Gyanvapi Mosque: జ్ఞానవాపి మసీదు కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. మసీదు ప్రాంగణంలో పూజలు చేసుకునేందుకు వారణాసి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో జ్ఞానవాపి మసీదులో హిందూ దేవతా విగ్రహాలకు పూజలు చేసే అవకాశం భక్తులకు దక్కనుంది. ఉత్తరప్రదేశ్, వారణాసిలోని జ్ఞానవాపి మసీదు అంశంపై కొంతకాలంగా వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ మసీదు.. ఒకప్పటి దేవాలయమని హిందూ సంఘాలు వాదించాయి. దీనిపై పురాతత్వ శాఖ తవ్వకాలు జరిపి, నివేదిక సమర్పించింది.
Elon Musk: అందరూ ఇస్మార్ట్ శంకర్‌లే.. మెదడు మీదే.. కానీ దానిపై కంట్రోల్ మాది..!
ఈ నివేదికలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. తవ్వకాల్లో అనేక కళాఖండాలు బయటపడ్డాయి. విష్ణుమూర్తి, హనుమంతుడి విగ్రహాలు లభించాయి. అలాగే తెలుగులో కొన్ని గ్రంథాలు బయటపడ్డాయి. ఈ విష్ణు మూర్తి విగ్రహం సంప్రదాయ భంగిమలో శంకు, చక్రాలు ధరించి కూర్చుని ఉంది. అలాగే, మధ్యయుగ ప్రారంభ కాలంనాటి విష్ణువు రూపాలతో ఉన్న మరో రెండు శిల్పాలు కూడా లభించాయి. హిందూ విగ్రహాలు బయటపడటంతో అక్కడ పూజలు నిర్వహించేందుకు అనుమతించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. నంది విగ్రహానికి ఎదురుగా ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించాలని కోరారు. 1993కి ముందు తరహాలోనే బేస్‌మెంట్‌లో పూజలకు వెళ్లేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. అయితే, ఈ పిటిషన్లపై ఇంతేజామియా మసీదు కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ బేస్‌మెంట్ మసీదులో భాగమని, అక్కడ పూజలు చేయడానికి వీలు లేదన్నారు.
అది వక్ఫ్‌బోర్డు ఆస్తి అని పేర్కొన్నారు. అయితే, ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు హిందువులకు పూజలు చేసేందుకు అనుమతి ఇచ్చింది. వారంలో పూజలు చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. మసీదు బేస్‌మెంట్‌లోకి ప్రవేశించకుండా నిరోధించే బారికేడ్లను తొలగించేందుకు ఏర్పాట్లు చేయాలని కోర్టు ఆదేశించింది. కోర్టు తీర్పుపై కాశీ విశ్వనాథ్ ట్రస్టు హర్షం వ్యక్తం చేసింది. ఈ తీర్పు.. హిందువులకు అతిపెద్ద విజయమని వ్యాఖ్యానించింది. కాశీ, విశ్వనాథుడి ఆలయ పూజారులు ఇక్కడ పూజలు నిర్వహించబోతున్నారు.