మార్కెట్‌లో బంగారం రేటు భగ్గుమంటోంది. రోజు రోజుకూ రేటు పెరుగుతూ అందనంత ఎత్తుకు చేరుకుంటోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఎప్పుడూ లేనంత రికార్డ్ స్థాయికి బంగారం రేటు చేరింది. 10 గ్రాముల బంగారం 74 వేల 910 రూపాయలకు చేరింది. ఒకానొక దశలో ఈ రేటు 76 వేల 2 వందల మార్క్‌ను కూడా తాకిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇక వెండిధర కూడా భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం కిలో వెండి 78 వేల 6 వందలకు చేరింది. ఒక్కరోజులోనే 11 వందల 20 రూపాయలు పెరిగింది వెండి. గతేడాది ఇదే సమయంలో బంగారం ధర ప్రస్తుతంతో పోలిస్తే పది వేలు తక్కువగా ఉంది.
దీంతో ఇప్పుడు పెరుగుతున్న బంగారం రేటును ఇక కంట్రోల్ చేయడం కష్టమేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ ఏడాది చివరిలోగా 10 గ్రాముల బంగారం ధర 80 వేలు కూడా దాటే అవకాశం ఉంది అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం రేటు భగ్గుమంటోంది. ఔన్సు బంగారం ధర 0.6 శాతం పెరిగి 2 వేల 245 డాలర్లకు చేరింది. అమెరికాలో ద్రవ్యోల్బణ లెక్కలు అంచనాలకు తగినట్లుగానే ఉన్నాయి. జూన్ నుంచి అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లు తగ్గిస్తుందన్న అంచనాలకు ఈ ఇన్‌ఫ్లేషన్ లెక్కలతో మరింత బలం చేకూరింది. మరోపక్క వడ్డీ రేట్లు పెరిగినా బంగారం ధర తగ్గడంలేదు.
2022లో బంగారం కేవలం 0.13 శాతమే తగ్గింది. కానీ 2023లో ఏకంగా 13.45శాతం పెరిగింది. దీంతో 2030 నాటికి 10 గ్రాముల బంగారం ధర లక్ష పైనే ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు. దీంతో ఈ ఏడాది కేంద్ర బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేశాయి. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి బంగారం కొనుగోళ్లు పెరిగాయి. కేవలం చైనా మాత్రమే 225 టన్నుల బంగారం కొనుగోలు చేసింది. భవిష్యత్తులో బంగారానికి ఉండబోతున్న డిమాండ్ దృష్యానే దేశాలు ఈ స్థాయిలో కొనుగోలు చేస్తున్నాయంటున్నారు. పట్టపగ్గాలు లేకుండా దూసుకుపోతున్న బంగారం రేటు ఏ స్థాయికి వెళ్లి ఆగుతుందో చూడాలి మరి.