GUNDLAKAMMA PROJECT: గుండ్లకమ్మను పట్టించుకోరా ? అలా వదిలేస్తారా ?

ప్రభుత్వాలు మారుతున్నా... ప్రకాశం జిల్లా గుండ్లకమ్మ ప్రాజెక్ట్‌ దశ మాత్రం తిరగడం లేదు. నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో ప్రాజెక్ట్‌ గేట్లు.. ఒక్కొక్కటిగా విరిగి కొట్టుకుపోతున్నాయ్‌. నాలుగు టీఎంసీలకు పైగా నీరు వృథాగా పోతుండటంతో ఆందోళన చెందుతున్నారు రైతులు.

  • Written By:
  • Publish Date - December 10, 2023 / 09:02 AM IST

ప్రకాశం జిల్లా మల్లవరం దగ్గర గుండ్లకమ్మ జలాశయం గేట్లు ధ్వంసమవుతున్నాయ్‌. దాదాపు 80 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 72 గ్రామాలకు తాగునీరు అందించే ఈ ప్రాజెక్ట్‌ నిర్వహణ అగమ్యగోచరంగా మారిందనే విమర్శలు వస్తున్నాయ్‌. 2008లో 3.87 టీఎంసీల సామర్థ్యంతో ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. అయితే అప్పటి నుంచి పూర్తి స్థాయిలో ఈ  జలాశయం అందుబాటులోకి రాలేదు. నిర్వాసితుల సమస్యలు పరిష్కరించకపోవడం, కాలువ నిర్మాణం చేపట్టకపోవడంతో ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణం పూర్తయినా…. రైతులకు నిరూపయోగంగానే ఉంది. ఇటు సకాలంలో నిధులు విడుదల చేయకపోవటంతో ప్రాజెక్ట్‌ నిర్వహణ సరిగ్గా జరగక వరుసగా గేట్లు కొట్టుకుపోతున్నాయి. గత ఏడాది వర్షాలకు 3వ నంబరు గేటు కొట్టుకుపోయింది. దీనికి పూర్తిస్థాయిలో మరమ్మత్తులు పూర్తి కాకముందే 2వ గేటు కొట్టుకుపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 15 వేల క్యూసెక్కుల వరకూ నీరు వృధాగా సముద్రంలోకి పోతుండగా…. ప్రాజెక్టులో ప్రస్తుతం 2.6 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

2012లో మొదటిసారిగా జలాశయాన్ని పూర్తి స్థాయిలో నింపారు. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు ఎలాంటి పర్యవేక్షణ లేనికారణంగా…. ప్రాజెక్టులో కీలకమైన గేట్లు తుప్పు పట్టిపోయాయి. మొత్తం 15 గేట్లలో 10 గేట్లకు మరమ్మతులు చేయాలని జలవనరులశాఖ ఇంజినీర్లు మూడేళ్ల కిందటే గుర్తించారు. దాదాపు 3 కోట్లతో అంచనాలు సిద్ధం చేసి, ఉన్నతాధికారులకు పంపినా ఆర్థిక శాఖ నుండి క్లియరెన్స్ రాలేదు.

ఇప్పుడీ ప్రాజెక్ట్‌ 2వ నెంబరు గేటు ఆకస్మాత్తుగా కొట్టుపోయింది. వాటర్‌ లీకేజీని అరికట్టేందుకు రెండు డమ్మీగేట్లు ఉన్నప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గతేడాది ఈ ప్రాజెక్ట్ ను సందర్శించిన ఇరిగేషన్‌ శాఖ మంత్రి అంబటి రాంబాబు…. వెంటనే రిపేర్లు చేపడతామని హామీ కూడా ఇచ్చారు. అయితే చర్యలు మాత్రం కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికే మద్దిపాడు, నాగులుప్పలపాడు మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు దండోరా వేయించారు. గతేడాది ఆగస్టులో మూడో గేటు కొట్టుకుపోతే ఇంతవరకూ కొత్తది పెట్టలేదని వాపోతున్నారు రైతులు. అధికారులు, వైసీపీ నేతలు కన్నెత్తైనా చూడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. గుండ్లకమ్మ ప్రాజెక్ట్‌ మొత్తం గేట్లు రిపేర్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.