Gutha Family : పరువు పోగొట్టుకున్న గుత్తా… కొడుక్కి నల్లగొండ ఎంపీ టిక్కెట్ పై వ్యతిరేకత !

గుత్తా ఫ్యామిలీ గందరగోళంగా, ఇంకా చెప్పాలంటే... బీఆర్‌ఎస్‌ అధినాయకత్వం మీద గరం గరంగా ఉందా? అంటే.. అవునన్న సమాధానమే వస్తోంది ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయ వర్గాల నుంచి. తన కుమారుడు అమిత్‌ రెడ్డిని లోక్‌సభ బరిలో దింపేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి (Gutta Sukhender Reddy). అటు అమిత్‌ కూడా... నల్లగొండ ఎంపీగా పోటీ చేయడానికి తాను సిద్ధమంటూ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన దగ్గర్నుంచి బహిరంగంగానే చెప్పుకొస్తున్నారు. కానీ... తాజాగా పోటీపై పునరాలోచనలో పడ్డారట.

 

గుత్తా ఫ్యామిలీ గందరగోళంగా, ఇంకా చెప్పాలంటే… బీఆర్‌ఎస్‌ అధినాయకత్వం మీద గరం గరంగా ఉందా? అంటే.. అవునన్న సమాధానమే వస్తోంది ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయ వర్గాల నుంచి. తన కుమారుడు అమిత్‌ రెడ్డిని లోక్‌సభ బరిలో దింపేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి (Gutta Sukhender Reddy). అటు అమిత్‌ కూడా… నల్లగొండ ఎంపీగా పోటీ చేయడానికి తాను సిద్ధమంటూ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన దగ్గర్నుంచి బహిరంగంగానే చెప్పుకొస్తున్నారు. కానీ… తాజాగా పోటీపై పునరాలోచనలో పడ్డారట. అందుకు పెద్ద కారణాలే ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. ఈ లోక్‌సభ నియోజకవర్గం (Lok Sabha Elections) పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్‌లో ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు గుత్తా అమిత్ రెడ్డి (Gutta Amit Reddy) అభ్యర్దిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారట.

తమకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యేలంతా జట్టు కట్టినందున ఇలాంటి పరిస్థితుల్లో పోటీ చేయడం కంటే… కామ్‌గా ఉండటమే గౌరవప్రదమని గుత్తా శిబిరం భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అంతమంది వ్యతిరేకంగా ఉన్నప్పుడు మనం పరువు పోగొట్టుకోవడం ఎందుకనుకుంటూ… ఉమ్మడి నిర్ణయం వచ్చినప్పుడు చూసుకుందాంలే అన్న నిర్ధారణకు వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. గుత్తా ఫ్యామిలీకి వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యేలు అధిష్టానం మీద చేసిన వత్తిడి ఫలించిందని అంటున్నాయి పార్టీ వర్గాలు. మాజీలంతా కట్టకట్టుకొని… నై అంటుంటే… నేను మాత్రం సై అని ఎలా అనగలనంటూ అమిత్‌ సన్నిహితులకు చెబుతున్నట్టు తెలిసింది. తాజా పరిణామాలతో సదరు మాజీ ఎమ్మెల్యేల తీరుపై గుత్తా ఫ్యామిలీ గుర్రుగా ఉందట.

ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ చెమటోడ్చితేనే విజయం కష్టం అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోందని, పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు తాను పోటీకి ముందుకు వస్తే… సహకరించాల్సింది పోయి వెనక గోతులు తీయడం ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. తమను ఉద్దేశ్యపూర్వకంగా వ్యతిరేకిస్తున్న వారితో మాట్లాడి సమన్వయం చేయాల్సిన పార్టీ పెద్దలు కూడా వారికే మద్దతు పలకడం ఏంటని కూడా ప్రశ్నిస్తోందట గుత్తా ఫ్యామీలీ. మాజీ ఎమ్మెల్యేల ఒత్తిడితో వాస్తవాలు మరిచి తనకు పరోక్షంగా నో చెప్పడం సరైందని కాదన్న అభిప్రాయంతో అమిత్‌ ఉన్నట్టు తెలిసింది. కావాలనే తమపై నిందలు మోపడం సరైంది కాదని, వ్యతిరేకిస్తున్న మాజీ ఎమ్మెల్యేలు తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారో ప్రతీ కార్యకర్తకు తెలుసునని, ఓటమి తర్వాతనైనా వాస్తవాలు మాట్లాడుకుంటే బాగుంటుందని గుత్తా వర్గం కూడా గట్టిగానే అంటోందట.

తమకు వ్యతిరేకంగా జట్టుకట్టడంలో కీలకంగా ఉన్న మాజీ మంత్రి… ఎంపీగా పోటీకీ దిగుతారా అని కూడా సవాల్‌ చేసే ధోరణిలో ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు. గెలుపు ఓటములపై వాస్తవాలు మాట్లాడుకోవడం మరిచి… తమ కుటుంబంపై నిందలు వేసి… బీఆర్ఎస్‌కు దూరం చేసే కుట్ర జరుగుతోందని కూడా గుత్తా ఫ్యామిలీ ఆవేదన వ్యక్తం చేస్తోందట. కుమారుడి పొలిటికల్‌ ఎంట్రీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న సుఖేందర్ రెడ్డి ఆశలపై… సొంత పార్టీ నేతలే నీళ్లు చల్లడంతో ఉమ్మడి జిల్లా బీఆర్‌ఎస్‌లో సుఖేందర్‌రెడ్డి ఒంటరి అవుతారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండగానూ… ఇదే తంతు కొనసాగుతోందని, ఇలాగైతే రాజకీయం ఎలా చేయగలమని తండ్రీ కొడుకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. ఈ డెవలప్‌మెంట్స్ తో సుఖేందర్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ లోనే ఉంటారా? లేక ప్రత్యామ్నాయం వెదుక్కుంటారా అన్న చర్చ కూడా మొదలైంది నల్గొండ రాజకీయవర్గాల్లో. దీంతో ఇప్పుడు ఆయన అడుగులు ఎలా పడబోతున్నాయన్న ఆసక్తి పెరుగుతోంది.