తెలంగాణలో ఎన్నిలకు ఇంకా మూడు నెలలు ఉన్నప్పటికీ రాజకీయ పార్టీలు ప్రచార వేడిని అమాంతం పెంచేశాయి. ఎక్కడ చూసినా సభలు సమావేశాలతో బిజీ బిజీ గా కాంగ్రెస్ ఉంది. సంక్షేమం అభివృద్ది మంత్రాన్ని జపిస్తూ ముందుకు సాగుతున్నారు సీఎం కేసీఆర్. ఇక బీజేపీ అయితే తెలంగాణ విమోచన దినోత్సవం అంటూ హంగామా చేసింది. ఈ మూడు పార్టీలు అమీ తుమీ అంటూ చేసిన ఈ వీకెండ్ కార్యక్రమాల్లో సక్సెస్ రేటు మాత్రం కాంగ్రెస్ కే ఎక్కువగా ఉందని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చిందో పూర్తి వివరాలు చూద్దాం.
సంక్షేమం – అభివృద్ది :
బీఆర్ఎస్ పార్టీ తన పదేళ్ల పాలనా ప్రస్థానంలో ఎవరూ కనివిని ఎరుగని రీతిలో అభివృద్ది చేశాం అంటోంది. అయితే దీనికి ధీటుగా కాంగ్రెస్ సంక్షేమం అంటే ఇది అంటూ తన మ్యానిఫెస్టోని చూపిస్తూ ముందుకు సాగుతోంది. అన్ని వర్గాలను సమానంగా చూసేలా తన కార్యాచరణను రూపొందించుకుంది. తాము అధికారంలోకి వస్తే యువతకు మెరుగైన విద్యతో పాటూ మరిన్ని మౌళిక సదుపాయాలను అందిస్తామని చెప్పింది. అలాగే అన్ని వర్గాల వారికి భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతోంది. కేసీఆర్ అవినీతిని అడుగడుగునా ఎండగడుతూ ముందుకు సాగుతోంది. అన్నీ అరకొర పనులు చేసి అభివృద్ది అనే ముద్ర వేసుకుంటున్నారు అంటూ ఆరోపించింది.
కర్ణాటకా గ్యారెంటీ నమూనా
గత కొన్ని నెలల క్రితం జరిగిన కర్ణాటక ఎన్నికల వ్యూహాన్నే ఇక్కడ కూడా అవలంభిస్తోంది. తాము అధికారంలోకి వస్తే ఏమి చేస్తాము అన్న సందేహాన్ని నివృత్తి చేయడం కోసం గ్యారెంటీ కార్డులను ముద్రించారు. వీటిని ప్రజలకు అందించే కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రస్తుత కాలంలో ఏమి కోనాలనన్నా గ్యారెంటీ అడిగే సామాన్యుల నాడి ని బాగా పట్టుకుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రతి పథకానికి సంబంధించిన గ్యారెంటీ కార్డులు ప్రజల్లో అందిస్తారు. తాము అధికారంలోకి వస్తే ఇలా చేస్తాము అని కర్ణాటకను నమూనాగా చూపిస్తారు నాయకులు. ఒకవేళ భవిష్యత్తులో ఇలా చేయకపోతే ప్రజలు ఈ కార్డు చూపిస్తూ పార్టీని బద్నాం చేసే అవకాశం ఉంది. అదే విధంగా పార్టీ నేతలకు నిలదీసి అడిగి భయాన్ని కలిగించేందుకు దోహదపడుతుంది.
తెలంగాణ ఇచ్చింది సోనియా అనే సెంటిమెంట్
కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి దశాబ్థ కాలంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఘోర పరాభవం ఎదురవుతోంది. ఈ క్రమంలో 2023లో ఎలాగైనా అధికారాన్ని సాధించి తీరాలన్న దృఢ సంకల్పంతో ముందుకు సాగుతోంది. అయితే ఇన్నాళ్లు తాము తెలంగాణ ఇచ్చామన్న సెంటిమెంటును రగిలించడంలో తీవ్రంగా విఫలమైయ్యారనే చెప్పాలి. రేవంత్ రెడ్డి టీపీసీసీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది అనే సెంటిమెంట్ ప్రాణం పోసుకుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ తెలంగాణ తెచ్చాము అంటే ఇచ్చింది మా సోనియమ్మ అని బలంగా ప్రజల్లోకి తీసుకుపోతున్నారు. దీంట్లో కొంతమేర సక్సెస్ సాధించారు.
