HINDENBURG RESEARCH: అదానీ వ్యాపారాలపై హిండెన్‌బర్గ్ రిసెర్చ్ సంచలన నివేదిక..!

  • Written By:
  • Publish Date - February 1, 2023 / 02:40 PM IST

అదానీ గ్రూప్‌ సంస్థల చైర్మన్‌ గౌతమ్‌ అదానీ ఆర్థిక అవకతవకలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నారయి. డొల్ల కంపెనీలతో ఆయన నిర్మించిన మాయా సామ్రాజ్యం మార్కెట్‌ను ముంచబోతున్నదంటూ ‘హిండెన్‌బర్గ్‌ రిసెర్చ్‌’ తాజా నివేదిక హెచ్చరించింది. అదానీ గ్రూప్‌ సంస్థల చైర్మన్‌ గౌతమ్‌ అదానీ, ఆయన కుటుంబసభ్యులు గడిచిన కొన్ని దశాబ్దాలుగా స్టాక్‌ మానిప్యులేషన్‌, అకౌంటింగ్‌ మోసాలకు పాల్పడ్డట్టు తెల్పింది. షేర్ల ధరలను కృత్రిమంగా ఎలా పెంచింది.. పన్ను ఎగవేత, మనీలాండరింగ్‌ మోసాల కోసం ఏయే అడ్డదారులు తొక్కిందో రెండేండ్లపాటు సమగ్ర దర్యాప్తు జరిపి రుజువులతో సహా ప్రచురించింది. కార్పొరేట్‌ ప్రపంచ చరిత్రలో దీన్నో అతిపెద్ద కుట్రగా అభివర్ణిస్తూ రాయిటర్స్‌, బ్లూమ్‌బర్గ్‌, ఫోర్బ్స్‌, క్వార్ట్‌ వంటి అంతర్జాతీయ న్యూస్‌ వెబ్‌సైట్లు ప్రధానంగా ప్రచురించాయి.

గౌతమ్‌ అదానీ నికర సంపద విలువ ప్రస్తుతం 120 బిలియన్‌ డాలర్లు అంటే మన దేశ కరెన్సీ ప్రకారం 9.7 లక్షల కోట్లు. మూడేండ్ల కిందట ఇది 20 బిలియన్‌ డాలర్లు అనగా 1.6 లక్షల కోట్లుగా ఉండేది. గత మూడేండ్లలో తన గ్రూప్‌నకు చెందిన 7 ప్రధాన లిస్టెడ్‌ కంపెనీల ముఖ విలువను ఎక్కువ చేసి, షేర్ల విలువను కృత్రిమంగా పెంచి ఆయన మోసానికి పాల్పడ్డారు. ఆ సమయంలో ఆయా కంపెనీల షేర్‌ విలువ సగటున 819 శాతం పెరిగింది. దీంతో మూడేండ్లలోనే ఆయన సంపద 100 బిలియన్‌ డాలర్లు అనగా 8.1 లక్షల కోట్లు పెరగింది. అదానీ సంస్థల ఆర్థిక స్థితిని ఫేస్ వ్యాల్యూతో లెక్కగట్టినప్పటికీ ఈ ఏడు కంపెనీలు 85 శాతం నష్టాలను నమోదు చేశాయి. ఇవి రెడ్‌జోన్‌లో ఉన్న కంపెనీలు. అయినప్పటికీ, ఆర్థిక అవకతవకలతో ఆయన ఈ కంపెనీల నష్టాలను బయటపెట్టలేదంటూ వెల్లడించాయి.

