మిగిలిన జిల్లాల్లో కూడా అదే పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ సోమవారం నుంచి కురుస్తున్న వానలకు బయటకు రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వచ్చే నాలుగు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. 5 జిల్లాలకు రెడ్, 7 జిల్లాలకు ఆరెంజ్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది. హైదరాబాద్‌లో రానున్న ఆరు గంటలు కీలకంగా మారనుంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జనాలు అప్రమత్తంగా ఉండాలని గ్రేటర్ అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు. వర్షం కారణంగా పలు మెయిన్ రోడ్‌లలో భారీగా వర్షం నీరు నిలవడంతో నిత్యం రద్దీగా ఉండే జంక్షన్లలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ఉప్పల్, రామాంతపూర్, సరూర్‌నగర్, మలక్‌పేట్, నాంపల్లి, గన్‌ఫ్యాక్టరీ, మెహిదీపట్నం, లక్డీకాపూల్, పంజాగుట్ట, అమీర్‌పేట్, ఎర్రగడ్డ, బేగంపేట్, సికింద్రాబాద్, కూకట్‌పల్లి, హైటెక్‌సిటీ, జేఎన్‌టీయూ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మియాపూర్ , మదీనా గూడా, శేరిలింగంపల్లి, దిల్ షుక్ నగర్, ఎల్ బి నగర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. 5 నుంచి 10 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిన వాహనదారులు సుమారు గంటన్నర నుంచి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. నగరంలో అత్యధికంగా మియాపూర్‌లో 3.67 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా విజయనగర్ కాలనీలో 3.2 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. జీహెచ్ఎంసీ, జలమండలి ఇరువురికీ కలిపి ఇప్పటివరకు దాదాపు 2వందల ఫిర్యాదులు వచ్చాయ్.
హైదరాబాద్ నగరానికి మరో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు పడతాయని ఐఎండీ అధికారులు సూచన చేయడంతో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నాలాల విస్తరణ పనులపై ఆరా తీశారు. వరదలు వచ్చినా తట్టుకునేలా, ప్రాణనష్టం జరగకుండా, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా విధులు నిర్వహించాలని సూచించారు. ఇక అటు హైదరాబాద్‌లోని అన్ని విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు ప్రకటించారు. విద్యార్థులు వర్షంలోనే తడుస్తూ విద్యాసంస్థలకు చేరుకున్న తర్వాత సెలవులను ప్రకటించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.