రోజుకో దుమారం.. పూటకో వివాదం.. ఇదీ విశాఖ ఎంపీగారి స్టయిల్. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కోవడానికి రాజకీయాల్లోకి వస్తే ఇక్కడ ఊహించని ఎదురు దెబ్బలు తప్పడం లేదట. ఈ దిశగా జనసేనతో పెట్టుకున్న సున్నం ఇప్పుడు ఆ విశాఖ ఎంపీ MVV కి తలనొప్పిగా మారింది. అదే సమయంలో అధికారపార్టీ నేతపై గ్లాసు పార్టీ పోరాడుతుంటే.. సైకిల్ సేన సైలెంట్ అవ్వడం వెనుక కారణాలు ఆసక్తిగానే ఉన్నాయి. లక్ష్యం ఉమ్మడిది అయినప్పుడు ఎవరికి వారే అన్నట్టుగా TdP, జనసేన ఎందుకు వ్యవహరిస్తున్నాయి..?
ఎంవీవీ సత్యన్నారాయణ.. విశాఖపట్నం ఎంపీ..!! రియల్ ఎస్టేట్ ప్లాట్ ఫార్మ్ నుంచి ఢిల్లీ సభలో అడుగు పెట్టిన ఫక్తు బిజినెస్ మ్యాన్. నిర్మాణ రంగంలో 30ఏళ్ళ అనుబంధం కలిగిన ఎంవీవీ.. 2017లో అనూహ్యంగా రాజకీయాల్లో అడుగుపెట్టారు. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రి బంధువుల భూమికి సంబందించిన వివాదం సత్యన్నారాయణ లైఫ్ ను మలుపు తిప్పేసింది. ఆక్రమణల ఆరోపణలతో ఎంవీవీపై అప్పట్లో పీఎం పాలెం పోలీసులు కేసుపెట్టి అరెస్ట్ చేశారు . అప్పటి వరకు ఎంవీవీకి చెందిన వ్యాపారాల్లో లోటు పాట్లు పెద్దగా జనానికి తెలిసింది తక్కువే. అరెస్టు తర్వాత కసితో రాజకీయాల్లో అడుగుపెట్టిన ఆయన 2019లో విశాఖ ఎంపీగా దాదాపు 4వేల ఓట్లతో గెలిచారు. ట్రయాంగిల్ పోటీ జరిగిన ఆ ఎన్నికల్లో పార్లమెంట్ పరిధిలో నాలుగు అసెంబ్లీ సీట్లు గెలుచుకోగా.. వైసీపీ ఎంపీ అభ్యర్ధి విజయం సాధించడం వెనుక కారణాలపై అనేక రాజకీయ చర్చలు ప్రచారంలోకి వచ్చాయి. అటు వ్యాపారం, ఇటు రాజకీయంగా డబుల్ ప్రమోషన్ పొందిన ఎంపీకి మొదటి మూడేళ్లు సజావుగానే సాగిపోయింది. అధినాయకత్వానికి అత్యంత విధేయుడుగా కలర్ రావడంతో అధికార పార్టీ వర్గాల్లో ఊహించిన దాని కంటే చాలా ఎక్కువ ప్రాధాన్యత లభించింది.
ఈ క్రమంలో మధురవాడలో ఇంటెలిజెన్స్ ఎస్పీ భూ ఆక్రమణ వ్యవహారం పెద్ద దుమారం రేపింది. గేటెడ్ కమ్యూనిటీ కోసం వేసే రోడ్డును ఎస్పీ భూమిలో నుంచి వేసేందుకు సిద్ధం అయ్యారనేది వివాదాస్పదం అయింది. దాన్ని సర్దుబాటు చేసుకునే క్రమంలో భవిష్యత్తులో విశాఖలో వ్యాపారాలు చేయనని ఎంపీ చేసిన ప్రకటన అటు పార్టీకి, ఇటు ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించింది. పెద్దల జోక్యంతో వివాదం ముగిసిన తర్వాత భారీ ప్రాజెక్టుల్లో ఎంవీవీ నిర్మాణ కంపెనీపై ఆరోపణలు వెల్లువెత్తాయి. అప్పటి వరకు లోగుట్టుగా సాగిపోయిన వ్యవహారాలు ఒక్కొక్కటిగా తెరపైకి రావడంతో ఎంపీ చుట్టూ విమర్శలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో పార్టీలో కీలక నేతతో ఎంవీవీ సున్నం పెట్టుకోవడం కొత్త చిక్కులకు కారణమైంది. కూర్మన్నపాలెంలో అత్యంత విలువైన స్థలాన్ని ఎంపీ 99: 1 నిష్పత్తిలో ఎంవీవీ వెంచర్ పేరుతో కొట్టేశారని ఆరోపణలు చెలరేగాయి. వీటిని ఖండించే క్రమంలో దసపల్లా భూముల వ్యవహారం బయటపెట్టి కీలక నేతను వేలెత్తి చూపించే ప్రయత్నం బూమ్ రాంగ్ అయ్యింది.