అదానీ గ్రూప్‌ మనీలాండరింగ్‌, అవినీతి ఆరోపణలకు గానూ భారీగా డబ్బు వెచ్చించినట్లు కూడా నివేదిక ఆరోపించింది. అదానీ పెద్ద సోదరుడు వినోద్‌ అదానీతో పాటు అదానీ కుటుంబ సభ్యులు పన్ను ఎగవేతకు పాల్పడ్డారు. మారిషస్‌లో 38 డొల్ల కంపెనీలతో పాటూ సిప్రస్‌, యూఏఈ, సింగపూర్‌, పలు కరేబియన్‌ దీవుల్లో పదుల సంఖ్యలో షెల్‌ కంపెనీలను ఏర్పాటు చేశారని తెలిపింది. ఈ కంపెనీల్లో ఉద్యోగులు లేరని, కార్యకలాపాలు జరిగేవి కాదని, అసలు అక్కడ కార్యాలయాలు, ఫోన్‌ నంబర్లు ఇవేమీ ఉండేవి కాదని వెల్లడించింది. అయినప్పటికీ, పన్ను ఎగవేతకు పాల్పడుతూ.. ఈ డొల్ల కంపెనీల నుంచి వేల కోట్ల రూపాయలు అదానీ గ్రూప్‌నకు పెట్టుబడులుగా వచ్చేవని వివరించింది. ఎగుమతులు, దిగుమతులకు సంబంధించి నకిలీ పత్రాలను సృష్టించడం, తప్పుడు టర్నోవర్‌ రిపోర్టుల తయారీ, కంపెనీల నుంచి డబ్బు దారి మళ్లించటం తదితర కార్యకలాపాలకు అదానీ కంపెనీలు పాల్పడ్డట్టు ఆరోపించింది. 1.4 లక్షల కోట్ల అవినీతి, మనీలాండరింగ్‌, పన్ను ఎగవేతకు సంబంధించి అదానీ గ్రూప్‌ ఇప్పటికే నాలుగు కేసుల్లో ప్రభుత్వ సంస్థల విచారణను ఎదుర్కొంటున్నదని గుర్తుచేసింది.

ఇటీవలె కేటీఆర్ కూడా దీనిపై స్పందించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలకు దమ్ముందా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అదానీ కంపెనీల అక్రమాలపై దర్యాప్తు చేసే దమ్ము ఈడీ, సీబీఐ, ఐటీ, సెబీకి ఉందా? ఈ వార్తను ఏ జాతీయ మీడియా కూడా ప్రసారం చేయదని కచ్చితంగా చెప్పగలను. చర్చా కార్యక్రమాలనూ ప్రధాన స్రవంతి మీడియా నిర్వహించదు. సోషల్‌మీడియా వేదికల నుంచి ‘హిండెన్‌బర్గ్‌ రిసెర్చ్‌’ నివేదికను తొలగించేలా ఎన్‌పీఏ గవర్నమెంట్‌ ఒత్తిళ్లు కూడా తీసుకురావచ్చు. అంటూ తనదైన శైలిలో స్పందించారు. ఎనిమిదేండ్ల క్రితం రూ.17 వేల కోట్ల నికర ఆస్తులను కలిగిన అదానీ.. ఇప్పుడు రూ. 9.8 లక్షల కోట్లకు పడగెత్తడం వెనుక ప్రధాని మోదీ ప్రభుత్వ సహకారంతో పాటు ఆర్థిక అవకతవకలు కూడా ఉన్నట్టు గతంలోనూ ఆరోపణలొచ్చాయి. హెచ్‌ఎస్‌బీసీ, స్టాండర్డ్‌ చార్టర్డ్‌, బార్‌క్లేస్‌, డాయిష్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ న్యూయార్క్‌ మెల్లాన్‌ లాంటి ప్రపంచంలోని దిగ్గజ బ్యాంకుల ద్వారా గత రెండు దశాబ్దాల్లో భారీగా అక్రమ లావాదేవీలు జరిగాయని అమెరికా ఆర్థికశాఖలోని ఫైనాన్షియల్‌ క్రైమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నెట్‌వర్క్‌ ఆరోపించింది. గనులు, రేవులు, విద్యుత్తు, ఎయిర్‌పోర్ట్‌లు, డాటా సెంటర్లు, రక్షణ ఉత్పత్తుల తయారీ, సిమెంట్‌, టెలికం, మీడియా తదితర రంగాల్లో విస్తరించింది. దీనికోసం అదానీ గ్రూప్‌ విపరీతంగా అప్పులు చేసిందని, దీంతో ఇది రుణ ఊబిలో చిక్కుకునే ప్రమాదం ఉందని అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ ఫిచ్‌ గ్రూప్‌ యూనిట్‌ క్రెడిట్‌సైట్స్‌ గత ఆగస్టులో హెచ్చరించింది. అధిక రాబడుల్ని ఆశించి, రుణ పెట్టుబడులతో చేపట్టిన అభివృద్ది ప్రణాళికలతో పాటూ పరిస్థితులు తారుమారైతే రుణ ఊబిలోకి దించుతాయని, దీంతో గ్రూప్‌ మొత్తం దివాలా తీసే ప్రమాదం ఉంటుందంటూ తీవ్ర హెచ్చరికను జారీచేసింది. దీని ప్రభావం ఎయిర్ పోర్టులు, పోర్టులపై పడే అవకాశం ఉంది.

