Laddu Prices: వేలం పాటలో అత్యధిక ధర పలికిన లడ్డూలు ఇవే..

హైదరాబాద్ లో రికార్డ్ స్థాయిలో లడ్డూ వేలం జరిగింది. ఇందులో బండ్లగూడ ప్రధమ స్థానంలో నిలువగా.. బాలాపూర్ ద్వితీయ స్థానంలో నిలిచింది. మాదాపూర్ లోని మై హోమ్ అపార్ట్ మెంట్లో కూడా లడ్డూ వేలం వేయగా మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది.

  • Written By:
  • Publish Date - September 28, 2023 / 01:13 PM IST

హైదరాబాద్ నగర వ్యాప్తంగా నిమజ్జనాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఒకవైపు గణనాథుడు హుస్సేన్ సాగర తీరానికి తరలి వెళుతుంటే.. మరో వైపు లడ్డూ వేలం పాటల కూడా అంతే జోష్ లో కొనసాగుతున్నాయి. ఏ ఏడాదికి ఆ ఏడాదే అన్న విధంగా ఈ లడ్డూ వేలంపాట సాగుతోంది. హైదరాబాద్ గణేష్ శోభాయాత్ర చివరి రోజు బాలాపూర్ లడ్డూ వేలం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అయితే ఈ సారి మరి కొన్ని ప్రాంతాల్లో లడ్డూలను అధిక ధరకు సొంతం చేసుకున్నారు భక్తులు. ఎక్కడెక్కడ ఎంతెంత ధరలు పలికాయో ఇప్పుడు చూద్దాం.

బండ్లగూడలో రూ. కోటి 26 లక్షలు..

బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీర్తి రిచ్మండ్ విల్లాలో వినాయకుడి లడ్డూ వేలం నిర్వహించారు. హైదరాబాద్ చరిత్రలోనే రికార్డ్ స్థాయిలో 1.26 కోట్ల ధర పలికింది. అయితే ఈ లడ్డూను ఒక్కరే పడలేదు. కమ్యూనిటిలోని మొత్తం సభ్యలు ఒక సమూహంగా ఏర్పడి దీనిని దక్కించుకున్నారు.

రూ. 27 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ..

బాలాపూర్ గణేష్ కేవలం హైదరాబాద్ లోనే కాకుండా దేశ వ్యాప్తంగా పేరు గణించింది. ఇక్కడి లడ్డూ వేలం కూడా అంతే ప్రత్యేకత ఉంటుంది. ప్రతి ఏటా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఈ లడ్డూ వేలంలో పాల్గొంటారు. తాజాగా తుర్కయాంజల్ కు చెందిన దాసరి దయానంద రెడ్డి రూ. 27 లక్షలకు స్వామి లడ్డును దక్కించుకున్నారు. గత సంవత్సరం రూ. 24.60 లక్షలు పలుకగా ఈ ఏడాది 2.40 లక్షలు అధిక ధరకు పాట పాడి దక్కించుకున్నారు. బాలాపూర్ ఉత్సవ్ సమితి ముందుగా రూ. 1116 కు వేలం పాట ప్రారంభించింది.

మాదాపూర్ లో రూ. 25.50 లక్షలు పలికిన లడ్డూ..

మాదాపూర్ లోని మైహోమ్ భుజాలో కూడా లడ్డూ వేలం పాట నిర్వహించారు నిర్వాహకులు. ఈ వేలంలో భారీ ధర పలికినట్లు తెలుస్తోంది. ఇక్కడ చిరంజీవి గౌడ్ అనే వ్యక్తి రూ. 25.50 లక్షలకు స్వామి ప్రసాదాన్ని దక్కించుకున్నారు. ఇక్కడి లడ్డూ ఇంతటి ధర పలకడం ఈ ఏడాదే తొలిసారిగా చెబుతున్నారు.

T.V.SRIKAR