ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు.. కోర్టు ముందు ప్రవేశపెట్టారు. హైదరాబాద్ ఇంట్లో ఐటీతో కలిసి సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు.. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ తీసుకెళ్లారు. ఆ తర్వాత కవితకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి.. రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచారు. విచారణ కోసం 10రోజుల రిమాండ్ కోరారు. ఐతే ఆమెను మహిళగా దృష్టిలో ఉంచుకుని.. 7రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు కోర్టు అనుమతి ఇచ్చింది. దీంత కవితను ఈడీ అధికారులు ప్రత్యేకంగా ప్రశ్నించబోతున్నారు. ఐతే కవిత దోషిగా తేలితే.. ఎన్ని సంవత్సరాల జైలు శిక్ష పడుతుందనే చర్చ ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతోంది.
కవితపై ఈడీ అధికారులు ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో నేరం రుజువైతే.. నిందితులకు 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు శిక్ష పడనుంది. దీంతో పాటుగా 5 లక్షల జరిమానా విధిస్తారు. మరీ ముఖ్యంగా కవిత నిందితురాలిగా రుజువైతే.. తన ఎమ్మెల్సీ పదవి కూడా కోల్పోవాల్సి ఉంటుంది. ఈ కేసులో కనీసం 45రోజులైన జైలు లో ఉండాల్సి వస్తుంది. ఆ తర్వాతే బెయిల్ వచ్చే అవకాశం ఉంటుదని న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితను ఈడీ అధికారులు.. ఈ నెల 23 వరకు విచారించనున్నారు.
లిక్కర్ స్కామ్‌లో కింగ్‌పిన్, ప్రధాన కుట్రదారు, మద్యం పాలసీకి ప్రధాన లబ్దిదారు కవిత అని ఈడీ చార్జిషీట్‌లో తెలిపింది. శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ, మాగుంట శ్రీనివాసులు రెడ్డితో కలిసి కవిత అవకతవకలకు పాల్పడ్డారన్నది ఈడీ వాదన. మద్యం పాలసీ ద్వారా భారీ లాభాలు పొందేందుకు 100 కోట్లు చందాలు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయ్. ఐతే ఇప్పుడు జ్యూడిషియల్ కస్టడీలో కవితను ఈడీ అధికారులు ఏం ప్రశ్నలు అడగబోతున్నారు. ఎలాంటి విషయాలు రాబడతారు అన్నది ఆసక్తికరంగా మారింది.