Kai Raja Kai : ఏపీలో ఎలక్షన్‌ రిజల్ట్‌పై జోరుగా బెట్టింగ్‌

ఏపీలో ఎన్నికల (AP Assembly Elections) ప్రక్రియ ముగియటంతో బెట్టింగ్ బంగార్రాజులు హడావిడి మొదలైంది . పందెం రాయుళ్ళు పక్కా ప్లానింగ్‌తో బెట్టింగ్ కార్యకలాపాల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఏపీలో ఎన్నికల (AP Assembly Elections) ప్రక్రియ ముగియటంతో బెట్టింగ్ బంగార్రాజులు హడావిడి మొదలైంది . పందెం రాయుళ్ళు పక్కా ప్లానింగ్‌తో బెట్టింగ్ కార్యకలాపాల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే తమ దగ్గర ఉన్న సర్వే రిపోర్టులతోపాటు క్షేత్రస్థాయిలో ఉన్న వారితో కూడా టచ్ లోకి వెళ్ళి పందాలు కాస్తున్న పరిస్థితి ఉంది. ఏపీలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎమ్మెల్యే, ఎంపీ సీట్లతోపాటు మెజార్టీల మీద కూడా పందాలు మొదలయ్యాయి. వేరే రాష్ట్రాల్లో ఉన్న వారు కౌంటింగ్ సమయానికి ఏపీకి వచ్చేలా పక్కా ప్లానింగ్ చేసుకుంటున్నారు.

దీంతో ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా పందెం రాయుళ్ళ హడావిడే హాట్ టాపిక్‌గా మారింది. వచ్చే నెల 4న వచ్చే రాష్ట్ర ఎన్నికల ఫలితాల కోసం ఇప్పటి నుంచే ఏపీలో పందెం రాయుళ్ళ హడావిడి అప్పుడే మొదలైంది. పోలింగ్ పూర్తవటంతో పందెం రాయుళ్ళు తమ బెట్టింగ్ వ్యవహారాలను ముమ్మరం చేసేశారు. ఏపీ నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక నుంచి కూడా బెట్టింగ్ వ్యవహారాలను చక్కబెడుతున్నారని సమాచారం. ఇందుకు కొందరు అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగిస్తుంటే కొందరు బెట్టింగ్‌ బుకీలపై ఆధారపడ్డారు. బెట్టింగ్ లను కొన్ని కేటగిరీలుగా విభజించి పందెం రాయుళ్ళు పందాలు కాస్తున్నారు. జిల్లాల వారీగా ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది, జనసేన రెండు ఎంపీ సీట్లలో ఎన్నిగెలుస్తుంది, 21 అసెంబ్లీ స్థానాల్లో ఎన్ని జనసేన ఖాతాలో పడతాయి వంటి పలు అంశాల వారీగా పందాలు మొదలయ్యాయి. ప్రస్తుతానికి రూపాయికి రూ1.30పైసలు, రూపాయికి రూపాయిన్నర వరకు పందాలు కడుతున్నారు.

ఇవి మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్టు బెట్టింగ్ రాయుళ్ళు చెబుతున్న మాట. ఇక ఏపీలో బీజేపీకి ఎన్ని ఎంపీ సీట్లు వస్తాయి, ఎన్ని అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ గెలుస్తుందనే విషయాలపై కూడా బెట్టింగ్ రాయుళ్ళ పందాలు కడుతున్నారు. ఏపీలోనే కాకుండా కేంద్రంలో వచ్చే బీజేపీ సీట్లు, ఇండియా కూటమి సీట్లపై కూడా భారీ బెట్టింగులు జరుగుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి, కూటమికి ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై భారీగా బెట్టింగులు కడుతున్నారు. ఈ రెండు జిల్లాల్లోనే వందల కోట్ల బెట్టింగులు జరుగుతున్నాయని సమాచారం. ఇక ప్రధానంగా రాయలసీమలో టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయి, వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయనే అంశంపై భారీగా బెట్టింగ్ లు కడుతున్నారు. మెజార్టీలపరంగా సీఎం జగన్ మెజార్టీ లక్ష దాటుతుందని, పిఠాపురంలో పవన్ గెలుపు, ఓటమి, మెజార్టీలపై కూడా బెట్టింగ్ లు జరుగు తున్నాయి.

ఇక బెజవాడ, విశాఖ, కడప ఎంపీ స్థానాల్లో గెలుపుపై కూడా భారీగానే బెట్టింగ్ లు జరుగుతున్నాయి. వైసీపీలో, టీడీపీలో కీలక నేతలు పోటీకి దిగుతున్న సీట్లలో బెట్టింగ్ కు కూడా పందెంరాయుళ్ళు ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు. సర్వేలపై ఆధారపడకుండా పందేలు కాసే స్థానాల్లో క్షేత్రస్థాయిలో ఉండే వారితో నేరుగా మాట్లాడి అక్కడి పరిస్థితులను తెలుసుకుని మరీ పందాలు కాస్తున్నారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా, అంబటి రాంబాబు, అమర్నాధ్, అనిల్ కుమార్ యాదవ్, చింతమనేని ప్రభాకర్, అచ్చెన్నాయుడు, లోకేష్, బాలకృష్ణ పోటీ చేస్తున్న స్థానాలపై కూడా భారీ స్థాయిలో బెట్టింగులు జరుగుతున్నాయి. 20 రోజుల క్రితం నుంచే మధ్య వర్తుల దగ్గర డబ్బులు రెండు వర్గాలు కూడా ఇచ్చేసే వ్యవహారాలు కొనసాగుతున్నాయట. మధ్యవర్తులకు 2 శాతం కమిషన్ కూడా తీసుకునేలా ఒప్పందాలు జరుగుతున్నాయని సమాచారం.

ఇక ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌లను నిర్వహించే కొన్ని యాప్స్ ద్వారా ఎన్నికల బెట్టింగ్‌లను కూడా నిర్వహిస్తున్నారట. నేరుగా బ్యాంకు అకౌంట్లలోనే డబ్బులు పడేలా ఈ యాప్స్ లో లావాదేవీలను నిర్వహిస్తున్నారు బెట్టింగ్ గ్యాంగ్. నియోజకవర్గ స్థాయిలో గెలుపు ఓటములపై కోట్లల్లో పందాలు కాస్తుండటం చర్చగా మారింది. గన్నవరం, మైలవరం, గుడివాడ, నగరి, సత్తెనపల్లి, హిందూపురం, రాజమండ్రి సిటీ, బెజవాడ పశ్చిమ, దెందులూరు, పుంగనూరు, రాప్తాడు, శ్రీశైలం, తాడిపత్రి ఇలా పలు నియోజకవర్గాల్లో గెలుపు ఓటములపై భారీ స్థాయిలో బెట్టింగులు జరుగుతున్నాయి. కౌంటింగ్ జరిగే జూన్ నాలుగో తేదీనాటికి ఏపీకి వచ్చేలా పక్కా ప్లానింగ్ తో హోటల్స్ కూడా బుక్ చేసుకుంటున్నారు బెట్టింగ్ బంగార్రాజులు. ఎన్నికల కౌంటింగ్ పూర్తై మళ్ళీ ప్రభుత్వం ఏర్పడి మంత్రివర్గం ఏర్పడే వరకు బెట్టింగ్ రాయుళ్ళ హవావిడి ఉంటుందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతోంది.