క్రికెటర్లందరూ మ్యాచ్ విన్నర్లు కాలేరు… సంప్రదాయ టెస్ట్ క్రికెట్ లో అత్యంత నిలకడగా రాణించిన ఆటగాళ్ళు కూడా కొద్దిమందే… అలాంటి కొద్దిమందిలో భారత స్పిన్నర్ రవిచంద్రన్ పేరు ఖచ్చితంగా ఉంటుంది… అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ తర్వాత భారత స్పిన్ ఎటాక్ ను అద్భుతంగా నడిపించిన అశ్విన్ ఈ క్రమంలో ఎన్నో రికార్డులు, మరెన్నో మైలురాళ్ళు అందుకున్నాడు. అసలు అశ్విన్ గణాంకాలు చూస్తే మ్యాచ్ విన్నర్ అని ప్రత్యర్థులు సైతం ఒప్పుకోవాల్సిందే. అశ్విన్ 2010లో ఇండియా తరఫున తొలి వన్డే ఆడాడు. ఆ తర్వాత ఏడాదికి వెస్టిండీస్ పై టెస్టు క్రికెట్ అరంగేట్రం చేశాడు. ఫార్మాట్లతో సంబంధం లేకుండా అత్యంత నిలకడగా రాణించాడు. కొద్దికాలంలోనే జట్టులో కీలక స్పిన్నర్ గా మారిపోయాడు. 38 ఏళ్ల అశ్విన్ టెస్టుల్లో 537 వికెట్లతో ఇండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో రెండో స్థానంలో ఉన్నాడు. అనిల్ కుంబ్లే 619 వికెట్లతో టాప్ లో ఉన్నాడు.
ఇక టెస్టుల్లో 37సార్లు ఒక ఇన్నింగ్స్ లో ఐదు, అంతకంటే ఎక్కువ వికెట్లు తీసుకున్నాడు. ఈ విషయంలో లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్ ను సమం చేశాడు. ముత్తయ్య మురళీధరన్ 67సార్లు ఈ ఘనత సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు.టెస్టుల్లో అత్యధికంగా 268సార్లు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లను ఔట్ చేసి వాళ్లపై తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. మొత్తంగా 287 అంతర్జాతీయ మ్యాచ్ లలో అతడు 775 వికెట్లు తీసుకున్నాడు. అందులో 537 టెస్టు వికెట్లు, 156 వన్డే వికెట్లు, 72 టీ20 వికెట్లు ఉన్నాయి. అనిల్ కుంబ్లే 956 వికెట్లతో టాప్ లో ఉండగా.. అశ్విన్ రెండో స్థానంలో ఉన్నాడు. మొత్తంగా ప్రపంచ క్రికెట్ లో అత్యధిక వికెట్ల జాబితాలో అశ్విన్ 11వ స్థానంలో నిలిచాడు.
ఇదిలా ఉంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో అశ్విన్ పూర్తి ఆధిపత్యం కనబరిచాడు. ఇప్పటి వరకూ డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ గా రిటైరయ్యాడు. డబ్ల్యూటీసీలో 100 వికెట్ల మార్క్ అందుకున్న తొలి బౌలర్ గానూ నిలిచాడు. డబ్ల్యూటీసీలో 41 మ్యాచ్ లు ఆడిన అశ్విన్ 195 వికెట్లు తీసుకున్నాడు. అతని తర్వాత ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయన్ 190 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.
స్వతహాగానే భారత పిచ్ లు స్పిన్ కు అనుకూలం… ఇలాంటి పిచ్ లపై అశ్విన్ లాంటి స్పిన్నర్ ను ఎదుర్కోవడం అంటే బ్యాటర్లకు సవాలే.. అందుకే అశ్విన్ స్వదేశంలో తిరుగులేని స్పిన్నర్ గా నిలిచాడు. అతడు ఇండియాలో 383 టెస్టు వికెట్లు పడగొట్టాడు.
అటు బ్యాట్ తోనూ పలు సార్లు కీలక ఇన్నింగ్స్ లు ఆడాడు. టెస్టుల్లో ఆరు సెంచరీలు కూడా చేశాడు. మొత్తంగా 3503 టెస్టు రన్స్ ఉన్నాయి. టెస్టుల్లో 3 వేల రన్స్, 300కుపైగా వికెట్లు తీసుకున్న 11 మంది ఆల్ రౌండర్లలో ఒకడిగా నిలిచాడు. 2011లో వన్డే వరల్డ్ కప్ గెలిచిన జట్టులో ఆటగాడిగా ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ, ఏషియా కప్ గెలిచిన జట్లలోనూ ఉన్న అశ్విన్.. టెస్టు క్రికెట్ లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు సొంతం చేసుకున్న క్రికెటర్ గానూ రికార్డులకెక్కాడు.
అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టడానికి అతని ఐపీఎల్ ప్రదర్శనే కారణం. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ధోనీ కెప్టెన్సీలో అతడు ఐపీఎల్లోకి అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ఆ టీమ్ ఛాంపియన్ గా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైనా ఐపీఎల్ తోపాటు క్లబ్ క్రికెట్ లో అశ్విన్ కొనసాగనున్నాడు.