ప్రపంచ క్రికెట్ (World Cricket) లో భారత్, పాకిస్తాన్ (India Pakistan) క్రికెట్ మ్యాచ్ అంటే కేవలం ఆట మాత్రమే కాదు అంతకుమించి… చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్ జరుగుతుందంటే ఇరు దేశాల అభిమానులే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫాన్స్ సైతం ఆసక్తి గా ఎదురు చూస్తారు. ఆ అద్భుతమైన క్షణం వచ్చేసింది. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఇవాళే జరగబోతోంది.. సూపర్ ఓవర్లు.. సంచలన విజయాలతో సాగుతున్న టీ20 (T20) ప్రపంచకప్ (World Cup) జోష్‌ను మరింత పెంచేందుకు దాయాది జట్లు సై అంటున్నాయి.
ఈ మ్యాచ్ రెండు జట్లకూ కీలకమే. ఐర్లాండ్‌పై గెలిచి బోణీ కొట్టిన టీమ్ ఇండియా (Team India).. పాక్‌పై నెగ్గి సూపర్- 8కు చేరువ కావాలని చూస్తోంది. ఎప్పుడూ ఎలా ఆడుతుందో తెలియని పాక్ తొలి మ్యాచ్‌లో అమెరికా చేతిలో సూపర్ ఓవర్లో అనూహ్య పరాభవాన్ని మూటగట్టుకుంది. ఇప్పుడు రోహిత్ సేన చేతిలోనూ ఓడితే ఆ జట్టుకు సూపర్- 8 చేరే దారి క్లిష్టమవుతుంది. కానీ అమెరికా చేతిలో ఓడిందని పాక్‌ను తక్కువ అంచనా వేయలేం. పరిస్థితులు, ఫామ్, రికార్డులు.. ఇలా ఎలా చూసినా ఈ మ్యాచ్‌లో భారతే ఫేవరెట్.
ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ బౌలర్లు, టీమ్ ఇండియా బ్యాటర్ల మధ్య పోరు అమితాసక్తి రేపుతోంది. పిచ్ కూడా పేసర్లకు సహకరించే అవకాశం ఉంది. ఓపెనర్లు రోహిత్ (Rohit), కోహ్లి (Kohli)తో పాటు పంత్, సూర్యకుమార్, శివమ్ దూబె, హార్దిక్‌తో బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉంది. వీరిని అడ్డుకోవడం పాక్ బౌలర్లకు సవాల్ గానే చెప్పాలి. టీ20 (T20) ప్రపంచకప్ (World Cup) లో పాకిస్థాన్ పై టీమ్ ఇండియాదే మెరుగైన రికార్డుగా ఉంది. ఇప్పటివరకూ ఈ పొట్టికప్‌ల్లో దాయాదితో 7 మ్యాచ్‌లాడగా కేవలం ఒక్కదాంట్లోనే భారత్ ఓడింది. మరోవైపు పిచ్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. కొత్తగా నిర్మించిన డ్రాప్‌ఇన్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా లేదు.