Pawan Kalyan: చంద్రబాబు గొడవలో.. పవన్ కళ్యాణ్ ఓవరాక్షన్.. మరో సారి వ్యూహాత్మక తప్పిదం

పవన్ కళ్యాణ్ చేసిన ఓవరాక్షన్ ఎలాంటి ఫలితాలను, సంకేతాలను ఇచ్చింది.

  • Written By:
  • Publish Date - September 10, 2023 / 03:04 PM IST

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబుని సిఐడి అరెస్ట్ చేసింది. ఆయన విజయవాడ తీసుకొచ్చి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టి కార్యక్రమం కొనసాగుతోంది. అదే సమయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. భయంకరమైన సెల్ఫ్ గోల్ కొట్టుకున్నాడు. వ్యూహాత్మక తప్పిదాలకి , సెల్ఫ్ గోల్స్ కి మారుపేరైన పవన్ కళ్యాణ్ అదే పొరపాటు రిపీట్ చేశాడు. చంద్రబాబు అరెస్టు కాగానే అది తప్పు అని, అన్యాయంగా చంద్రబాబును అరెస్ట్ చేశారని ఒక ప్రకటన ఇచ్చాడు పవన్. తన వీడియో రియాక్షన్ కూడా మీడియాకు పంపించాడు. అక్కడితో ఊరుకొని ఉంటే సరిపోయేది.. ఏకంగా స్పెషల్ ఫ్లైట్ లో విజయవాడ బయలుదేరేందుకు బేగంపేట విమానాశ్రాయానికి చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ వస్తే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందనే నేపంతో ఆ విమానానికి అనుమతి ఇవ్వకుండా చేసింది ఏపీ పోలీస్ శాఖ.

దాంతో పవన్ ఇంకా చెలరేగి పోయాడు. తన మంది మార్బలాన్ని వేసుకొని వాహనాలతో రోడ్ మార్గంలో విజయవాడకి బయలుదేరారు. సరిగ్గా జగ్గయ్యపేటకు చేరుకోగానే ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ జనసేన కార్యకర్తలకు పోలీసుల కు మధ్య బాహాబాహీ జరిగింది. మరింత ఆవేశంతో ఊగిపోయిన పవన్ అక్కడే రోడ్డు మీదే బైఠాయించి తన నిరసన తెలిపాడు. ఈ హైడ్రామా అంతా చూడ్డానికి చాలా బాగుంది. కానీ పొలిటికల్ గా విశ్లేషిస్తే మాత్రం పవన్ చేసిన యాగి చాలా చిల్లరగా అనిపిస్తుంది. చంద్రబాబు ని అరెస్ట్ చేస్తే ధర్నాలు చేయాల్సింది.. ఆందోళన చేయాల్సింది టిడిపి నాయకులు వాళ్ళ క్యాడర్. ఆ బాధ్యత పవన్ కళ్యాణ్ తీసుకున్నాడు. అసలే నువ్వు అమ్ముడు పోయావు.. ప్యాకేజి స్టార్ అంటూ నిత్యం వైసిపి ఆరోపణలు సంధిస్తూనే ఉంటుంది. దానికి బలం ఇచ్చేటట్టుగా ఉన్నాయి పవన్ చేష్టలు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుడు. చంద్రబాబు టిడిపి అధ్యక్షుడు. ఒక పార్టీ అధ్యక్షుడిని అన్యాయంగా అరెస్టు చేసినప్పుడు మరో పార్టీ అధ్యక్షుడు దానిని ఖండించాలి. తన స్పందన ఇవ్వాలి.

మొదట నిన్న పవన్ అదే పని చేశాడు. ఆ తర్వాతే దారి తప్పిపోయాడు. అరెస్టు తప్పని బిజెపి, లెఫ్ట్ పార్టీలు , మరికొందరు నేతలు ఖండించారు. తమ నిరసన వ్యక్తం చేశారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం టిడిపి నాయకులు కన్నా ఎక్కువ ఓవరాక్షన్ చేశాడు. తద్వారా తాను టిడిపికి బి పార్టీ నేతనని.. తన కేడర్ కే చెప్పకనే చెప్పాడు. టీవీల్లో పవన్ కళ్యాణ్ ఓవరాక్షన్ చూస్తున్న వాళ్ళు ఆశ్చర్యపోయారు. అసలు పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడా.. టిడిపి కార్యకర్త.. అని అనిపించింది.

2014-19 మధ్య పవన్ కళ్యాణ ఇదే చంద్రబాబుని లోకేష్ ని.. అవినీతిపరులని నిందించాడు విమర్శలు చేశాడు. వాళ్లతో పొత్తు పెట్టుకోనని వెనక్కి వెళ్ళిపోయాడు. ఆ ఐదేళ్లలో జరిగిన స్కాంపైనే ఇప్పుడు నానా రచ్చ జరుగుతుంది. స్కిల్ స్కామ్ లో చంద్రబాబు, లోకేష్ దోషులు కావచ్చు, కాకపోవచ్చు. వాళ్లకి వ్యతిరేకంగా వైసీపీ సర్కార్ చేస్తున్న కుట్ర కూడా కావచ్చు. ఏది జరిగినా ఏది జరిగినా దానిపై మొదట స్పందించాల్సింది.. ఆందోళన చేయాల్సింది.. టిడిపి నాయకులు, వాళ్ల క్యాడర్. కానీ పవన్ కళ్యాణ్ తాను అందరికన్నా ముందున్నానని చంద్రబాబు కి మద్దతుగా రోడ్డెక్కి రచ్చ చేసి తన క్యాడర్ ని అయోమయంలో పడేసాడు. అసలు పవన్ కళ్యాణ్ టిడిపి నాయకుడా? జనసేన నాయకుడా..? అనే సందేహం పుట్టించాడు. సంఘీభావం తెలపడం వేరు.. రోడ్డెక్కి రచ్చ చేయడం వేరు. రాజకీయ నాయకుడిగా పరిణితి లేని పవన్ కళ్యాణ్ మరోసారి ఈ విషయంలో తనకుమాలిన ధర్మానికి పోయివ్యూహాత్మక తప్పిదం చేశాడు. అంతేకాదు క్యాడర్ దృష్టిలోనూ చులకనయ్యాడు.