Godavari, Pulasa Fish : గోదారికి పులస వచ్చేసింది.. కేజీ ఎన్ని వేలో తెలుసా ?

పుస్తెలు అమ్మైనా సరే పులస తినాల్సిందే అంటారు. గోదావరి జిల్లాలో అరుదుగా దొరికే ఈ పులస చేపకు మార్కెట్‌లో ఆ స్థాయి డిమాండ్‌ ఉంటుంది

 

 

పుస్తెలు అమ్మైనా సరే పులస తినాల్సిందే అంటారు. గోదావరి జిల్లాలో అరుదుగా దొరికే ఈ పులస చేపకు మార్కెట్‌లో ఆ స్థాయి డిమాండ్‌ ఉంటుంది. ఆషాడంలో కొత్త అల్లుళ్లకు, బంధువులకు గోదావరి వాసులు పులసతో వింధు చేస్తారు. దీన్ని ఔషదాల తయారీలో కూడా ఉపయోగిస్తుంటారు. ఈ కారణంగానే ఈ పులసకు మార్కెట్‌లో ఫుల్ డిమాండ్‌. ప్రతీ సంవత్సరం మత్స్యకారులను రిచ్‌గా మార్చే ఈ పులస సీజన్‌ గోదావరి జిల్లాలో ప్రారంభమయ్యింది. దేశవ్యాప్తంగా జోరుగా వర్షాలు కురవడంతో వాగులు వంకలూ పొంగి పొర్లుతున్నాయి.

ఈ క్రమంలోనే కోన‌సీమ జిల్లా మ‌లికిపురంలోని రామ‌రాజులంక బాడవ‌లో గోదారి రంగు మారింది. ఎర్ర నీళ్లు కనిపించాయి అంటే.. పులస వచ్చేసినట్టే. ఇంకేముంది మత్స్యకారులు తమ వలలకు పని చెప్పారు. బోట్లు తీసుకుని వేటకు బయల్దేరారు. శ్రీ‌ను అనే మ‌త్స్యకారుడు తన స్నేహితుడితో వేటకు వెళ్లిన సమయంలో అతనికి పులస చేప పడింది. అంతే.. గంతులేస్తూ ఒడ్డుకు చేరుకున్నాడు. దాదాపు రెండు కేజీల బరువున్న ఈ పులస చేపను 24 వేలకు అమ్మేశాడు. కేవలం ఈసారి మాత్రమే కాదు. ప్రతీ ఏటా పులస చేపకు ఇదే రేంజ్‌లో డిమాండ్‌ ఉంటుంది. ఒక్క చేప పడ్డా పర్లేదు అన్నట్టుగానే జాలర్లు వేటకు వెళ్తుంటారు. ఈ పులస చేపకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌.

దీని టేస్ట్‌ ముందు ఏ కర్రీ పనిచేయదు. పోషక విలువలతో పాటు ఔషద విలువలు కూడా పులస చేపలో ఎక్కువగా ఉంటాయి. ఈ కారణంగానే ఈ చేపను కొనేందుకు ఎగబుడుతుంటారు. ఏపీ మొత్తంలో గోదావరి జిల్లాలోనే ఈ చేపలు అరుదుగా కనిపిస్తుంటాయి. వర్షాకాల సీజన్‌లో మాత్రమే ఈ చేపలు ఇక్కడికి వలస వస్తాయి. ఇదే టైంలో చేపలను పట్టుకుని భారీ రేటుకు అమ్మేస్తుంటారు మత్స్యకారులు. ప్రతీ ఏటా మత్స్యకారులు జీవితాల్లో కాసులు కురిపించే పులస సీజన్‌ ఇప్పుడు మొదలయ్యింది. ఈ ఏడు ఈ చేప ఎంతమందిని కరునిస్తుందో చూడాలి మరి.