Heavy Rains: నార్త్‌ ఇండియాను వణికిస్తున్న వర్షాలు

భారీ వర్షాలు ఉత్తర భారతదేశాన్ని వణికస్తున్నాయి. ఢిల్లీ సహా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ-కశ్మీర్‌లో ఎడతెరపి లేని వర్షాలు కురుస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - July 10, 2023 / 01:30 PM IST

కుంభవృష్టిగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్థభించిపోయింది. చాలా రాష్ట్రాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. యమున సహా పలు నదులు పొంగి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. దీంతో వరద పోటెత్తి చాలా ప్రాంతాలు నీటిలో చిక్కుకుపోయాయి. వర్షాల కారణంగా జరిగిన ప్రమాదాల్లో మొత్తం 22 మంది చనిపోయారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ-కశ్మీర్ లో 17 మంది చనిపోగా.. యూపీ, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్‌లో ఐదుగురు చనిపోయారు. ముఖ్యంగా హిమాచల్‌ప్రదేశ్‌లో పరిస్థితి దారుణంగా ఉంది.

ఆ రాష్ట్రంలో కురిసిన వర్షానికి బియాస్ నది సహా అనేక నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. దీంతో ఆ నీరంతా గ్రామాల్లోకి చేరడంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. మనాలీలో కూడా వరదలు బీభత్సం సృష్టించాయి. వరద ఉద్ధృతికి దుకాణాలు, కార్లు కొట్టుకుపోయాయి. బియాస్ నది ఉగ్రరూపం దాల్చడంతో మరో టూరిస్ట్ స్పాట్ కులూలోనూ పరిస్థితి దారుణంగా తయారయ్యింది. దీంతో హిమాచల్ ప్రదేశ్‌లోని 10 జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో 14 చోట్ల పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. 13 ప్రాంతాలను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. రాష్ట్రంలో 700 రహదారులను మూసివేశారు. మరోవైపు చండీగఢ్, హరియాణా రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. మరో రెండు రోజుల పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు.