ఐపీఎల్ మెగావేలం కోసం ఫ్రాంచైజీలు ఈ సారి వ్యూహాత్మకంగా రెడీ అవుతున్నాయి. ఆరుగురిని రిటైన్ చేసుకునే అవకాశాన్ని పక్కా ప్లానింగ్ తో వినియోగించుకుంటున్నాయి. అయితే అక్టోబర్ 31 సాయంత్రం వరకూ ఏ ఫ్రాంచైజీ ఎవరిని రిటైన్ చేసుకుంటుందనేది మాత్రం తెలియడం లేదు. కొందరి ప్లేయర్లపై అంచనాకు వచ్చినా ఖచ్చితంగా మాత్రం చెప్పలేకపోతున్నారు. అదే సమయంలో ప్రత్యర్థి ఫ్రాంచైజీలకు అవకాశమివ్వకూడదన్న కారణంతో ప్రతీ టీమ్ తమ రిటెన్షన్ జాబితాపై చివరి నిమిషం వరకూ కసరత్తూ చేస్తూనే ఉంటోంది. కానీ చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం సోషల్ మీడియా వేదికగా తమ రిటెన్షన్ జాబితాపై హింట్ ఇచ్చింది. ఈ హింట్‌ను పట్టుకుని చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు.. ఏ ఏ ప్లేయర్లని తమ టీమ్ రిటెన్ చేసుకోబోతోందో అంటూ అంచనాలు వేస్తున్నారు.
ఈ ఎమోజీలను కాస్త జాగ్రత్తగా చూస్తే ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్లని ప్రతిబింబించే కొందరు ప్లేయర్స్ ను గుర్తు చేస్తున్నాయి. అయితే అన్ని ఎమోజీలు ఆ ప్లేయర్‌ని ప్రతిబింబిచవు.. కొన్నింటితో మాత్రం ప్లేయర్లు మ్యాచ్ అవుతున్నారు. ఫస్ట్ ఎమోజీని చూస్తే స్టార్ ప్లేయర్, ఫైర్ బ్రాండ్ రుతురాజ్ గైక్వాడ్ గా తెలుస్తోంది. అలాగే రెండో ఎమోజీలో కండల వీరుడు, పవర్ హిట్టర్, టీమ్‌లో యాంకర్ ఇన్నింగ్స్ ఆడే ప్లేయర్ గా శివమ్ దూబేను గుర్తు చేస్తోంది. మూడో ఎమోజీలో విమానం సింబల్ ఫారిన్ ప్లేయర్ పతిరణను ప్రతిబింబిస్తోంది. ఇక నాలుగో ఎమోజీలో హెలికాఫ్టర్ సింబల్ తో ధోనీ పేరును ఫ్యాన్స్ ఖాయం చేసుకుంటున్నారు. అలాగే ఐదో ఎమోజీలో గుర్రం స్వారీతో పాటు స్వార్డ్‌మ్యాన్‌షిప్ సింబల్ రవీంద్ర జడేజాను గుర్తు చేస్తున్నాయి. ఈ ఎమోజీలతో ముందు నుంచీ అనుకున్నట్టుగానే కీలక ఆటగాళ్ళందరినీ చెన్నై రిటైన్ చేసుకోబోతోందని అర్థమవుతోంది.
ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు కూడా ఇదే తరహాలో ఎమోజీలను చెన్నై సూపర్ కింగ్స్ పోస్ట్ చేసింది. అప్పట్లో రవీంద్ర జడేజా, ధోనీ, మొయిన్ అలీ, రుతురాజ్ గైక్వాడ్ లను సీఎస్కే రిటైన్ చేసుకుంది. ఇదిలా ఉంటే మాజీ కెప్టెన్ ధోనీని అన్ క్యాప్డ్ ప్లేయర్ గా తిరిగి చెన్నై దక్కించుకోనుంది. ధోనీ కోసమే అన్ క్యాప్డ్ రూల్ ను తీసుకొచ్చినట్టు కూడా వార్తలు వచ్చాయి. మరోవైపు వేలంలో కొందరు స్టార్ ప్లేయర్స్ పై చెన్నై కన్నేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ తమ కెప్టెన్ రిషబ్ పంత్‌ను వేలానికి వదిలేస్తే చెన్నై తీసుకునేందుకు రెడీగా ఉంది. అటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా అతని కోసం పోటీ పడే ఛాన్సుంది. 43 ఏళ్ల ధోనీ స్థానాన్ని పంత్ అయితే భర్తీ చేయగలడని చెన్నై ఫ్రాంఛైజీ భావిస్తోంది.