Gold prices : బంగారం ధరలు ఇంకా పడిపోతాయా.. ఇప్పుడు కొనాలా.. వద్దా..

గోల్డ్ ధరలు భారీగా పడిపోతున్నాయ్. బంగారం, వెండి, ప్లాటినం లోహాలపై పన్ను భారాన్ని తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రకటించారు.

గోల్డ్ ధరలు (Gold Prices) భారీగా పడిపోతున్నాయ్. బంగారం (Gold), వెండి (Silver), ప్లాటినం (Platinum) లోహాలపై పన్ను భారాన్ని తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి (Finance Minister) నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) బడ్జెట్ (Budget) ప్రకటించారు. దీంతో బంగారం ధర 4వేలకు పైగా తగ్గింది. కిలో వెండి ధర కూడా దాదాపుగా 4వేలు తగ్గింది. దీంతో పసిడి ప్రియుడు ఇప్పుడు బంగారు దుకాణాలకు క్యూ కడుతున్నారు. ఐతే మరికొందరు మాత్రం వేచి చూసే ధోరణిలో కనిపిస్తున్నారు. ట్రెండ్‌ చూస్తే.. ఇప్పుడు బంగారం కొనాలా వద్దా అని ఎదురుచూసే వాళ్లు ఇంకొందరు.

బంగారంపై కస్టమ్స్ సుంకాన్ని 15శాతం నుంచి 6శాతానికి తగ్గించింది కేంద్రం. గతంలో బంగారం మీద బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 10శాతంతో పాటు వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ది పన్ను 5శాతం ఉండేది. ఇప్పుడు బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 10 నుంచి 5 శాతానికి తగ్గించారు. వ్యవసాయ మౌలిక వసతుల పన్నను 5 నుంచి 1 శాతానికి పరిమితం చేశారు. దీంతో బంగారం మీద పన్ను భారం 15 నుంచి 6 శాతానికి తగ్గింది. జీఎస్టీతో కలిపి గతంలో 18 శాతంగా ఉన్న పసిడి పన్ను.. ఇప్పుడు 9శాతానికి తగ్గింది. ట్యాక్స్‌ తగ్గింపుతో బంగారం ధర భవిష్యత్తులో ఇంకా తగ్గుతుందా అనే ప్రశ్నలు వినిపిస్తుండగా.. అది సాధ్యమే అంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. ఐతే ఇది పరిమితంగానే ఉంటుందని చెప్తున్నారు. భవిష్యత్తులో 24 క్యారట్ల బంగారం ధర 10 గ్రాములకు 68 వేల వరకు పడిపోవచ్చని అంటున్నారు.

ఐతే ఈ తగ్గుదల కొంతకాలం వరకే ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. దీర్ఘకాలంలో బంగారం ధర స్థిరంగా పెరుగుతూనే ఉంటుందని చెప్తున్నారు. దీంతో ఇప్పుడు బంగారం కొనుగోలు చేయడమే ఉత్తమమని సూచిస్తున్నారు. ప్రతీ ఐదారేళ్లకు బంగారం ధరలు రెండింతలు అవుతున్నాయ్. 2014లో 10గ్రాముల బంగారం ధర 28 వేల రూపాయలు కాగా.. అది 2019నాటికి 35 వేల రూపాయలు దాటింది. ఆ తర్వాత ఐదేళ్లకు అంటే 2024నాటికి ధర రెండింతలై 70వేల మార్క్ క్రాస్ చేసింది. పన్ను తగ్గింపు ప్రభావం వల్ల రేటు తాత్కాలికంగా తగ్గినా… దీర్ఘకాలంలో పసిడి ధర తగ్గేదే ఉండదని తెలుస్తోంది.