భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపంతో పరవళ్లు తొక్కుతోంది. ఎగువ రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద గోదావరికి వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం నీటి మట్టం 46.5 అడుగులకు చేరుకుంది. దాంతో భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మత్స్యకారులు, పర్యాటకులు నదిలోకి వెళ్లరాదని హెచ్చరించారు.
ఇది 73 అడుగులకు చేరితే 109 గ్రామాలు, ఒక పట్టణం నీట మునుగుతాయని నీటి పారుదల శాఖ ప్రకటించింది. 48 అడుగులకు చేరినప్పటి నుంచే వరసగా గ్రామాల ముంపు మొదలవుతుందని వెల్లడించింది. మండలాల వారీగా చర్లలో 26, దుమ్ముగూడెం 51, బూర్గంపాడు 5, అశ్వాపురం 11, మణుగూరు 6, పినపాకలో 10 గ్రామాలు వరద ముప్పులో ఉన్నాయి. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున గోదావరి నదిలో నీటిమట్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా భారీ వరదనీరు రావడంతో.. 10,68,602 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నీటిమట్టం 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. 53 అడుగులకే చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. నేడు సోమవారం సాయంత్రానికి గోదావరి నీటి మట్టం 50అడుగులు దాటే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
పుష్కర ఘాట్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ..
భారీ వర్షాల వల్ల గోదావరి, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో కాళేశ్వరం పుష్కర ఘాట్ వద్ద 12.100 మీటర్ల ఎత్తులో ప్రవాహం ఉంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పుష్కర ఘాట్ వద్ద పోలీసులను మోహరించారు. మరో వైపు మేడిగడ్డ, లక్ష్మీ బ్యారేజ్‌కు క్రమంగా వరద పెరుగుతోంది. ప్రస్తుత ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 8,68,850 క్యూసెక్కులుగా ఉంది.