ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణకు సంబంధించి ఏసీబీ రిమాండ్ రిపోర్టులో అనేక కీలక అంశాలు బయటపడ్డాయి. బాలకృష్ణ ఇంటితో సహా 18 చోట్ల ACB అధికారులు సోదాలు చేశారు. 50 కి పైగా ప్రాపర్టీస్ డాక్యుమెంట్లు బయటపడ్డాయి. వాటి విలువ డాక్యుమెంట్లపై రూ.5 కోట్లు ఉంటే… మార్కెట్ విలువ పది రెట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇవే కాకుండా సోదాల్లో రూ.99 లక్షల క్యాష్ పట్టుబడింది. బ్యాంకు బాలెన్స్ 58 లక్షలు ఫ్రీజ్ చేశారు. నాలుగు కార్లు, రూ.8.26 కోట్ల విలువైన బంగారం, వెండి, వాచ్‌లు, ఫోన్లు, గృహోపకరణాలను సీజ్ చేసినట్లు రిమాండ్ రిపోర్టులో అధికారులు తెలిపారు.
బాలకృష్ణ తన ఇంటికి హైటెక్ హంగులు దిద్దారు. కాస్ట్ లీ పట్టుచీరలు 200కు పైగా దొరికాయి. అంతర్జాతీయ బ్రాండ్స్ కి చెందిన 120 వాచీలు సీజ్ చేశారు ఏసీబీ అధికారులు. ఇందులో గోల్డ్, సిల్వర్, ప్లాటినం వాచీలు ఉన్నాయి. ట్యాగ్ హ్యూయర్, రోలెక్స్, రాడో, ఫాసిల్, టిసాట్ లాంటి ఇంటర్నేషనల్ బ్రాండెడ్ హ్యాండ్ వాచ్ లు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 120 దాకా వాచీలు దొరికాయి. వీటి విలువ 32 లక్షల దాకా ఉంటుందని ACB అంచనా వేసింది. వీటితో పాటు 30కి పైగా ఆపిల్ ఫోన్లు, 31 ఆపిల్ ట్యాబ్స్ సీజ్ చేశారు.
ఇన్‌ఫ్రా కంపెనీల్లోనూ సోదాలు ఏసీబీ సోదాలు చేసింది. 155 డాక్యుమెంట్ షీట్లు, 4 బ్యాంక్ పాస్ బుక్స్ స్వాధీనం చేసుకున్నారు. పుప్పాలగూడ ఆదిత్య ఫోర్ట్ వ్యూలో విల్లా హౌజ్, సోమాజిగూడ లెజెండ్ తులిప్స్ లో ఫ్లాట్, శేరిలింగంపల్లిలో అధితలో ఫ్లాట్, మల్కాజిగిరి, చేవెళ్లలో ప్లాట్స్, నాగరకర్నూల్ లో 12.13ఎకరాలు, చేవెళ్ల, అబ్దుల్లాపూర్, భువనగిరి, యాదాద్రి, జనగాం, సిద్దిపేట, గజ్వేల్ లో భూములు, ప్లాట్స్ ఉన్నట్లు గుర్తించారు అధికారులు. అంతేకాకుండా.. 90 ఎకరాల ల్యాండ్ పత్రాలు సీజ్ చేశారు అధికారులు.
2023లో హైదరాబాద్ శివారుల్లో 1,2 లక్షల రూపాయలకు ఎకరం చొప్పున బాలకృష్ణ ల్యాండ్ కొన్నారు. శివారులో ఎకరా భూమి కనీసం మూడు కోట్ల రూపాయలు పలుకుతున్నాయి. కానీ బాలకృష్ణ మాత్రం లక్ష రూపాయలకు కొనడం విచిత్రం. బాలకృష్ణ ఆస్తుల విచారణ కోసం నాలుగు ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. బాలకృష్ణను ఏసీబీ కస్టడీలో తీసుకుంటే బ్యాంకు లాకర్లతో పాటు ఇంకా బినామీల బాగోతం కూడా బయటపడే అవకాశముంది.