ఎప్పుడు ఏం జరుగుతుందో.. సీబీఐ గురి ఎక్కడ పడుతుందో.. అర్థం కాని పరిస్థితి. ప్రతీ సీన్ క్లైమాక్స్‌లా అనిపిస్తోంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం ! వెలుగులోకి వస్తున్న రోజుకో విషయం.. రాజకీయాల్లో సెగలు రేపుతోంది. మద్యం వ్యాపారులు, వారికి సహకరించిన వారు అరెస్ట్ అయ్యారు. ఇది జస్ట్ టీజర్ మాత్రమే.. పిక్చర్ అభీ బాకీ హై అన్న రేంజ్‌లో.. సీబీఐ, ఈడీ కదలికలు కనిపిస్తున్నాయ్. మనీష్ సిసోడియా అరెస్ట్‌తో ట్రైలర్ చూపించినట్లు అయింది. సిసోడియా అరెస్ట్ తర్వాత.. సీబీఐ గురి పెట్టబోయేది ఎవరు అనే దానిపై చర్చ జరుగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి చార్జిషీట్లలో ఇప్పటివరకూ 15 మంది పేర్లు వినిపిస్తే.. వారిలో మెజారిటీ నిందితులు అరెస్ట్ అయ్యారు. ఈ కేసుకు సంబంధించి సీబీఐ, ఈడీ మొదటి నుంచి దూకుడు మీద కనిపిస్తున్నాయ్. చిన్న విషయం కూడా వదలకుండా విచారణ జరుపుతున్నాయ్.
ఇండో స్పిరిట్స్ సంస్థ డైరెక్టర్ సమీర్ మహేంద్రు, అరబిందో గ్రూప్‌నకు చెందిన శరత్ చంద్రా రెడ్డి, పెర్నార్డ్ రిచర్డ్ కంపెనీకి చెందిన బినొయ్ బాబుతో పాటు.. అభిషేక్ బోయినపల్లి , విజయ్ నాయర్ , బడ్డీ రిటెయిల్ సంస్థ డైరెక్టర్ అమిత్ అరోరా, గౌతమ్ మల్హోత్రా, చారియట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన రాజేష్ జోషి, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవను ఇప్పటివరకు సీబీఐ అరెస్ట్ చేసింది. ఇండో స్పిరిట్స్ డైరెక్టర్‌గా ఉన్న సమీర్ మహేంద్ర.. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సన్నిహితుడైన దినేష్ ఆరోరా బ్యాంక్ ఖాతాలోకి కోటి రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేసినట్లు ఈడీ చెప్తోంది. ఇక ఆ తర్వాత డబ్బు సిసోడియాకు చేరిందని సీబీఐ ఆరోపించింది. కోట్ల రూపాయల నగదు బదిలీ చేసిన విజయ్ నాయర్, రామచంద్ర పిళ్ళై, అర్జున్ పాండే మీద ఈడీ కేసులు నమోదు చేసింది. అభిషేక్ బోయినపల్లి, రామచంద్ర పిళ్లై హైదరాబాద్‌కు చెందిన వారు.
ఇందులో అభిషేక్ కు ఎమ్మెల్సీ కవిత కుటుంబంతో బంధుత్వం ఉంది. సమీర్ మహేంద్రుకు చెందిన ఇండో స్పిరిట్స్ కంపెనీలో అభిషేక్ ద్వారానే.. కవిత పెట్టుబడులు పెట్టారంటూ చార్జిషీట్‌లోనూ తెలిపారు. ఇక కవిత దగ్గర ఆడిటర్‌గా పనిచేసిన గోరంట్ల బుచ్చిబాబును ఈ మధ్యే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక తెలుగు రాష్ట్రాలకే చెందిన అరబిందో ఫార్మా కంపెనీ ఎండీ శరత్‌చంద్రారెడ్డి, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు రాఘవ, ముత్తా గౌతమ్‌ను అరెస్టు చేశారు. ఆ సందర్భంగా దాఖలు చేసిన చార్జిషీట్లలోనూ కవిత పేరును ప్రస్తావించారు. దీంతో ఇప్పుడు సీబీఐ నెక్ట్స్ టార్గెట్ ఎవరు అనేది ఎమ్మెల్సీ కవిత మీద మరింత ఫోకస్ పెట్టబోతోందా అనే చర్చ మొదలైంది.