తెలంగాణలో కాంగ్రెస్ సూపర్ జోరులో కనిపిస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టిన హస్తం పార్టీ.. మిగతా పార్టీలను టార్గెట్ చేసుకొని చేరికలకు గేట్లు తెరిచేసింది. కారు పార్టీకి చెందిన చాలామంది కీలక నేతలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఎమ్మెల్సీలు, నియోజకవర్గస్థాయి నాయకులు.. చివరికి కేసీఆర్‌కు సన్నిహితులు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇది స్టార్టింగ్ మాత్రమే.. మరిన్ని చేరికలు భారీగా జరిగే అవకాశాలు క్లియర్‌గా కనిపిస్తున్నాయ్. లేటెస్ట్‌గా ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటు ఆయన కూతురు కావ్య, గ్రేటర్ మేయర్ విజయలక్ష్మీ పార్టీలో చేరారు. మరో ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఐతే ఇదంతా ఎలా ఉన్నా… నందమూరి వారసురాలు, హరికృష్ణ కూతురు.. నందమూరి సుహాసిని కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీ అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. సీఎం రేవంత్‌తో ఆమె భేటీ అయ్యారు. సుహాసినితో పాటు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కూడా ఉన్నారు. జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి, ఖైరతాబాద్ పరిధిలో సుహాసినికి మంచి పరిచయాలు ఉన్నాయ్. ఆమెను పార్టీలో చేర్చుకుంటే కాంగ్రెస్‌కు కలిసి వస్తుందని రేవంత్ లెక్కలు వేస్తున్నారట. పార్టీలో చేరిన తర్వాత సుహాసినికి కీలక పదవి ఇచ్చేందుకు కూడా పార్టీ అధిష్టాన సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఇవ్వడమో లేదంటే గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయించి.. జీహెచ్‌ఎంసీ మేయర్ పదవి కట్టబెట్టడమే చేసేందుకు కాంగ్రెస్ సిద్ధం అయినట్లు తెలుస్తోంది. సుహాసిని చేరికతో.. నందమూరి కుటుంబ అభిమానులనే కాదు.. హైదరాబాద్‌లో సెటిలర్ల ఓటర్లను కూడా అట్రాక్ట్ చేయొచ్చని కాంగ్రెస్ భావిస్తోంది.