ్యప్ 269 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించాడు.