ఆల్ఫాబెట్ తీసుకున్న నిర్ణయంతో వేలాది మంది ఉద్యోగుల జీవితాలు ఒక్కసారిగా తారుమారైపోయాయి. అయితే ఉద్యోగుల జీవితాల ఎలా ఉన్నా.. ఆల్ఫాబెట్ కంపెనీకి నాయకత్వం వహిస్తున్న మన తమిళ్ టెక్కీ సుందర్ పిచాయ్ జీతం, జీవితం మాత్రం ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాయి. గూగుల్ లాంటి కంపెనీలు ఉద్యోగులను తొలగించడానికి కారణాలు ఎన్నైనా చెప్పొచ్చు. సింపుల్‌గా కాస్ట్ కటింగ్ పేరుతో పింక్ స్లిప్స్ ఇచ్చేస్తూ ఉంటారు. గూగుల్‌లో కూడా కొన్ని నెలలుగా ఇదే జరుగుతోంది. కానీ ఈ ఫార్ములా అందరికీ వర్తించదు. కష్టాలు, నష్టాలు అన్నీ చిన్న స్థాయి ఉద్యోగులకు మాత్రమే. ఎందుకంటే కంపెనీ నడిపించే పెద్ద స్థాయి వ్యక్తులు మాత్రం సంస్థ నుంచి భారీగా ఆర్జిస్తూనే ఉంటారు. అందులో ఒకరు మన సుందర్ పిచాయ్.
వడ్డించేవాడు మనవాడైతే
అవును వడ్డించేవాడు మనవాడైతే..ఎక్కడ కూర్చున్నా ఒక్కటే అంటారు. సుందర్ పిచాయ్‌కి కూడా సంస్థ అలాగే వండి వార్చుతోంది. ఓవైపు ఆర్థిక మాంద్యం పేరుతో వేలల్లో ఉద్యోగాలను తొలగిస్తున్న గూగుల్.. సీఈఓకు మాత్రం ఊహించని స్థాయిలో రెమ్యునరేషన్ ఇస్తోంది. ప్రపంచంలో ఎక్కువ మొత్తంలో ఆర్జిస్తున్న కార్పోరేట్ లీడర్ల జాబితాలో ఎప్పుడూ ముందుండే సుందర్ పిచాయ్‌కి ఆల్ఫాబెట్ కంపెనీ మరోసారి భారీ నజరానా ఇచ్చింది. 2022 ఆర్థిక సంవత్సరానికి గానూ స్టాక్ అవార్డులతో కలిపి సుందర్ పిచాయ్ ఆర్జించింది 226 మిలియన్ డాలర్లు. అంటే మన రూపాయాల్లో చెప్పుకుంటే అక్షరాల 1854 కోట్ల రూపాయలు. ఇది కేవలం గతేడాదికి సంబంధించి ఆదాయం మాత్రమే. 226 మిలియన్ డాలర్లు అంటే… గూగుల్ లో మిడిల్ రేంజ్ ఎంప్లాయి ఆదాయం కంటే 800 రెట్లు ఎక్కువ. అంటే గూగుల్‌నే నమ్ముకుని ఉద్యోగాలు చేస్తున్న వేలాది మంది ఎంప్లాయిస్… ఉన్నపళంగా రోడ్డున పడుతుంటే.. ఆ కంపెనీ ఈసీఓ బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రం ఆమాతం పెరిగిపోతోంది.
కాస్ట్ కటింగ్ వర్సెస్ నజరానాలు
అందరూ బాగుండాలి.. అందులో మనముండాలి ఎవరైనా అనుకుంటారు. కానీ ఉద్యోగుల బాగోగులు, వాళ్ల జీతభత్యాలు, చివరకు వారి ఉద్యోగాలతో సంబంధం లేకుండా… గూగుల్ లాంటి సంస్థల్లో సీఈవో స్థాయి వ్యక్తులు భారీగా లబ్ది పొందుతున్నారు. ఖర్చు తగ్గించుకుని కొత్త లక్ష్యాలను చేరుకునే పేరుతో ఈ ఏడాది జనవరిలో ఒకేసారి 12వేలమందిని ఉద్యోగాల్లో నుంచి తొలగించింది గూగుల్ సంస్థ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గూగుల్ వర్క్ ఫోర్స్ లో ఇది 6 శాతం. ఆ తర్వాత కూడా వరుస పెట్టి ఎంప్లాయిస్‌ను వదిలించుకునే కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉంది గూగుల్.
సుందర్ పిచాయ్ నెట్ వర్త్ ఎంతో తెలుసా ?
సుందర్ పిచాయ్ స్థాయి వేరు. 2004లో సాధారణ టెక్కీగా గూగుల్ లో చేరిన సుందర్ పిచాయ్.. చాలా వేగంగా పై స్థాయికి ఎదిగారు. 2015లో గూగుల్ సీఈవోగా… 2019 నుంచి గూగుల్‌తో పాటు దాని మాతృసంస్థ ఆల్ఫాబెట్ సీఈవోగా వ్యవహరిస్తున్నారు. ఆల్ఫాబెట్‌తో పాటు గూగుల్‌ను ఎప్పుడూ నెంబర్ కంపెనీగా నిలిపే బాధ్యత ఆయనపైనే ఉంటుంది. అందుకే ఆయనకు సంస్థ నుంచి అందే చెల్లింపులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. వాస్తవానికి సుందర్ పిచాయ్ బేసిక్ శాలరీ 2 మిలియన్ డాలర్లు మాత్రమే. అయితే ఆయనకు ఆల్ఫాబెట్‌లో షేర్స్ కూడా ఉన్నాయి. ఆల్ఫాబెట్ సీఈవోగా సుందర్ పిచాయ్‌కి కంపెనీ 88,693 షేర్లను కేటాయించింది. మొత్తం కంపెనీ షేర్లలో ఇది 0.01 శాతం మాత్రమే. పిచాయ్‌కి భద్రత కల్పించేందుకే గూగుల్ 5.94 మిలియన్ డాలర్లను ఖర్చు చేసింది. జీతం, షేర్లు, ఇతర ఆదాయ మార్గాలను కలుపుకుంటే ఈ ఏడాది సుందర్ పిచాయ్ నెట్ వర్త్ 1310 మిలియర్ డాలర్లు.
ఆల్ఫాబెట్‌లో పిచాయ్‌దే పైచేయి
కంపెనీ నుంచి లబ్ది పొందడంలో ఆల్ఫాబెట్‌లో ఉన్న ఇతర ఎగ్జిక్యూటివ్స్ కంటే సుందర్ పిచాయ్ ముందు వరసలో ఉన్నారు. గూగుల్ నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్రభాకరన్ రాఘవన్ 37 మిలియన్ డాలర్లు మాత్రమే పొందారు. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రత్ పరత్ 24.5 మిలియన్ డాలర్లు అందుకున్నారు.
పిచాయ్ లగ్జరీ లైఫ్
గూగుల్‌లో చేరిన తర్వాత సుందర్ పిచాయ్ లైఫ్‌స్టైల్ మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ కార్పోరేట్ లీడర్లలో మోస్ట్ లగ్జరీ లైఫ్ గడిపే సీఈవో పిచాయ్ మాత్రమేనని అమెరికాలో చెప్పుకుంటారు. మధురైలో ఉన్నప్పుడు ఆయన మధ్యతరగతి జీవితాన్ని గడిపినా.. ఇప్పుడు మాత్రం ఆయనది చాలా చాలా ఖరీదైన జీవితం. ఆయన ఇల్లే ఇంద్రభవనాన్ని తలపిస్తుంది. కాలిఫోర్నియాలోని లాస్ ఆల్టోస్ కొండపై 31.17 ఎకరాల విస్తీర్ణంలో చుట్టూ ప్రకృతి అందాలతో ఖరీదైన ఇల్లు చూసుకున్నారు. చాలా సంవత్సరాల క్రితమే 40 మిలియన్ డాలర్లు పెట్టి మాన్షన్‌ను కొనుగోలు చేశారు పిచాయ్. ఆ ఇంట్లో ప్రపంచ స్థాయి సౌకర్యాలన్నీ ఉంటాయి. పూల్, జిమ్, స్పా, వైన్ సెల్లార్ ఇలా ఒక్కటేంటి.. సకల సౌకర్యాలు ఆయన కళ్లముందే ఉంటాయి. ఇంటీరియర్ కోసమే సుందర్ పిచాయ్ భార్య అంజలీ పిచాయ్ 49 కోట్ల రూపాయలను ఖర్చు చేశారట.
పిచాయ్ జీతం..ట్రెండింగ్ టాపిక్
సుందర్ పిచాయ్‌కి అందించిన ప్యాకేజ్ వివరాలను ఆల్ఫాబెట్ కంపెనీ ప్రకటించగానే.. ఉద్యోగులు, మాజీ ఉద్యోగులు, ఇటీవల ఉద్యోగాలు కోల్పోయిన ఆల్ఫాబెట్ బాధితులు అందరూ ఎంత పని చేశావ్ గూగుల్ అంటూ తిట్టుకుంటున్నారు. వాస్తవానికి గూగుల్ గానీ, ఆల్ఫాబెట్ పరిధిలో ఉన్న ఇతర కంపెనీలు గానీ నష్టాల్లో లేవు. ప్రపంచంలోనే అత్యంత నైపుణ్యం కలిగిన వర్క్ ఫోర్స్ ఉన్న ఆల్ఫాబెట్ కంపెనీ ఎప్పటికప్పుడు తన వ్యూహాలను మార్చుకుంటూ ముందుకెళ్తుంది. అయితే కొన్ని నెలలుగా అమెరికా ఆర్థిక వ్యవస్థ ఊగిసలాడటం, ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచడం, మాంద్యం ముంచుకు రాబోతోందంటూ నిపుణులు హెచ్చరించడంతో ముందు జాగ్రత్తగా గూగుల్ హెడ్ కౌంట్ ను తగ్గించే పని చేపట్టింది. అందులో భాగంగా వేలాది మందికి ఉద్వాసన పలికింది. త్వరలోనే మరోసారి లేఆఫ్స్ ప్రకటించే అవకాశమున్న సమయంలో పిచాయ్‌కి అందిన నజరానా గురించి తెలుసుకుని పింక్ స్లిప్స్ అందుకున్న ఉద్యోగులు చెవులుకొరుక్కుంటున్నారు.