భారత మహిళల జట్టు కెప్టెన్సీని హర్మన్ ప్రీత్ కౌర్ నిలుపుకుంది. టీ 20 ప్రపంచకప్ లో సెమీస్ చేరకుండానే ఇంటిదారి పట్టడంతో హర్మన్ ప్రీత్ సారథ్యంపై విమర్శలు వచ్చాయి. కొత్త కెప్టెన్ ను ఎంపిక చేస్తారని కూడా అనుకున్నారు. అయితే స్వదేశంలో న్యూజిలాండ్ తో జరిగే వన్డే సిరీస్ కు హర్మన్ ప్రీత్ నే సారథిగా కొనసాగించారు. బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించిన జట్టులో ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్లు సయాలీ సత్ఘరే, సైమా ఠాకూర్, లెగ్ స్పిన్నర్ ప్రియా మిశ్రా, మిడిలార్డర్ బ్యాటర్ తేజల్ హసబ్నిస్ తొలిసారి వన్డే జట్టుకు ఎంపికయ్యారు. ఇంటర్ ఎగ్జామ్స్ కారణంగా వికెట్ కీపర్ రిచా ఘోష్ కివీస్ సిరీస్కు దూరమైంది. మరోవైపు గాయంతో లెగ్ స్పిన్నర్ ఆశా శోభన దూరమవగా.. ఆల్రౌండర్ పూజ వస్త్రాకర్కు విశ్రాంతి ఇచ్చారు.