ఇంతకు ఈ సంస్థ రీసెర్చ్ నిజమేనా.. ఎంతవరకూ నమ్మొచ్చు.. అనే అనుమానాలు కలుగవచ్చు. ‘హిండెన్‌బర్గ్‌ రిసెర్చ్‌’ ఓ ఫోరెన్సిక్‌ ఫైనాన్షియల్‌ రిసెర్చ్‌ సంస్థ. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్నది. సంస్థలో వాస్తవంగా పనిచేసేది ఐదుగురు ఉద్యోగులే అయినప్పటికీ, 60కి పైగా దేశాల్లోని ప్రభుత్వాలు, కార్పొరేట్‌ కంపెనీలు, ఆర్థిక సంస్థలతో సత్సంబంధాలు ఉన్నాయి. నికోలా కార్పొరేషన్‌, క్లోవర్‌ హెల్త్‌లో జరిగిన అక్రమాలను వెలికితీసిన ‘హిండెన్‌బర్గ్‌ రిసెర్చ్‌’ కార్పొరేట్‌ సంస్థ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అదానీ టోటల్‌ గ్యాస్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌, అదానీ పవర్‌, అదానీ విల్‌మర్‌ అనే ఏడు ప్రధాన సంస్థల్లో రిసెర్చ్ చేసింది. అదానీ గ్రూప్‌లో గతంలో పనిచేసిన సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు, వేలాది పత్రాలు, ప్రభుత్వ, అంతర్జాతీయ సంస్థల నిఘా నివేదికలు, అదానీ గ్రూప్‌ కంపెనీల బ్రాంచీలు ఉన్న 12కు పైగా దేశాలను పర్యటించి ఈ నివేదికను తయారుచేసినట్టు ‘హిండెన్‌బర్గ్‌ రిసెర్చ్‌’ ప్రతినిధులు తెలిపారు.

గతంలో సత్యం కంప్యూటర్స్‌ వ్యవస్థాపకుడు రామలింగరాజు.. లేని రాబడులను ఆదాయంగా చూపి 8 వేల కోట్ల రూపాయల మేర అకౌంట్ బుక్స్ ని తారుమారు చేశానని, షేర్‌ విలువను ఎక్కువ చేసి చూపానని 14 ఏండ్లపాటు సెక్యూరిటీస్‌ మార్కెట్లో కార్యకలాపాలు నిర్వహించడానికి వీల్లేకుండా 2018లో నిషేధం విధించింది. ఆ లెక్కన 8.1 లక్షల కోట్ల మేర అవకతవకలకు పాల్పడిన అదానీకి ఇంచుమించు 1400 సంవత్సరాలపాటు సెక్యూరిటీస్‌ మార్కెట్లో కార్యకలాపాలు నిర్వహించడానికి వీల్లేకుండా నిషేధం విధించడంతో పాటు.. 700 ఏండ్లపాటు జైలు శిక్ష విధించాల్సి ఉంటుంది