Tomato Offer: స్మార్ట్ ఫోన్ షాప్..ఇచ్చట టమాటాలు ఉచితంగా ఇవ్వబడును..

ఆఫర్.. ఆఫర్.. ఆఫర్.. ఈ పేరు వినగానే ఏ అమెజాన్, ఫ్లప్ కార్ట్, మీషో, అజియో లాంటి ఆన్లైన్ షాపింగ్ వేదికలు గుర్తుకొస్తాయి. పండగకు వారం ముందే అమెజింగ్ సేల్స్ పేరుతో ఆఫర్లను ప్రాపగండ చేసుకుంటాయి. దీంతో వినియోగదారులు వస్తువులను కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తారు. ఇదంతా ఒక ఎత్తైతే.. ఫుడ్ డెలివరీ చేసే జొమాటో.. ఉబర్ ఈట్స్, స్విగ్గి లాంటి యాప్ లు కూడా నిత్యం ఏదో ఒక ఆఫర్లతో రుచిప్రియులను ఆకర్షిస్తూ ఉంటారు. తద్వారా తమ వ్యాపారాన్ని వృద్ది చేసుకుంటారు. ఇలాంటి వాటికి భిన్నంగా ఒక యువకుడు తన షాపులో సెల్ ఫోన్ కొంటే రెండు కిలోల టమాటాలు ఫ్రీగా ఇస్తానంటూ ఒక విచిత్ర ఆఫర్ పెట్టాడు. అసలు ఈ ఆఫర్ పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది. ఏ ఊళ్లో ఇలా విన్నూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టాడో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Written By:
  • Publish Date - July 9, 2023 / 03:48 PM IST

ప్రస్తుతం బంగారం కంటే విలువైన వస్తువుల జాబితాలోకి నిత్యవసర వస్తువువైన టమాటాలు చేరిపోయాయి. వీటిని ఫ్రిజ్ లో పెట్టే కంటే బీరువాలో భద్రపరుచుకోవాలేమో అనేంతగా వీటి ధరలు పెరిగిపోయాయి. ఇక కొందరైతే ఈ టమాటాలను దొంగతనాలకు పాల్పడిన ఘటనలు కూడా ఇది వరకే చూశాము.అంతేకాకుంటా సినిమా వాళ్ల పై మీమర్స్ ట్రోల్స్ చేయడం చూసి ఉంటాము. కానీ ఇక్కడ టమాటాల పై వివిధ రకాలుగా కామెడీ పోస్టులను చేశారు. కానీ వీటన్నింటికీ పూర్తి భిన్నంగా ఒక యువకుడు చేసిన ప్రయత్నం అందరికీ ఆశ్చర్యానికి గురిచేసింది.

ప్రస్తుతం మార్కెట్లో పెరిగిన టమాటా ధరలను దృష్టిలో ఉంచుకొని తన వ్యాపారాన్ని మెరుగు పరుచుకునేందుకు మార్కెట్ స్టాటజీ వేశాడు. ఇతని పేరు అశోక్ అగర్వాల్. ఇతనికి మధ్యప్రదేశ్ లోని అశోక్ నగర్ లో చిన్న మొబైల్ షాపు ఉంది. తన సెల్ ఫోన్ విక్రయాలు పెంచుకునేందుకు మధ్యతరగతి వారిని ఆకర్షించేలా ఒక ఆలోచన చేశాడు. తన షాపులో సెల్ ఫోన్ కొనుగోలు చేస్తే రెండు కిలోల టమాటాలను ఉచితంగా ఇస్తానని ప్రకటించారు. దీంతో మొబైల్ కొనాలనుకున్న వారు ఈ షాపుకు పెద్ద ఎత్తున వచ్చి తమకు నచ్చిన మోడల్స్ కొనుగోలు చేసి రెండు కిలోల టమాటాలను ఉచితంగా పొందుతున్నారు. ఇలా ఆఫర్ ను ప్రకటించడం వల్ల కస్టమర్లు మునుపటి కంటే కూడా అధిక సంఖ్యలో వస్తున్నట్లు తెలిపాడు. స్మార్ట్ ఫోన్లు కూడా ఎక్కువగానే అమ్మడుపోయాయని తన ప్లాన్ వర్కౌట్ అయిందని ఆనందంలో ఉన్నాడు సెల్ ఫోన్ షాపు నిర్వాహకుడు అశోక్.

దీనిని బట్టీ అర్థం అయ్యిందేమిటంటే..కాలానుగుణంగా ఆఫర్లు, సీజన్ బట్టి వ్యాపారాలు చేయడం వల్ల ఎప్పటికీ లాభాలు పొందవచ్చు. అనాదిగా వస్తున్న ఈ మార్కెట్ ఫార్ములా వందశాతం సత్ఫలితాలను ఇస్తుందని మరో సారి రుజువైనట్లు చెప్పవచ్చు.

T.V.SRIKAR