మీకో దండంరా అయ్యా.. పాక్ కోచ్ పదవికి కిరిస్టెన్ గుడ్ బై

ప్రపంచ క్రికెట్ లో అనిశ్చితి మారుపేరు పాకిస్తాన్ జట్టే... ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలీదు... ఒక్కోసారి పెద్ద జట్లకు షాకిస్తుంది... మరోసారి పసికూన చేతిలో ఓడిపోతుంది.. ఆ జట్టు ఆటే కాదు పాక్ క్రికెట్ బోర్డు, టీమ్ మేనేజ్ మెంట్.. ఇలా ప్రతీ విషయంలోనూ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు.

  • Written By:
  • Publish Date - October 29, 2024 / 11:42 AM IST

ప్రపంచ క్రికెట్ లో అనిశ్చితి మారుపేరు పాకిస్తాన్ జట్టే… ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలీదు… ఒక్కోసారి పెద్ద జట్లకు షాకిస్తుంది… మరోసారి పసికూన చేతిలో ఓడిపోతుంది.. ఆ జట్టు ఆటే కాదు పాక్ క్రికెట్ బోర్డు, టీమ్ మేనేజ్ మెంట్.. ఇలా ప్రతీ విషయంలోనూ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. అందుకే పాక్ జట్టు కోచ్ గా ఎవ్వరూ ఎక్కువ కాలం పనిచేయలేరు. తాజాగా పాక్ క్రికెట్ జట్టు కోచ్ పదవికి గ్యారీ కిరిస్టెన్ గుడ్ బై చెప్పేశాడు. పాక్ జట్టుతో తాను పనిచేయలేనంటూ రాజీనామా ఇచ్చేశాడు. కిరిస్టెన్ కారణం చెప్పకపోయినా సెలక్టర్లతో విభేదాలే అతని నిర్ణయానికి కారణంగా తెలుస్తోంది. అలాగే టెస్ట్ ఫార్మాట్ కు జాసన్ గిలెస్పీని కోచ్ గా నియమించడం కూడా మరో కారణంగా కనిపిస్తోంది. ఇక ఎప్పటిలానే ఆటగాళ్ళ ప్రదర్శన ఆధారంగా కాకుండా సిఫార్సులతోనే ఆసీస్ తో సిరీస్ కు పాక్ జట్టు ఎంపిక జరగడంపై కిరిస్టెన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. సెలక్టర్లు తన మాటను పరిగణలోకి తీసుకోకపోవడంతో మనస్తాపానికి గురైన ఈ సఫారీ మాజీ ప్లేయర్ తాను కోచ్ గా కొనసాగలేనంటూ పీసీబీకి ఖరాఖండిగా చెప్పేశాడు.

ఈ ఏడాది ఏప్రిల్ లో రెండేళ్ల కాంట్రాక్ట్‌ తో ఎంపికైన కిర్‌స్టన్.. కేవలం ఆరు నెలలు మాత్రమే పాక్ జట్టులో కొనసాగాడు. ఆసీస్ టూర్ కు జట్టు ఎంపిక ప్రకటన తర్వాత కిర్‌స్టన్, జాసన్ గిల్లెస్పీ, పాక్ క్రికెట్ బోర్డు మధ్య విభేదాలు తలెత్తినట్టు అర్థమవుతోంది. కోచ్ గా కిరిస్టెన్ కు అద్భుతమైన ట్రాక్ రికార్డుంది. 2011 లో టీమిండియాను ప్రపంచ ఛాంపియన్ గా నిలిచాడు. అయితే పాక్ కోచ్ గా మాత్రం అతనికి చేదు జ్ఞాపకాలు మిగిలాయి. ముఖ్యంగా 2024 టీ20 వరల్డ్ కప్ లో పాక్ జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. అలాగే సొంతగడ్డపై బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ఓటమి కూడా పాక్ జట్టు పేలవ ప్రదర్శనను మరింత దిగజార్చింది. అయితే పాక్ జట్టు గర్వపడేలా చేస్తానంటూ బాధ్యతలు తీసుకున్న కొత్తలో కిరిస్టెన్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. దీనిపై పలువురు మాజీ పాక్ క్రికెటర్లు సెటైర్లు వేశారు.

ఎంత చేసినా కిరిస్టెన్ ను కూడా త్వరలోనే కోచ్ గా తీసేస్తారంటూ పాక్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ గత నెలలో చెప్పాడు. ఇప్పుడు అదే నిజమైంది. అంతకుముందు టీ ట్వంటీ ప్రపంచకప్ లో పాక్ పేసర్ షాహీన్ అఫ్రిదితో కిరిస్టెన్ కు గొడవైంది. కోచ్‌ కిరిస్టెన్‌తో అతడు అనుచితంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. రిస్టెన్‌కు, ఆటగాళ్లకు మధ్య తీవ్ర విభేదాలు వచ్చినట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి. పీసీబీ కూడా ఈ విషయంలో అతడికి మద్దతుగా నిలవకపోవడంతో జట్టును వీడినట్లు ప్రకటించాడు. అతడి రాజీనామాను కూడా పీసీబీ వెంటనే ఆమోదించింది. వీటితో పాటు సెలక్టర్లు కూడా జట్టు ఎంపికలో కిరిస్టెన్ ను పక్కన పెట్టినట్టు తెలుస్తోంది.
తాజాగా ఆసీస్‌, జింబాబ్వేతో సిరీస్ ల కోసం పాక్ జట్టును ఎంపిక చేయాగ..కెప్టెన్‌గా బాబర్ అజామ్‌ స్థానంలో మహమ్మద్‌ రిజ్వాన్‌ను బాధ్యతలు అప్పగించారు.