దేశంలో పెరుగుతోన్న టెక్నాలజీ వాడుకుంటున్నారు సైబర్ నేరగాళ్ళు. దేశంలోనే ‘అతిపెద్ద’ డేటా లీక్ జరిగినట్టు న్యూస్ 18 నివేదిక చెబుతోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మీడియల్ రీసెర్చ్ ( ఐసీఎంఆర్ ) నుంచి సేకరించిన 81.5 కోట్ల మందికి పైగా భారతీయుల వ్యక్తిగత వివరాలు డార్క్ వెబ్‌లో లీక్ అయినట్లు అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ ‘రిసెక్యూరిటీ’ తెలిపింది.
సైబర్ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, ‘pwn001’ అనే మారు పేరుతో బ్రీచ్ ఫోరమ్స్‌లో ఒక థ్రెడ్‌ను పోస్ట్ చేశాడు గుర్తు తెలియని వ్యక్తి. తమది ప్రీమియర్ డేటా బ్రీచ్ డిస్కషన్ అండ్ లీక్స్ ఫోరమ్’గా చెబుతున్నాడు. ఇది 815 మిలియన్ల (81.5 crores) రికార్డులను యాక్సెస్ చేస్తోంది. ఇరాన్, టర్కీ, జర్మనీ లాంటి దేశాల మొత్తం జనాభాకు దాదాపు 10 రెట్లు ఎక్కువ. ఈ డేటా లీక్ పై ఐసీఎంఆర్ గానీ భారత ప్రభుత్వం నుంచి అధికారిక స్పందన లేదు. ఐసీఎంఆర్ నుంచి ఫిర్యాదు అందిన తర్వాత సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) దర్యాప్తు జరిపే అవకాశం ఉందని నివేదిక చెబుతోంది. దీంతో పాటు, వివిధ ఏజెన్సీలు, అలాగే మంత్రిత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులందరితో ప్రభుత్వం విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది.
లీక్ సమాచారం అమ్మకం..?
ఈ డేటా వివరాలను 80000 dollarsకు (రూ. 66.60 లక్షలు) అమ్మడానికి సిద్దమైనట్లు సమాచారం. లీకైన వివరాలు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ఐసీఎంఆర్ ) దగ్గర ఉన్న భారతీయులకు చెందినవే అంటున్నారు.
గతంలోనే ఇలాంటి లీక్స్ ?
డేటా చోరీ అనేది దేశంలో ఇదేం మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలానే బయటపడ్డాయి. జూన్‌లో కోవిడ్ వెబ్‌సైట్ నుంచి వ్యాక్సినేషన్ చేసుకున్న లక్షల మంది భారతీయుల సమాచారం లీకైంది. అంతకు ముందు ఢిల్లీ ఎయిమ్స్‌లో ఔట్ పేషెంట్ విభాగంలోని రోగుల రికార్డులను హ్యాకార్స్ హ్యాక్ చేశారు.
ఆధార్ కార్డ్ ఐడీలతో హ్యాకర్స్ ఏం చేస్తారు..?
భారతీయులకు ఆధార్ చాలా ముఖ్యమైన ఐడీ కార్డ్. డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డు, ప్యాన్ కాడ్డ్, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఆధార్ కార్డు తప్పనిసరి.. అలాంటి ఈ కార్డు వివరాలు సైబర్ నేరగాళ్ల చేతిలో పడితే ట్యాక్స్ రిఫండ్ మోసాలు, బ్యాంకింగ్ దోపిడీలు, ఐడీ కార్డులతో ఇతర నేరాలకు పాల్పడే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు సైబర్ నిపుణులు.