న్యాయదేవత కళ్లకు గంతలు తొలగాయ్. ఎస్.. మీరు విన్నది నిజమే. ఇక మన దేశంలో న్యాయం చూస్తుంది. చట్టానికి సాక్ష్యాలు తప్ప ఎమోషన్స్‌తో పని ఉండదు, చట్టం ముందు అంతా సమానమే అని చెప్పేందుకు న్యాయ దేవత కళ్లకు ఇంత కాలం గంతలు కట్టారు. కానీ ఇప్పుడు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ఆదేశాలతో ఆ కళ్ల గంతలు విప్పేశారు. అంతే కాదు ఇన్నాళ్లూ న్యాయ దేవత రెండు చేతుల్లో.. కుడి చేతిలో న్యాయానికి ప్రతిబింబంగా నిలిచే త్రాసు, ఎడమ చేతిలో ఖడ్గం ఉండేవి. సుప్రీం కోర్టులో కొత్తగా ఏర్పాటు చేసిన న్యాయ దేవత విగ్రహం ఎడమ చేతిలో ఖడ్గానికి బదులుగా రాజ్యాంగాన్ని పెట్టారు. సుప్రీం కోర్టులోని జడ్జీల లైబ్రరీలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. న్యాయం గుడ్డిది కాదని, చట్టానికి కళ్లున్నాయని బలమైన సంకేతమిచ్చే ఉద్దేశంతోనే న్యాయదేవత విగ్రహంలో సుప్రీం కోర్టు ఈ మార్పులు చేసింది.