ఆ తరువాత కాలంలో విశాఖ ఎంపీ MVV చేసే ప్రాజెక్టులపై విపక్షాలు ఓ కన్నేసి ఉంచడం, లోపాలు దొరికితే ఉతికేయడం ఓ పద్ధతి ప్రకారం జరుగుతోంది. ఆ దిశగా ఎంపీని ఎక్కువ టార్గెట్ చేసింది జనసేనే. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిపోవాలనే బలమైన కోరిక ఎంవీవీలో వుంది. హైకమాండ్ ను ఒప్పించి తూర్పు నియోజకవర్గం కో ఆర్డినేటర్ పదవి తెచ్చుకున్నారు. అధినాయకత్వం నిర్ణయానికి ఎదురు చెప్పకపోయినా ఎంపీకి సహాయ నిరాకరణ చేస్తున్నాయి ఇక్కడ మిగిలిన గ్రూపులు. ఈ పరిస్థితుల్లో సిటీ నడిబొడ్డున ఉన్న CBCNC భూముల్లో ఎంవీవీ నిర్మాణ కంపెనీ ప్రారంభించిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ “ది MVV పీక్” వివాదాల్లో చిక్కుకుంది. మిషనరీ భూముల అన్యాక్రాంతం అయ్యాయని టీడీపీ పోరాటం చేసింది. అప్పట్లో జనసేన వేరుగా న్యాయస్థానంను ఆశ్రయించింది. ఈ క్రమంలో కమర్షియల్ ప్రాజెక్ట్ కోసం జీవీఎంసీ TDRలు ఇవ్వడం ఒక ఎత్తైతే.. అత్యంత కీలకమైన టైకూన్ జంక్షన్ మూసేయడం రచ్చకు కారణమైంది. వారాహి యాత్రలో అందిన ఫిర్యాదులపై స్పందించిన పవన్ కళ్యాణ్ ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రోడ్లపై అడ్డంకులు తొలగించాలని డిమాండ్ చేశారు. ఎంపీ వ్యాపార అవసరాలు, సెంటిమెంట్ కోసం రోడ్డును మూసేశారనేది ఇక్కడ కీలకంగా మారింది.
వాస్తు రీత్యా వీధిపోటు ఉండటం వల్లే జీవీఎంసీ అత్యుత్సాహం ప్రదర్శించిందనీ.. అందువల్ల నగరవాసులు సమస్యలు ఎదుర్కొంటున్నారనేది జనసేన ఆరోపణ. ఈ విషయం గాజువాక బహిరంగ సభలో ప్రస్తావించిన పవన్ ఎంవీవీని ఏకిపాడేశారు. పవన్ వ్యాఖ్యలతో ఎంపీ అంతే ఘాటుగా రెస్పాన్డ్ అవ్వడం పవన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం జనసేన తీవ్రంగానే పరుగణించింది. ఆ దిశగా హయగ్రీవా ప్రాజెక్టులపై న్యాయ పోరాటం చేయగా ఎంపీకి ఇబ్బందులు తప్పవనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు టైకూన్ జంక్షన్ రోడ్డు వ్యవహారంపై ఆందోళనలు ప్రారంభించింది జనసేన. రాజకీయంగా ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని.. ఎంవీవీ కూడా బారికేడ్లు తొలగించాలని కోరినా ఇప్పటి వరకు యాక్షన్ లేదు. ఇటీవల నగరానికి వచ్చిన పవన్ కళ్యాణ్ టైకూన్ జంక్షన్ విషయంలో ఎందుకు చర్యలు లేవో ప్రశ్నించాలని, ఆ దిశగా పోరాటం చేయాలని సూచించారు.
దీంతో రోడ్డు ఎక్కిన జనసైనికులు ఎక్కడికక్కడ అరెస్ట్ అవుతుండగా.. నాదెండ్ల మనోహర్ సైతం నిర్బంధం ఎదుర్కోవడంతో ఈ అంశాన్ని మరింత బలంగా చేపట్టాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఎంపీ వెర్సస్ జనసేన ఫైట్ మరింత పీక్స్ కు చేరడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే, జనసేన పోరాటంలో టీడీపీ అంటీ ముట్టనట్టు వ్యవహరించడం ఇక్కడ మరో చర్చకు దారితీస్తోంది. ఎంపీని టార్గెట్ చేసే అవకాశం, బలం, బలగం ఉన్నప్పటి కీ సైకిల్ పార్టీ ఎందుకు కలిసిరావట్లేదని రెండు పార్టీల నేతలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఇలాంటి సమయంలో కూడా మనసులు కలవని మనువు అంటే మొదటికే మోసం తప్పదని వాపోతున్నారట టీడీపీ, జనసేన పార్టీల నేతలు. జనసేన ఒంటరిపోరాటంతో మిగిలి పోతుందా…సైకిల్ పార్టీ కలసి వస్తుందా..అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.