కేసీఆర్ – మోదీ పథకాలలో కొంచం మర్పులు
కేసీఆర్ గతంలో అధికారం రావడానికి బలంగా దోహదపడిన పథకం వృద్ధాప్య పింఛన్లు. తాను అధికారంలోకి వస్తే రూ. 2000 ఇస్తామన్నారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఉండే వృద్ద ఓట్లు గంపగుత్తగా బీఆర్ఎస్ కి వచ్చి పడ్డాయి. అలాగే రైతు బంధు పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న నగదులో కొన్ని మార్పులు చేసి తమ మ్యానిఫెస్టోని ప్రకటించాయి. ఇప్పడు ఇస్తున్న వృద్దాప్య పింఛనుకు మరో రెండు వేలు జతచేసి రూ. 4000 ఇస్తామని ప్రకటించారు. అలాగే రైతులకు అందే పథకాలను కూడా మార్పులు చేసి కూలీలకు ఏడాదికి 12వేలు, రైతు భరోసా 15వేలకు పెంచుతూ ఆకర్షించే ప్రయత్నం చేశారు. అలాగే సిలిండర్ ధరను రూ. 500 ఇస్తామని ప్రకటించారు. దీంతో అటు కేంద్రం, ఇటు రాష్ట్రా ప్రభుత్వానికి చెక్ పెట్టేందుకు పావులు కదుపుతోందని అర్థమౌతోంది.
బీఆర్ఎస్ – బీజేపీ ఒక్కటే అనే నినాదం
బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేందుకు మోదీ-కేసీఆర్ ఎక్కటే అని చెప్పేందుకు ప్రయత్నం చేశారు. దీనికి ఉదాహరణగా దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఐటీ, ఈడీ, సీబీఐ దాడులే అని ఊటంకించారు. బీజేపీకి మద్దతుగా ఉన్న వాళ్ల ఇళ్లలో దర్యాప్తు సంస్థల సోదాలు జరగవు అంటూ ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ ప్రత్యక్షంగా కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని చెప్పి ఎలాంటి దర్యాప్తునకు ఆదేశించలేదని కేసీఆర్ ను ఎండగట్టే ప్రయత్నం చేశారు. అలాగే కవిత పై ఉన్న ఈడీ కేసు కూడా అప్పుడప్పుడూ వెలుగులోకి తెచ్చి మళ్లీ కనుమరుగైపోతుందని విమర్శించారు. ఈ పరిణామాలన్నింటినీ ప్రజలు గమనించాలని కోరడంతో నిజమేనేమో అన్న అనుమానాలకు తెర తీశారు.
ఎంఐఎం – బీఆర్ఎస్ కు మద్దతు అంశం
తెలంగాణలో ఎంఐఎం తో కేసీఆర్ మిత్రబంధాన్ని కొనసాగించడాన్ని కూడా ప్రశ్నించారు. దీంతో ఎంఐఎం ను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించారు. కేసీఆర్ – బీజేపీతో అంటకాగితే ఎంఐఎం కేసీఆర్ తో సన్నిహితంగా ఉంటారన్నారు. అంటే వీరిద్దరూ బీజేపీ మద్దతు దారులే అని లింక్ చేస్తూ మాట్లాడారు. ఇలా చేయడం వల్ల తెలంగాణలోని ముస్లీం ఓటు బ్యాంకును కాంగ్రెస్ వైపుకు తిప్పుకునేందుకు చేసిన ప్రయత్నంగా చెప్పవచ్చు. మొత్తం 13శాతం ఉన్న ముస్లీం ఓట్లను తనవైపుకు తిప్పుకోగలిగితే కాంగ్రెస్ దాదాపు అధికారంలోకి వచ్చినట్లే అంటున్నారు పరిశీలకులు.
ఈ కీలక అంశాలన్నింటి గురించి కాంగ్రెస్ ప్రస్తావిస్తూ బీజేపీ, బీఆర్ఎస్ ను గద్దె దించేందుకు ప్రయత్నం చేసింది. అలాగే హామీలు, గ్యారంటీ కార్డులు, అభివృద్ది, అవినీతిపై సరైన వ్యూహాలను అమలు చేసిందంటున్నారు రాజకీయ పండితులు. ఇది ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో కాంగ్రెస్ కేసీఆర్ కి గట్టి పోటీ ఇస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఒక వేళ రాజకీయ సమీకరణాలు తలకిందులైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు అంటున్నారు పరిశీలకులు.
T.V.SRIKAR